Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


సాంకర్యములును చెప్పబడినవి. నాల్గవ యాశ్వాసము నాయికా నాయక లక్షణములు గలిగియున్నది. కావ్యాలంకార చూడామణి తరువాత ఆంధ్రలక్షణ గ్రంథములలో బేర్కొనదగినది రసాభరణమే.

శృంగార రసాలవాలము  : ఇదియు ప్రాచీనమగు లక్షణ గ్రంథమే. వెణుతుర్ల వడ్డీకవి దీనిని రచించెను. ఈ కవి శుక్ల యజుశ్శాఖీయుడు. తండ్రి మంగళగిరి. తాత వెంగనార్యుడు. ఇతని నివాసముగాని, కాలముగాని తెలియదు. శృంగారరసాలవాలము మూడాశ్వాసముల గ్రంథము. ప్రథమాశ్వాసమున కావ్యలక్షణమును, రత్యాది భావస్వరూపములు మొదలయిన శృంగారసామగ్రీవర్ణనమును గలవు. ద్వితీయాశ్వాసమున నాయికా భేదములును, తృతీయాశ్వాసమును ప్రోషిత భర్తృకాది - అష్టవిధ శృంగార నాయికాది భేదములును తెలుపబడినవి. ఇతని మరియొకకృతి బాలగోపాల విలాసము.

ఆంధ్రనటప్రకాశిక  : శ్రీ పసుపర్తి యజ్ఞనారాయణ శాస్త్రి దీనిని రచించెను (1980). ఇతడు నాటకకర్త గాయకుడు, నాట్యాచార్యుడు, కవి. తన స్వీయానుభవమును పురస్కరించుకొనియు, కొంతవరకు ప్రాచీన శాస్త్రకర్తల ననుసరించియు, రూపకాభినయ గాంధర్వ విద్యాసూత్రములను నిర్దుష్టమును, శాస్త్రసిద్ధమునైన శైలిలో క్రోడీకరించెను. ఇది పది ప్రకరణములుగా విభజింపబడినది. అవి అభినయము, సంగీతము, నాయకులు,రసము, నాటకము, ప్రయోగము, రంగము, కావ్యము, నటుడు, పాత్రము అనునవి. ఇందు ఆయానటుల వేషధారణమునకు సంబంధించిన పెక్కు చిత్రములుకూడ కలవు.

శ్రీ పురాణం సూరిశాస్త్రి నాటక విమర్శనమును చేయుచు పెక్కు గ్రంథములను ప్రకటించెను. 1. నాట్యాం బుజము (తెలుగునాటక, రంగస్థలాది విమర్శనము); 2. నాట్యోత్పలము (పాశ్చాత్య నాటక విమర్శనము): 3. నాట్యాశోకము; 4. నాటకసంఘ సంస్కరణము మొదలగునవి. శ్రీ గొల్లపూడి శ్రీరామశాస్త్రిగారు ‘ఆంధ్రనాటక రంగము' అనునొక గ్రంథమును ప్రకటించిరి. శ్రీ బల్లారి రాఘవాచారిగారు 'నాటక దీపిక' అను చిన్న గ్రంథమును రచించిరి. ఇవి యన్నియును ఆంధ్ర నటప్రకాశికకు ఇంచుమించుగా సమకాలికములే.

దశరూపక సంగ్రహము  :- క్రీ.శ. 1891 ప్రాంతముల శ్రీ కొమండూరు అనంతాచార్యులు దీనిని రచించిరి. ఆంధ్రీకృత సంస్కృత నాటకములు పాఠ్య గ్రంథములుగా నుండెడివి. కాని రూపకలక్షణమును దెల్పు ఆంధ్ర గ్రంథము లేకుండెను. అందుచేత వీరు ధనంజయకృత 'దళరూపకము'ను సంగ్రహించి దశరూపక సంగ్రహమను పేర వచనములో వ్రాసినారు.

అలంకారతత్త్వ విచారము  :- దీనిని శ్రీ కురుగంటి సీతారామయ్యగారు రచించినారు (క్రీ. శ. 1915). కావ్యము, శబ్దాలంకారములు, అర్థాలంకారములు అను విషయములు ఇందు చర్చింపబడినవి. స్వతంత్ర విమర్శనమునకు దొరకొనిన ప్రథమ గ్రంథములలో నిది యొకటి. జక్కన 'విక్రమార్క చరిత్రము'ను గూర్చిన లఘువిమర్శనము కూడ ఇందు చివరను గలదు.

ఆంధ్ర కువలయానందము  :- శ్రీ కంభంపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి దీనిని రచించెను. (క్రీ.శ. 1947) అప్పయ దీక్షితుని కువలయానందమున కిది యొక్కటియే సమగ్రానువాదము. అనువాదము సుబోధము కావలెనను తలంపుతో వచనమందు రచించి నలుగురును వాడుకొను పదములనే ఎక్కువగా వాడియున్నారు. ద్వితీయ ముద్రణము మరింత సుబోధకముగా నున్నది.

గీర్వాణ రూపకము  :- శ్రీ తల్లావజ్ఝల కృత్తివాస తీర్థులు దీనిని రచించిరి. కేవల నాటక లక్షణములను దెలుపు నట్టి గ్రంథముగా దీనిని పరిగణింప వచ్చును. రూపకములు, ఉపరూపకములు, వాని లక్షణములు, ఉదాహరణ గ్రంథముల నామములు ఇందు వివరింపబడినవి. ఈ గ్రంథము వచనరూపము. “ప్రాదుర్భావము, రూపక భేదములు, రూపకశబ్దము, నృత్తాదికము, రూపక భేదములు, లక్షణము, రూపక వివరణము, వ్యుత్పన్న రూపకములు, రూపక పరిణామము. ప్రేతాగృహము (Theatre), ఉపరూపకములు, కొందరు నాటక కర్తలు, పరిభాషలు అను విషయములతో సులభ గ్రాహ్యముగా ఈ గ్రంథము రచింపబడి యున్నది.

ఇట్లు లక్షణ గ్రంథముల శ్రేణియందు చేర్పదగిన మరికొన్ని చిన్న యలంకార గ్రంథములు, కందుకూరి వీరేశలింగము పంతులు మున్నగువారు రచించినవి కలవు.