ఆంధ్ర లక్షణగ్రంథములు
కార్జున నామధేయాంకితంబైన కవిసర్ప గారుడంబున గణాక్షర ఫలంబన్నది ప్రథమాశ్వాసము" ఇత్యాది గద్యములచే ఈ కవిని గురించిన యంశములు తెలియుచున్నవి. ఈ గ్రంథమునందు గణాక్షర దేవతా ఫలాదివిషయములు, ఛందశ్శాస్త్రము, మంత్రశాస్త్ర మనదగినంతగా తెలుపునట్టి పూజాక్రమాదులు, వాటితోపాటు శృంగారాది రసభావములు వివరించబడినవి. యతుల ఉదాహరణములతో ఈ తాళపత్ర ప్రతి ముగిసినది.
ఆనంద రంగరాట్ఛందము : ఇది కస్తూరి రంగయ ప్రణీతము. నాలుగాశ్వాసముల గ్రంథము. “లక్షణ చూడామణి" అని దీనికి నామాంతరము. “ఇది శ్రీ మదు మామహేశ్వర కరుణాకటాక్ష లబ్ద సాహితీ విభవ ధర్మ వెచ్చకుల జలధి కుముదమిత్ర, వేంకటకృష్ణార్య పుత్ర, విద్వజ్జనమిత్ర, కుకవిజనతాలవిత్ర, ఆర్వేల కమ్మెని యోగికులీన లక్షణకవి కస్తూరి రంగయ ప్రణీతంబయిన ఆనంద రంగ చ్ఛందంబను లక్షణ చూడామణియందు సర్వంబును చతుర్థాశ్వాసము" అను గ్రంథాంత గద్యము కవిని గురించి తెలుపుచున్నది. ఇది కేవల చ్ఛందో గ్రంథమనదగి యున్నది.
సులక్షణ సారము : ఇది లింగమకుంట తిమ్మకవి విరచితము. కాని ఈ గ్రంథము వెల్లంకి తాతంభట్టు ప్రణిత మయినట్టు ముద్రింపబడి నేటివరకును సులక్షణసార మనగానే తాతంభట్ట రచితమన్న విషయము పాఠకుల హృద యమున నాటుకొనిపోయినది. అది సత్యము కాదు. సులక్షణసారమును రచించినవాడు తిమ్మకవియే. వెల్లంకి తాతంభట్టు 'కవిచింతామణి'ని రచించిన ప్రాచీన విద్వాంసుడు. తిమ్మకవి అర్వాచీనుడు. గత సంవత్సరమున వావిళ్ళవారు సులక్షణసారమును సంస్కరించి పునర్ముద్రితము గావించినారు. దానిమీద లింగమకుంట తిమ్మకవి పేరును ముద్రించి పూర్వముద్రణమున జరిగిన పొరపాటును పీఠికలో వివరించియున్నారు. "శ్రీరామా కుచ మండలీ మిళిత. . . "ఇత్యాది పద్యములు మార్చి తాళపత్ర పరిశోధనమువలన లభించిన క్రొత్తపద్యములను గొన్నిటిని చేర్చి పూర్వ సులక్షణసారముకన్నను మంచి ప్రతినిగా సిద్ధము చేసినారు,
అప్పకవీయము : కాకునూరి అప్పకవి ఈ గ్రంథమును రచించెను. ఇది నన్నయభట్టారక రచితమయిన 'ఆంధ్ర శబ్దచింతామణి'ని ఆధారముగా గొని బహుళాంశములను జేర్చి, కూర్చి రచించిన గ్రంథము. కవి యుద్దేశమున నిది వ్యాకరణ ప్రధానమయిన సమగ్ర లక్షణ గ్రంధమే. కాని ఛందోవిషయములు విపులముగా నుండుటయు, తదితర భాగములు తక్కువగా నుండుటయు, గ్రంథ మసంపూర్ణ మగుటయు కారణములుగా ఛందో గ్రంథముగానే దీనికి బహుళ ప్రచారము కలిగినది.
ఆంధ్రశబ్ద చింతామణి యందలి సంజ్ఞా, సంధి, తత్సమ, దేశ్య, క్రియాపరిచ్ఛేదములు అను ఐదింటిని విస్తరించి భాషా పరిచ్ఛేదము, వర్ణపరిచ్ఛేదము, వళి ప్రాస పరిచ్ఛేదము, పద్య పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, దేశ్య పరిచ్ఛేదము, క్రియా పరిచ్ఛేదము అను నామములతో ఎనిమిది ఆశ్వాసములుగా రచించుటకు అప్పకవి యుద్దేశించెను. కాని తత్సమ దేశ క్రియా పరిచ్ఛేదములు గ్రంథమునందులేవు. సంధి పరిచ్ఛేదము వరకే అయిదాశ్వాసములతోనే అసమగ్రముగా నిలిచిపోయినది. (పరిషత్పుస్తక భాండాగారమున నొక అప్పకవీయ తాళపత్ర ప్రతికలదు. అందు సంధి తత్సమ పరిచ్ఛేదములకు సంబంధించిన లక్ష్య లక్షణములున్నవి. ఆ భాగము నేటి ముద్రిత ప్రతులందు లేనిది. అది అప్పకవీయము యొక్క మిగిలిన భాగము కావచ్పునేమో యని యూహించుటకు వీలున్నది.) గ్రంథము పూర్తిగా రచింపకముందే అప్పకవి దివంగతుడై యుండవచ్చునని పలువురు తలచుచున్నారు. కాని పరిషత్పుస్తక భాండాగారము పేర్కొన్న తాళపత్ర ప్రతినిబట్టి యూహించినచో అప్పకవీయము పూర్తిగా మనకు లభింప లేదేమోయని చెప్పుటకు వీలున్నది. ఉన్న గ్రంథములో వళిప్రాస, పద్య పరిచ్ఛేదములుగల భాగము మిక్కిలి విస్తృతమై ఉపయోగకరముగా నుండుటచేత ఇది ఛందో గ్రంథముగా ప్రచారమును గాంచుట సమంజసముగానే యున్నది.
అప్పకవికి శాలివాహనశకము 1578 మన్మథనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమినాడు (క్రీ.శ. 1656 సం. ఆగష్టు 3వ తేదీ) కామేపల్లిలో నుండగా కల వచ్చినట్లును, చింతామణికి విపులమగు వ్యాఖ్యానము వ్రాయవలెనని స్వప్నమున కనిపించి విష్ణువు కవికి ఆజ్ఞ నిచ్చినట్లును అప్పకవీయమున గలదు. అప్పకవి పలనాటిసీమ