ఆంధ్ర లక్షణగ్రంథములు
లక్షణసార సంగ్రహము :- చిత్రకవి పెద్దనార్యుడు దీనిని రచించెను. ఇది మూడాశ్వాసముల గ్రంథము. ఈ
కవి 16 వ. శతాబ్ది మధ్యకాలమున నున్నవాడు. “పార్శంచాల" అనునది ఇతని ఇంటి పేరని గ్రంథపీఠికను బట్టి తెలియుచున్నది. కాని అది "పార్శంచాల" అయి యుండవలెను. పార్శంచాల గ్రామము కర్నూలుకు 40 మైళ్ళ దూరమున నున్నది. ఈ గ్రంథమునందు అక్షర జాత్యాది లక్షణము మొదలుకొని ఛందోలక్షణములును, పద్య లక్షణములును, రేఫ, ఱకార భేదములును, చిత్ర కవిత్వ లక్షణమును, షట్ప్రత్యయ విశేషమార్గములు మున్నగు విషయములును గలవు. ఏ తెలుగు లక్షణ గ్రంథమునందునులేని దశరూపకముల (నాటకాదుల) లక్షణము లిందు గలవు. దీనినే కొందరు పూర్వులు సర్వ లక్షణసారసంగ్రహ మనిరి. రమణకవి సాంబవిలాసము నందు "సర్వలక్షణసార సంగ్రహం బొనరించి తనరె మీతాత పెద్దన కవీంద్రు" డని వ్రాసెను. (కూచిమంచి తిమ్మకవి వ్రాసిన సర్వలక్షణసార సంగ్రహము దీనికంటె భిన్నము) ఈ లక్షణసార సంగ్రహము అప్పకవికి మార్గ దర్శకమై యుండునని విమర్శకులు తలంచుచున్నారు. ఇతర చ్ఛందోగ్రంథములందు రెండుమూడు పాదములలో గాని ఇముడని వృత్తలక్షణములు ఈ గ్రంథమున నొక్క పాదముననే ఇముడ్పబడి యుండుటచేత సులభముగా కంఠస్థము చేయుటకు అనువుగానున్నవి. చిత్రకవితా రీతులయందీ కవి మిక్కిలిచాతుర్యమును జూపియున్నాడు.
లక్షణ శిరోమణి :- ఇది పొత్తపి వేంకటరమణ కవిచే రచింపబడినది. ఈకవి తాము నందవరమున నుండిన వార మనియు, క్రమముగా తమ ఇంటి పేరు "గ్రంథాలవారు, రాయనప్రగ్గడవారు, పొత్తపివారు, దుర్గరాజు వారు"గా మారిన దనియు తెలిపియున్నాడు. ఇది నాలుగాశ్వాసముల గ్రంథము. దీనియందు వర్ణగణ వృత్తవిశ్రమాధికారములు గలవు. వర్ణగణములను గురించి మిక్కిలి విపులముగా వ్రాసియున్నాడు. ఇతడు కేవల లక్షణస్వరూపమునే తెలుపుచు తాను వ్రాసిన లక్షణములకు సంబంధించిన ఇతర కవులు లక్షణములను సైతము తెలిపియున్నాడు. తా నెరిగిన లక్షణగ్రంథ ముల నిట్లు పేర్కొనియున్నాడు. "భీమన ఛందస్సు అనంతుని ఛందస్సు, లక్షణసారసంగ్రహము (చిత్రకవి పెద్దన), లక్షణదీపిక (వార్తాకవి రాఘవయ్య). అధర్వణ ఛందస్సు, శ్రీధర ఛందస్సు, గోకర్ణ ఛందస్సు, కవిసర్ప గారుడము, కవిరాజ గజాంకుశము, వాదాంగ చూడా మణి" మున్నగునవి. గణపవరపు వేంకటకవిచే రచింప బడిన పెద్ద లక్షణ గ్రంథమగు 'లక్షణ శిరోమణి' కంటెను ఇది భిన్నమని వ్యక్తమగుచున్నది. ఈ గ్రంథమున యతి ప్రాస విషయము మిక్కిలి విపులముగా నున్నది. పూర్ణ-అర్థబిందు ప్రాసము మొదలయిన పెక్కు నూతనాంశములు ఇందు గలవు.
లక్షణ శిరోమణి :- ఇది గణపవరపు వేంకటకవి రచితము. ఇందు ఛందో వ్యాకరణాలం కారములను గూర్చి తెలుపునట్టి పది యుల్లాసము లుండినట్లు తెలియుచున్నది. కాని అన్నియు లభింపలేదు. అయిదుల్లాసములు మాత్రము 'ఆంధ్ర సాహిత్య పరిషత్తు" వారికి లభించినవి. ప్రథమోల్లాసమున మహాకావ్య స్వరూపమును, ద్వితీయోల్లాసమున వేంకటేశాంధ్ర నిఘంటువును, తృతీయోల్లాసమున ఆంధ్ర కౌముదియు, చతురోల్లాసమున ఛందో విషయమును, పంచమోల్లాసమున రేఫ ఱకార నిర్ణయమును గలవు. ప్రథమా శ్వాసము యొక్క చివరనున్న గద్యమందు గ్రంథకర్త పేర్కొన్న బహుళాంశములుగల ఇతర గ్రంథ భాగము దురదృష్టవశమున లభింపలేదు. ఆంధ్ర వాఙ్మయము నందలి లక్షణ గ్రంథములలో ఈ లక్షణ శిరోమణి ద్వయము ఛందోవ్యాకరణములను గురించి సమగ్రముగా తెలుపుచున్నది. ఈ గ్రంథకర్తలు క్రీ.శ. 17 వ శతాబ్దమువారు. అయినను అపూర్వములయిన ప్రాచీన గ్రంథముల నుద్ధరించిరి. ఇవి ముద్రింపబడినచో ఆంధ్ర వాఙ్మయమున నూతనాంశము లెన్ని యో భాషాసేవకులకు తెలియగలవు. పరిషత్పు స్తక భాండాగారము వారు మరికొన్ని లక్షణ గ్రంథములను పట్టికలో నిచ్చియున్నారు. వాటిలో ముద్రితములు, అముద్రితము లును గలవు. సంగ్రహవిజ్ఞానముకొరకై వాటిని గురించి తెలిసికొందము.
సకల లక్షణసారసంగ్రహము :- ఇది కొన్ని గ్రంథముల సంపుటి. ఇందు ముఖ్యముగా రత్నాకరము గోపాల కవి ప్రణీతమైన “సకల లక్షణసార సంగ్రహము" గలదు.