ఆంధ్ర లక్షణగ్రంథములు
III ఛందశ్శాస్త్రము :- పద్యరూపమయిన కవిత్వము ప్రాచీన కాలమునుండియు మన భాషలో కన్పట్టు చున్నది. నన్నయకు పూర్వపు శాసనములందు దేశీయ ఛందస్సులైన తరువోజ, అక్కర, సీసము, ఆట వెలది మొదలగునవి వాడబడియున్నవి. ఇవి మాత్రాగణయుతములు. తరువాత నన్నయభట్టు అక్షరగణ బద్ధములైన ఉత్పలమాలాది వృత్తములను గూడ ఉపయోగించి, ఆంధ్ర ఛందస్సామగ్రిని విస్తరింప జేసెను. నన్నయ భట్టారకుడు చింతామణియందు కొన్ని ఛందో విషయములను "ఆద్యోవళిః" మున్నగువాటిని సూచించెను. మొత్తముమీద కొన్ని తెలుగు కావ్యములు రచింపబడు వరకును ఛందో లక్షణము గ్రంథరూపమున లేకుండెనని యూహింప వచ్చును.
కవిజనాశ్రయము :- భీమన ఛందస్సు అను ప్రసిద్ధిని బడసిన ఈ గ్రంథమే ప్రథమాంధ్ర చ్ఛందో గ్రంథము. వేములవాడ భీమకవి ఈ గ్రంథమును క్రీ. శ. 12వ శతాబ్దమున రచించెను. జైన వైశ్యుడైన మల్లియరేచన ఇందలి ప్రతి పద్యమునందును రేబా! రేచన శ్రావకా భరణాంక ! ప్రభృతి నామములతో సంబోధింపబడినాడు. కవిజనాశ్రయము భీమకవి కృతము కాదనియు రేచనయే దీనిని రచించెననియు నొక వాదము కలదు. బులుసు వేంకట రమణయ్యగారు ఇది రేచన కృతమని భావించినారు. వారి మతము ప్రకారము నైత మీ గ్రంథము క్రీ. శ. 12, 13 శతాబ్దముల నాటిదే. “వేములవాడను వెలసిన, భీమేశ్వర కరుణగల్గు భీమసుకవినేఁ, గోమటి రేచనమీదను, నీమహిఁగవులెన్న ఛంద మెలమి రచింతున్" ఇత్యాది పద్యములను ఉదాహరించియు, లోక ప్రతీతి ననుసరించియు, విమర్శయుతముగా శ్రీ జయంతి రామయ్య పంతులుగారు భీమకవి హైదరాబాదు రాష్ట్రమునందలి వెలిగందల వేములవాడయందుండి కవిజనాశ్రయమును రచించెనని నిశ్చయించియున్నారు. వారి మతమే పరంపరాగతమై బహు జనాదరమునొంది యున్నందువలన భీమకవి కవిజనాశ్రయమును రేచనకు అంకితముగా రచించె నని విశ్వసింతము.
ఇది ఛందోలక్షణములను దెలుపు గ్రంథమేయైనను ఇందు కావ్యప్రయోజనములు, కావ్య దోషములు మున్నగు మరికొన్ని విశేషములును గలవు. మొదటిది యగు సంజ్ఞాధికారమున గురులఘు వివేకము, గణస్వరూపము, యతిప్రాసముల నిర్ణయమును గలవు. రెండవది వియతి ఛందో౽ధికారము, ఇందు 26 ఛందములు, యతి రహితవృత్తములు, వాటి లక్షణములు వివరింపబడినవి. మూడవదియగు యతిఛందో౽ధి కారమున యతిని పాటింపదగిన వృత్తములు చెప్పబడినవి. నాలుగవదియగు ఉద్ధరమాలా వృత్తాధికారమునందు లయగ్రాహి, లయ విభాతి, త్రిభంగి, లయహారి, దండక అను వాని లక్షణములు చెప్పబడినవి. ఐదవది అర్థసమవృత్తాధి కారము.ఇందు నారీఫ్లుత, రతిప్రియాది వృత్తములు తెలుపబడినవి. ఆరవది విషమవృత్తాధికారము. ఏడవదియగు జాత్యధికారమునందు కందము, ఆర్య, గీతిభేదములు, సీసము, ఉత్సాహము, తరువోజ, గీదియ, అక్కరలు, ద్విపద, త్రిపద, చౌపద, షట్పద ఇత్యాదులు వివరింపబడినవి. (రగడ లక్షణము కవిజనాశ్రయమునందు లేదు. అది యర్వాచీనము, మరికొన్ని పద్యభేదములు ఆర్వాచీన లాక్షణికులచే నిరూపింపబడినవి). ఎనిమిదవ ఆధికారమున ఛందశ్శాస్త్రమునకు సంబంధించిన షట్రత్యయములును, తొమ్మిదవ అధికారమున కావ్యదోషములును తెలుపబడినవి. ఇట్లు నవాధికార పరిమితమైన ఈ ఛందోగ్రంథము మనకు లభించినవాటిలో ప్రాచీనతమమగుటచేత వ్యాకరణమునందు నన్నయవలె ఛందశ్శాస్త్ర విషయమున భీమకవి ప్రామాణికుడుగా నేటికిని ఎన్నుకొనబడు చున్నాడు.
ఛందోదర్పణము : ‘అనంతుని ఛందస్సు' అను నామాంతరముగల ఈ గ్రంథమును రసాధరణకర్తయగు అనంతా మాత్యుడు రచించెను. ఛందోదర్పణము నాలుగా శ్వాసముల గ్రంథము. మొదటి యాశ్వాసమున సంజ్ఞ, యతి, ప్రాస, ప్రకరణములు గలవు. రెండవ యాశ్వాసమున గద్యలక్షణము, వృత్తలక్షణములును, వివరింపబడినవి. మూడవ యాశ్వాసమున జాతులు, షట్రత్యయములును చెప్పబడినవి. నాలుగవ యాశ్వాసమున దోషవివరణము, వ్యాకరణాంశము లైన సంధి సమాసం వివరణములును గలవు. ఇది కవిజనాశ్రయము నాధారముగాగొని వ్రాసిన గ్రంథము వలె నున్నది. కాని సులభగ్రాహ్యముగా నున్నది.