ఆంధ్ర లక్షణగ్రంథములు
ఇందు రాజనరేంద్ర చరిత్రము, కమలాకర చరిత్రము అంబాల భాణము మున్నగు నపూర్వ గ్రంథములనుండి ప్రయోగములు గై కొనబడినవి. ఛందో లక్షణములు సులక్షణసారమునుండియే గ్రహింపబడినవి. ఈ కవి క్రీ.శ. 1630 తరువాతి వాడని పరిశోధకులు తలచుచున్నారు.
సుకవి కర్ణామృతము : ఇది కౌలూరి ఆంజనేయ కవి రచితము. దీనికి 'కుకవికర్ణ కఠోరము' అను నామాంతరము గలదు. ఇందు యతిప్రాస ప్రకరణములు మాత్రమే కలవు. గురు లఘు నిర్ణయము, గణవిభజనము గ్రంథాదిని తెలుపబడినవి. లింగమగుంట తిమ్మన్నకృతమైన బాల బోధచ్ఛందస్సునుండియు, చిత్రకవి పెద్దన వ్రాసిన లక్షణ సార సంగ్రహమునుండియు లక్షణములు స్వీకరించబడినవి. ఈ కవి క్రీ. శ. 16 వ శతాబ్ది ప్రాంతము వాడని పరిశోధకు లూహించుచున్నారు.
లక్షణమంజరి : ఇది నైషధము తిమ్మకవి ప్రణీతము. ఏకాశ్వాస గ్రంథము. ఛందోవిషయక గ్రంథమైనను కొన్ని వ్యాకరణాంశములు సైత మిందు చేరియున్నవి. లక్ష్యలక్షణములు స్వయముగా కవి రచించినవే. ఈ గ్రంథము గరళపురీశ్వరున కంకితము చేయబడుటచే దీనికి “గరళపురీచ్ఛంద" మను పేరు సైతము కలదు. ఈ గరళపురము మైసూరు రాష్ట్రమునగలదు. కవి ఆ ప్రాంతము వాడేయని విశ్వసింపబడుచున్నది.“యతులును, గణములు, ప్రాసము, లతులం బగు సంధివిధము లక్షర ఫలముల్, వితతాంధ్ర మహిమలెల్లను, జతురత వివరింతు సుకవిజాలము మెచ్చన్" అని కవిచేసిన ప్రతిజ్ఞ వలన మనకు గ్రంథస్థ విషయములు ఊహింప వీలగుచున్నవి. ఇతడు ఇతర లాక్షణికులకంటె విలక్షణముగా ఏబది యతులను బేర్కొనియున్నాడు. విషయము ఏకీభవించినను యతుల పేర్లు క్రొత్తగా నున్నవి. "శుద్ధ స్వర యతి, గూఢస్వర యతి, ఋత్వహిత యతి, ప్రకారసంధి యతి, తద్భవయతి, చిత్రయతి, శకంధు యతి, ఆదేశ యతి. సహార్ధ యతి, చతుర్థీవిభక్తి యతి, పంచమీవిభక్తి యతి. ప్రభునామ యతి. సంయుక్తోష్మ సహార్థయతి" ఈ రీతిగా ఏబదియు క్రొత్త పేర్లతోనున్నవి. ఇదియును అముద్రితమే.
కవితాలక్షణసారము : రామయకవి దీనిని రచించెను. ఇది ఏడధ్యాయముల అముద్రిత గ్రంథము. కవిచింతా మణి మొదలగు లక్షణ గ్రంథములనుండి ఉదాహరణములు గ్రహింపబడినవి. భోగావళి, బిరుదావళి, గుణావళి, చక్రవాక, చతుర్భద్ర, చతురంతర, చౌశొత్తర, త్యాగఘోష, జయఘోష మొదలయిన రగడలక్షణములును, లక్ష్యములును సంస్కృతాంధ్రములలో రచింపబడినవి. ఈకవి హరితసగోత్రుడు. తండ్రి పేరు అనంతయా మాత్యుడు.
లక్షణదీపిక : ఇది గౌరనవిరచితము. నవనాథ చరిత్రము మున్నగు ద్విపద కావ్యములను రచించిన గౌరనకు ఈలక్షణదీపికా కర్తయగు గౌరనకు సంబంధమేమేని గలదా అను విషయ మింకను బరిశోధకులు నిర్ణయింప వలసిన విషయముగా నున్నది. "గౌరన లక్షణదీపిక" అను పేరుతో నధికముగా చాటు ప్రబంధ లక్షణములను దెలుపునట్టి మరియొక సంస్కృతగ్రంథప్రతి యున్నట్లు పరిషత్పు స్తక భాండాగార పట్టిక తెలుపుచున్నది. ఈ లక్షణ దీపికయందు ఐదు పరిచ్ఛేదములు గలవు. అక్షరములు, వాటి శుభాశుభఫలములు, వర్ణాధిదేవతలు, రూక్ష స్నిగ్ధ వర్ణవిచారము, గణములు, గణాధిదేవతలు. వాటి శుభాశుభ ఫలములు, నక్షత్రములు, రాసులు, మాతృకార్చన మున్నగు నంశము లిందు క్రమముగా చర్చింపబడినవి. గ్రంథము పద్యములు, శ్లోకములు, సంస్కృత వాక్యములు కలిగి యున్నది.
కావ్యచింతామణి : "కవిచింతామణి”, “కావ్యాను శాసనము" అనునవి దీనికి నామాంతరములు. వెల్లంకి తాతంభట్టు దీనిని రచించెను. తాతంభట్టు "సాహిత్య చక్రవర్తి", “అష్ట భాషా ప్రక్రియా లబ్ధవర్ణుడు" అని అతడు వ్రాసికొన్న పద్యమువలన తెలియుచున్నది. కావ్యచింతామణియందు "దోషాధికారము, ప్రాసాధికారము, భాషా లక్షణాధికారము" ఈరీతి విభాగము కలదు. పావులూరి మల్లనగణితము, భాస్కరరామాయణము, అనంతుని ఛందము మొదలయిన గ్రంథములనుండి లక్ష్యలక్షణములు గ్రహింపబడినవి. ఇదియు అముద్రితమే.
కవిసర్పగారుడము : కాచన బసవన దీనిని రచించెను. "ఇతి శ్రీమన్నందవరకుల కలళపారావార - ఆత్రేయస గోత్ర పవిత్ర, సుజనవిధేయ, కుకవి కాద్ర వేయ వైన శ్రేయ, కాచన బసవననామధేయ ప్రోక్త శ్రీగిరి మల్లి