Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


లన్నియును పద్యాత్మకములై, పర్యాయపదములను మాత్రమే తెలుపుచున్నవి.

ఈ కాలమున ఆంగ్లనిఘంటు పద్ధతి తెలుగునందును అనుసరింపబడుటచేత ప్రాచీనాంధ్ర నిఘంటువులను చదువు వారు బహుస్వల్ప సంఖ్యాకులు. నవీనపద్ధతికి మార్గదర్శకమైన మొట్టమొదటి తెలుగు నిఘంటువును విలియం బ్రౌను అను నతడు 1807 లో “A Vocabulary of Gentoo and Telugu" అను పేరుతో ప్రకటించెను. అకారాది వర్ణక్రమమున వెల్వడిన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులలో ఇదియే మొదటిది. ఆనాడు తెలుగుదేశములో వ్యవహారమునందున్న పెక్కు శబ్దములు అనగా తెలుగు వారు సాధారణముగా ఇంటను, బయటను వాడుక చేసెడి పదములేకాక కోర్టుకచ్చేరీలలో వ్యవహారరీతిగా వాడుకొనెడి పదములుకూడ ఇందున్నవి. మరియు ఉపయోగ సరణి ఎక్కువ స్పష్టముగా తెలియ జేయబడినది. ఇందు "అ" ఆ' లతోగల పదముల తరువాత క కారముతోగల పదములే యున్నవి. ఇ, ఈ, ఎ, ఏ లతో నుండవలసిన పదములు యీ, యీ, యె. యే లతోను; ఉ, ఊ, ఓ, ఓ లతో నుండవలసిన పదములు వు, వూ, వొ, వో లతోను; ఋకారముతో నుండవలసినవి, రుకారముతోను ఆయా స్థలములందున్నవి. ఇది వ్యవహారము నందలి ఉచ్చారణ పద్దతిని అనుసరించియున్నది.

ఈ విలియంబ్రౌను నిఘంటువు వెనువెంటనే ఎ. డి.కాంబెల్ రచించిన ఇంకొక 'తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు 1810 ప్రాంతమున వెల్వడినది. ఇదికూడ అంతగా చెప్పదగిన సమగ్ర నిఘంటువు కాదు. ఇవి తెలుగు సభ్యసింపదలచిన ఆంగ్ల విద్యావంతులకుమాత్రము ఉపయోగపడును. ఇంగ్లీషు రాని తెలుగువారి కుపయోగపడునట్లుగా 'తెలుగు. తెలుగు' నిఘంటువును అకారాదిగా మొట్టమొదట రచించినవాడు మామిడి వెంకయ్య. ఇతని 'ఆంధ్రదీపిక' 1848 లో ముద్రితమయినను 1816లోనే రచింపబడినదట. శ్రీ చుండూరి రంగనాయకులు శ్రేష్ఠి రచించిన 'ఆంధ్రదీపిక' మరియొకటి గలదు. ఇది శాలివాహన శకము 1771 లో అనగా క్రీ. శ. 1849 లో ముద్రితమయినది. ఇవి రెండును భిన్నము లగునో, కావో తెలియదు.

ఈ నిఘంటువుల పిమ్మట సి.పి. బ్రౌను నిఘంటువులు ప్రకటితములయినవి (1852-54). ఈతడు పై ఇద్దరు పాశ్చాత్యుల కంటే ఎక్కువవిద్యాధికుడు, తెలుగుభాషలో అపారమయిన కృషి చేసిన పండితుడు, పెక్కురు పండితుల సాహాయ్యముతో ఆతడు 'ఇంగ్లీషు-తెలుగు', తెలుగు ఇంగ్లీషు' అను రెండు పెద్దనిఘంటువులను ప్రకటించెను. అంతేకాని తెనుగుభాషయందు వ్యవహారములోనున్న హిందూస్థానీ, ఆంగ్లము, తమిళము, మరాఠీ మొదలగు భాషలకు చెందిన పదములను కూర్చి, మిశ్ర నిఘంటువను పేర ఇంకొక నిఘంటువునుకూడ రచించెను.

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువునందు తెలుగు పదములకు ఆంగ్లార్థములే కాక, తెలుగు అర్థములుకూడ ఒసగబడినవి. శబ్దార్థములను స్పష్టము చేసెడి లోకోక్తులను పూర్వకవి ప్రయోగ విశేషములను చక్కగా వివరించెను. ఇట్లు ఈ నిఘంటువును రచించి సి. పి. బ్రౌను ఆంధ్రభాషకు మహోపకార మొనర్చినాడు. ఈ నిఘంటువే తరువాతి ఆంధ్ర నిఘంటువుల కెంతేని ఉపయోగపడినదనుటలో అతిశయోక్తి లేదు. అంతేకాక బూజుపట్టి చెదలపాలగుచున్న పెక్కు ప్రాచీనాంధ్ర గ్రంథములను ప్రకటించిన ఖ్యాతియును బ్రౌనుకే దక్కినది.

చిన్నయసూరి నిఘంటువు  : పై నిఘంటువులలో లోపములను తొలగించి పండితాదరణ పాత్రమయిన సమ గ్రాంధ్ర నిఘంటువును సమర్థతతో రచించుటకు పరవస్తు చిన్నయసూరి సమకట్టెను. కాని, పదముల యొక్క పట్టి కను తయారుచేయువరకే చిన్నయసూరిజీవించియుండెను ప్రతి పదమునకును, ప్రతియర్థమునకు నిర్ధారకములయిన ప్రయోగములను మాత్రమే ఇతడు సేకరించుటకు మొదలు పెట్టెను. శబ్దస్వరూప నిర్ణయమునకుతోడ్పడని యతిప్రాసాదు లందు వాడబడిన ప్రయోగములనే సూరి గ్రహించెను. ఈ ఉత్తమ నిఘంటువు పూర్తియైయున్నచో ఆంధ్రభాషకు మహోపకారము జరిగియుండెడిది.

శబ్దరత్నాకరము  : శ్రీ బహుజనపల్లి సీతారామచార్యులుగారు దీనిని 1885లో ప్రకటించిరి. చిన్నయ సూరి నిఘంటువు యొక్క మహాప్రారంభమును గాంచి అవి పరిపూర్తి యగుటకు బహుకాలము చెల్లుననియు, పరిపూర్తి అయినను అందు తెనుగుపదములు మాత్రమే