ఆంధ్రభాషా చరిత్రము
పాశ్చాత్య దేశమునుండి మనకు వ్యవహారములోనికి వచ్చిన క్రీస్తు శకముయొక్క ప్రారంభ దశనుండి నేటివరకును అనగా సుమారు రెండువేల సంవత్సరముల వరకు నుండిన ఆంధ్ర భాష యొక్క చరిత్రమును తెలివిడి కొరకు కొన్ని యుగములుగా అప్పుడప్పుడు కలిగిన పరిణామ విశేషములనుబట్టి విభజింపనగును. మన తెనుగు భాషలో మొట్టమొదట బయలుదేరిన గ్రంథము నన్నయ కృతమయిన మహాభారతము. ఇంతకంటే ప్రాచీనములయిన గ్రంథములు ఉన్న వాలేవా అను వివాద మొకటి చాల కాలమువరకు నడచినదిగాని అట్టి గ్రంథములున్నట్లు నిర్ణాయకము లైన సాక్ష్యము గాని, వాటి స్వరూపముగాని లభింపలేదు. తెనుగు సారస్వతమున నన్నయ ఆదికవి యనియు, ఆతడు చేసిన భాషా నియమములనే నేటికిని ప్రామాణికులు అవలంబించుచున్నారనుటయు ఎల్ల రెరిగినది. నన్నయ వ్రాసిన భాషను ఎల్ల విధములను పోలియున్న భాషనే మనము వ్రాయుచున్నామనుట ఒప్పుకొన వీలులేదుగాని, ఆనాటి భాషయందలి జీవము, స్వభావము, చాల వరకును నేటి భాషయందును నిలిచియే యున్నవి. ముప్పదియేండ్ల వయసున మనమొక పురుషుని చూచి ఆ తరువాత మరి ముప్పదియేండ్లకు అనగా పష్టిపూర్తియైన తరువాత నాతనిని తిరుగ చూచినచో
నాతని బహిరంగ స్వరూపమునను, వైజ్ఞానిక స్వరూపమైన మానసిక వృత్తియందును గొంతమార్పు కనుపట్టక తప్పదు కాని అతనిని వేరువుషునిగాగాని, యాతని ఆత్మవేరనిగాని భావింపము. కాలగతిని పూరుష స్వరూపాదికమున మార్పు కలిగినట్లే భాషయందును మార్పు గలుగుచునే యుండును. ఆతని వయస్సు నంతటిని బాల్య యౌవనాదిగా నెట్లు విభజించు చున్నామో అట్లే తెనుగు స్థితినిగూడ విభజింప వచ్చును.
భారతము బయలుదేరిన కాలము పదునొకండవ శతాబ్దము. ఆనాటినుండి నేటివరకును ఒక భాగముగాను దానికి పూర్వ కాలమును వేరు భాగముగాను విభజింప వచ్చును. ఈ రెండు భాగములనే మరల అప్పటి విశేషములనుబట్టి విభజింపగా ఐదు యుగము లగుచున్నవి.
I క్రీస్తు పూర్వము II క్రీ. శ. 1 నుండి 7వ శతాబ్ది వరకును, III 7 వ శతాబ్దినుండి 11 వ శతాబ్ది వరకును, IV 11 వ శతాబ్దినుండి 19 వ శతాబ్ది వరకును V 19 వ శతాబ్దినుండి నేటి వరకును, పై రీతిని విభజింపబడిన అయిదు యుగములలో మొదటి మూడును వాఙ్మయోత్పత్తికి పూర్వ స్వరూపమును నిరూపించును. తరువాతి రెండును తదనంతర స్వరూపమును నిరూపించును.
పై వాటిలో మూడవయుగమయిన 7 మొదలు 11 వ శతాబ్దము వరకునుగల కాలములో తెనుగులో వ్రాయబడిన గద్యమయ శాసనములును, కొన్ని దేశీయ ఛందస్సులతో అనగా సీసము, తరువోజ, అక్కర అనునట్టి పద్య బంధములతోకూడిన శాసనములును లభించుచున్నవి. ఈ శాసనములు రాజాజ్ఞ ననుసరించి దేవాలయములకును, బ్రాహ్మణులకును, రాజ సేవచేసిన మరికొందరకును ఇయ్యబడిన భూములు, వాటి హక్కులు, ఎల్లలు మొదలైన వివరములతో గూడినవి. అంతియేగాని భారతమువలె ఉదాత్తమైన నీతులు, కథలు, కల్పనలు గలిగిన కావ్యములుగాని, రచనలుగాని లభింప లేదు. ఈ కాలమున ఏవైన దీర్ఘములైన కావ్యములును, సంస్కృత ఛందస్సులైన ఉత్పలమాల, శార్దూలము మొదలైన వాటివంటి పద్యబంధములును ఉండియుండవచ్చునుగాని అవి నశించి పోయియే యుండనగునని కొందరు ఊహించు చున్నారు. దీనికి ప్రమాణముగాని బలమయిన యువపత్తిగాని కనుపింపదు. ఈ యుగమునందలి శాసనస్థభాషను బట్టి ఆనాటి తెలుగు యొక్క స్వరూపస్వభావములను, వ్యాకరణమును మనము తెలిసికొనవచ్చును. ఇంకొక విశేషమే మనగా ఈ కాలమున తెనుగునకు రాజాదరణమేర్పడి శాసనములయందు వాడబడుటకు తగిన యధికారము, గౌరవము ఆ రాజులవలననే గలిగినదనుటయే. ఇట్లు తెనుగును గౌరవించిన రాజులు తూర్పు చాళుక్యవంశపు రాజులు. ఈవంశమునకు మూలపురుషుడయిన కుబ్జవిష్ణు వర్ధనుడు క్రీ.శ. 615_633 వరకు పరిపాలించెను. ఈ వంశములో 27 వ పురుషుడైన రాజనరేంద్రుడే తెనుగునకు వాఙ్మయస్థితిని కల్పించి యుగప్రవర్తకుడయ్యెను.
దీనికి పూర్వయుగమయిన రెండవయుగము (క్రీ. శ. 1-600) నందు తెనుగుభాషాశాసనములు లేవనియే చెప్పవచ్చును. ఏవేని కొన్ని సందిగ్ధములయిన శాసనములు