Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


దీయబడినవి.శ్రీ రంగాచార్యులుగారు క్షేమేంద్రుని ఔచిత్య విచారచర్చను సైత మనువదించిరి. అది అముద్రితము.

నవరస గంగాధరము  :- శ్రీ జమ్ములమడక మాధవ రామశర్మగా రీ గ్రంథమును రచించిరి. ఇది జగన్నాథ పండిత రాయల రస గంగాధరము యొక్క ప్రథమాననమునకు ఆంధ్ర వివరణము. ఉదాహరణ శ్లోకములు మూలము నందలివే. విషయ వివరణము, చర్చ శిష్ట వ్యావహారికాంధ్రభాషలో రచింపబడినవి. శ్రీశర్మగారిదేవిధముగా విద్యానాథుని ప్రతాపరుద్రీయమును అనువదించిరి.

నాట్య శాస్త్రము :- ఇది ప్రథమ సంస్కృతాలంకార గ్రంథము. భరతముని ప్రణీతము. నాట్యోత్పత్తి, నాట్య శాల, పూర్వరంగము, తాండవము, రసములు, భావములు, ఆంగికాభినయము, వాచికాభినయము, ఛందస్సు దశరూపకములు, ముఖాధి సంధులు, ఆహార్యాభినయము, సంగీతము, వాద్యములు మొదలగు విషయములు ఇందు 36 అధ్యాయములలో విపులముగా చర్చింపబడినవి. డాక్టరు పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు దీనికి విపులమైన వ్యాఖ్యానమును రచించి "భారతి" యందు వరుసగా ప్రకటించి యుండిరి. శ్రీ జమ్ములమడక మాధవరామశర్మగారు నాట్యశాస్త్రమును సంగ్రహించి తెనిగించిరట. ఇది అముద్రితము. శ్రీ భాగవతుల కుటుంబ శాస్త్రి కూడ దీనిని అనునదించి త్రిలింగలో రెండు అధ్యాయములు ప్రచురించిరి. శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు సంగీతశాస్త్ర భాగమును వదలి తక్కిన 30 అధ్యాయములను తెనిగించి “సంస్కృతి"లో వరుసగా ప్రకటించుచున్నారు. వీరు భామహుని "కావ్యాలంకారము"ను గూడ తెనిగించి వ్యాఖ్యానమును రచించిరి. ఇది అముద్రితము. ఇవన్నియును గద్యానువాదములే.

ఆంధ్ర కావ్యాలంకార సూత్రవృత్తి :- ప్రాచీనాలంకారికులలో కావ్యాత్మ 'రీతి' యని సిద్ధాంతీకరించిన వామనుని కావ్యాలంకార సూత్ర వృత్తికిది అనువాదము. దీనిని వేదాల తిరువేంగళాచార్యులుగారు రచించిరి. శ్రీ ఆచార్యులుగారు సూత్రములను, వృత్తిని వచన రూపమున అనువదించినారు. సూత్రసంఖ్యలతోసహా తెలుగు సూత్రములు రచింపబడినవి. ఉదాహరణములను తెలుగు కావ్యములలో ప్రాచీనార్వాచీన రచనలనుండి సేకరించినారు.

ధ్వన్యాలోకము  :- "కావ్యాత్మధ్వని" యని స్ధాపించి లోకమున సాహిత్యాచార్య మూర్ధన్యుడుగా పరిగణింపబడిన ఆనందవర్ధనుని ధ్వన్యాలోకమును కొందరు అనువదించి యున్నారు. వారిలో పేర్కొనదగిన వారు శ్రీ వేదాల తిరు వేంగళాచార్యులుగారు. వీరు మూలమును జక్కగా ననువదించుటయేకాక ఉదాహరణములను తెలుగు ప్రబంధముల నుండియు, ఆధునిక రచనలనుండియు ఎత్తి చూపించినారు. ఇది వీరిరచనలోని వైశిష్ట్యము. ఇక నీగ్రంథము నాంధ్రీకరించిన వారిలో బొడ్డపాటి కుటుంబరాయశర్మ, పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి) (విజయనగర సంస్కృత కళాశాలా పండితులు), భాగవతుల కుటుంబశాస్త్రి గారలు ప్రశంసింప దగినవారు. వారి రచనలు యథామూలముగా నున్నవి. కుటుంబ శాస్త్రిగారి అనువాదము సుబోధముగా నున్నది కాని గ్రంథము 'కొంతవరకే రచింపబడినది. ఇక నందరికన్న ముందు జెప్పదగినవారు అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. ధ్వన్యాలోకమునందు 'ధ్వని' యని మాత్రము పేర్కొనదగిన మూల భాగమునకు వీరి రచన పద్యాను వాదము,

రసాభరణము  :- అనంతామాత్యు డీ గ్రంథమును క్రీ.శ, 1434 లో రచించెను. భోజరాజీయము, ఛందో దర్పణము, అనునవి ఇతడు రచించిన మరి రెండు గ్రంథములు. రసాభరణము శృంగార రసమును, తత్సామగ్రిని సమగ్రముగ నిరూపించునట్టి గ్రంథము. ఇందు నాలుగాశ్వాసములు గలవు. మొదటి ఆశ్వాసమున స్థాయిభావముల యొక్కయు, విభావానుభావ సాత్త్వికభావముల యొక్కయు లక్ష్య లక్షణములును నవరసముల ఉదాహరణములును గలవు. రెండవ యాశ్వాసమున ఆలంబనోద్దీపన విభావలక్షణములును; సాత్త్విక సంచారి భావముల లక్షణోదాహరణములును గలవు. హావభావాది శృంగార చేష్టలు ఉద్దీపన విభావాంతర్గతములు అను విషయ మిందు నిరూపింపబడినది. మూడవ యాశ్వాసమునందు శృంగార భేదములును, చక్షుః ప్రీత్యాది ద్వాదశావస్థలును, నాట్యశాస్త్ర ప్రో క్తములయిన శృంగార భేదములును, భావోదయాదులును, రస