ఆంధ్రభాషా చరిత్రము
ఆతర్వాత 7 సంవత్సరములకే ప్రపంచము నావహించిన ఆర్థికమాంద్యము, 1935 లో ట్రావెన్కూరు నేషనల్ అండ్ క్విలన్ బ్యాంకు పతనము, 1942 లో యుద్ధ కాలమున జపానుదాడులు గూర్చిన ప్రజల భయములు, ఇవన్నియు బ్యాంకు అభివృద్ధి కార్యక్రమములపై ఒత్తిడి కలుగ జేసినవి. కాని అదృష్టవశమున ఆ దుమారములకు ఈ సంస్థ తట్టుకొనజాలినది. అనేక పర్యాయములు విస్తరణ కార్యములను వాయిదా వేయవలసివచ్చినది. ఉదాహరణకు 1934 లో రిజర్వుబ్యాంకు సంస్థాపనము నిశ్చయింపబడెను. కాని అందు షెడ్యూలు బ్యాంకుగా చేరు అర్హతయుండుటకు వసూలయిన మూలధనము విలువలు కలసి కనీసము 5 లక్షల రూపాయ లుండవలెను. మూలధనము పెంపుదలకు బ్యాంకు చేసిన ప్రయత్నము ఫలింపక ఆ ప్రయత్నమును వాయిదా వేయవలసివచ్చినది. కాని 1943 లో ఆ యాశయము నెరవేరి రిజర్వు బ్యాంకు ఆక్టు రెండవ షెడ్యూలులో ఈ బ్యాంకు పేరు నమోదు చేయబడెను. దేశములో ప్రారంభమైన ద్రవ్యోల్బణముకూడ ఈ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడెను. 1944 నాటికి ఇందలి డిపాజిట్లు ఒక కోటిరూపాయలకు పెరిగెను. శాఖలు కూడ స్థిరముగ అభివృద్ధి చూపదొడగినవి. అయితే, కొన్ని మాత్రము లాభసాటిగా లేనివి మూసి వేయవలసి వచ్చెను. ఉదాహరణమునకు ఈ బ్యాంకి రెండవశాఖ హైదరాబాదులో 1930 లో తెరువబడినను, అది లాభసాటిగా లేనందున 1940 లో మూసి వేయవలసివచ్చెను.
విజయకారణములు : ఇంతవరకు ఈ సంస్థ ఆశయములను దీని నిర్వహణమునం దుద్భవించిన సమస్యలను పరిశీలించితిమి. కాని ఈ సంస్థ బాలారిష్టములను జయప్రదముగా ఎదుర్కొనుటకుగల కారణములను పేర్కొనవలసి యున్నది.
అందులకు మొదటికారణము ఈసంస్థ కేవలము కొందరి వ్యక్తులకై కాక ఆంధ్రదేశ ఆర్థిక స్వయంపోషకత్వ కార్యక్రమములో ఒక అంగముగా ఉన్న తాశయములతో నుద్భవించుట. ఐతే కేవలము ఉన్నతాశయములవల్ల ఏసంస్థయు వర్ధిల్లదు. ఉన్నతాశయములతోపాటు దూర దృష్టి, సామర్థ్యము కావలయును. ఈసంస్థకు 7 సంవత్సరములు మేనేజింగ్ డైరక్టరుగా, డైరక్టరుగా పనిచేసిన డా. పట్టాభిగారు మితవ్యయము, జాగరూకత అను విధానములకు పునాదులు వైచిరి. ఉదాహరణమునకు ప్రారంభమున సంవత్సరమునకు ఒకటికంటె ఎక్కువ శాఖలు తెరువకుండను, అదికూడ అంతకు పూర్వము తెరచినది లాభసాటిగా నడుచుచున్నట్లు తెలిసిన పిమ్మటనే మరియొకశాఖ తెరచునట్లును తగిన జాగ్రత తీసికొనబడినది. అంతేగాక ఈసంస్థ నిర్వహణబాధ్యత వహించిన శ్రీయుతులు డి. యస్. శాస్త్రి, కె. సుబ్బారావు, వారణాసి కృష్ణమూర్తి, ఇ. రామచంద్రమూర్తి మొదలగు నిపుణుల కృషికూడ ఈసంస్థ యొక్క విజయమునకు మరొక హేతువు. ఆంధ్రదేశములోని వివిధరంగములకు చెందిన ప్రముఖులు డైరక్టర్, మేనేజింగ్ డైరక్టర్, చైర్మన్ మొదలగు పదవులను అలంకరించి, ఈ సంస్థ అభివృద్ధికి దోహదము చేసిరి. ఈ సంస్థ వాటాదార్లకు ప్రతి సంవత్సరము లాభములు పంచుట, ఇందలి షేర్లు ఏ కొద్దియోతప్ప దళారీల చేతులలో లేకుండుట, ముఖ్యముగా బ్యాంకింగ్ సూత్రములు శ్రద్ధాసక్తులతో పాటింప బడుటకూడ ముదావహములైన విషయములు.
డా. ఆర్. వి. రా.
ఆంధ్రభాషా చరిత్రము :- నేటి ఆంధ్రదేశమున ఆంధ్రులు మాటాడు వ్యావహారిక భాషకు ఆంధ్రమనియు తెనుగనియు, తెలుగనియు మూడు పేళ్ళు వాడుకలో నున్నవి. ఈ భాషను మాటాడు జనసంఖ్య సుమారు మూడు కోట్ల ముప్పది లక్షలు. నేటి మన భారత దేశమున వాడుకలోనున్న భాషలలోనికెల్ల అత్యధిక సంఖ్యాకులయిన జనులు మాట్లాడునది హిందీభాష. దాని తరువాత గొప్పసంఖ్య తెలుగు మాట్లాడువారి సంఖ్యయే. ఈ భాషయందు నన్నయాది మహాకవుల రచనలు గల గొప్ప వాఙ్మయము గలదు. నవ్య నాగరికత వలన ప్రపంచమున బయలుదేరిన అనేక క్రొత్త వాఙ్మయ ప్రక్రియలు, వార్తా పత్రికలు మొదలైన విజ్ఞాన దాయక రచనలు తెనుగునను గలవు. ఇట్టి విశాలభాషా ప్రపంచము యొక్క చరిత్రమును అనగా భూత భవిష్యద్వర్తమాన స్వరూపములను సంగ్రహముగానైన నెరుగవలయును.