Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రబ్యాంకు చరిత్ర

యంత్రపరికరములు, మొదలగునవి తయారుచేయబడు చున్నవి.

ముఖ్యమయిన పారిశ్రామికోత్పత్తి, ఈక్రింద నీయబడినది. నూలువస్త్రములు 415.20 లక్షల గజములు: నూలు 138.26 లక్షల పౌనులు (తూకము); సిల్కు గుడ్డ 9.39 లక్షల గజములు; సిల్కు దారము 25.78 లక్షల పౌనులు (తూకము), పంచదార 61 వేల టన్నులు; కాగితము 2.68 లక్షల హండ్రడు వెయిటులు; సిగరెట్లు 473.7 కోట్లు; సారాయి 3.67 లక్షల గాలన్లు. ఇవిగాక 15.28 లక్షల టన్నుల బొగ్గు, 68.3 మిలియన్ల వాట్లు విద్యుచ్ఛక్తి 39.700 టన్నుల ముడి ఇనుముకూడ ఉత్పత్తి యగుచున్నది.

జి. స.

ఆంధ్రబ్యాంకు చరిత్ర  : ప్రతిదేశపు ఆర్థికవ్యవస్థ యందు అందలి బ్యాంకింగ్ సంస్థలు నిర్వహించవలసిన పాత్ర మిగుల ప్రముఖమైనది. ఆర్థికముగా ముందుకు వచ్చిన దేశముల యొక్క పరిస్థితులను గమనించిన వారు ఉత్తమమైన బ్యాంకింగ్ విధానము ఆర్థికాభ్యుదయమునకును వర్తక వాణిజ్యముల పెంపుదలకును పరమావశ్యకమను విషయమును విస్మరింపజాలరు.

ఆంధ్ర బ్యాంకు నేటి ఆంధ్రదేశపు ఆర్థిక జీవితమునను, వర్తక వాణిజ్యములందును ప్రాముఖ్యముగల సంస్థ. ఈసంస్థను స్థాపింపవలయునను సంకల్పము దీనిస్థాపకులును ఆంధ్రనాయకులును అగు డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారికి 1923వ. సం॥ సెప్టెంబరులో కలిగినది. అదే సంవత్సరము నవంబరు 20 వ తేదీని బందరులో ఆంధ్రబ్యాంకు పని ప్రారంభించినది. 1929 నవంబరు నెలలో కాకినాడపట్టణమునందు మొదటి శాఖను తెరచినది. 25 సం.లు జయప్రదముగా వ్యవహరించి నిండుగర్వముతో 1948వ సంవత్సరమున రజతోత్సవము జరుపుకొన్నది. ఇది ఆంధ్రబ్యాంకు యొక్క సంక్షి ప్తగాథ.

"పెద్ద నదులు ప్రారంభములో చిన్నవిగా నుండును" అను సామెత ఈ సంస్థకును వర్తించును. అదేవిధముగా ఈ సంస్థయు కొలది పెట్టుబడితో ప్రారంభమై క్రమక్రమముగా పెద్దదై, నేడు ఆంధ్రదేశములోను వెలువలను పెక్కు శాఖలతో అలరారుచున్నది.

సంస్థాపనోద్దేశములు  : "ఆంధ్రులచే నిర్వహింపబడి ఆంధ్రులకు ముఖ్యముగా ఉపయుక్తము కాగలుగుచు విపులమైన వ్యాపారమునకు నిలయమై ఉండెడు ఒక కమర్షియల్ క్రెడిట్ సంస్థను స్థాపించవలెనను ఆశయముతో నిది ఉద్భవించినట్లు ఈ బ్యాంకు సంస్థాపకులగు డాక్టర్ పట్టాభిగారు చెప్పియుండిరి. ప్రస్తుత మేనేజింగ్ డైరక్టరు అగు శ్రీ తాడేపల్లి శ్రీరాములుగారి మాటలలో ఈ సంస్థ యొక్క ఆశయములు : - (i) దేశములోని ఆర్థికబలమును సమీకరించి వాణిజ్య పరుల అవసరాలకు సహకరించుట.

(ii) వ్యవసాయదారులకు అల్పవ్యవధి ఋణములు ఒసగుట.

(ii) పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడులను ఒసగి చేయూతగా నుండుట.

నిర్వహణములో కల్గిన కష్టములు : ఈ 33 సం. ల కాలము అనగా 1923 నుండి 1956 వరకు గల కాలములో ఈ సంస్థ నిర్వహణమునందు పెక్కు చిక్కులు కల్గినవి. ఇది సాధారణ కాలము కాదు. ఆర్థిక మాంద్యము మొదలు ద్రవ్యోల్బణమువరకు వివిధ ఆర్థిక పరిస్థితులును, ఒక మహాయుద్ధము, దేశములో రాజకీయ సంక్షోభము మ్మొదలు స్వాతంత్య్ర ప్రధానమువరకు గల రాజకీయ సంఘటనములును సంభవించిన సమయము.

1923 లో ఈబ్యాంకు స్థాపింపబడునప్పటికి ఆంధ్ర దేశ పరిస్థితులు ఇందులకు అనుకూలముగా లేవు. ప్రజలు బ్యాంకింగ్ యొక్క ఉపయోగమును ప్రాముఖ్యమును గుర్తింపలేదు. డాక్టరు పట్టాభిగారు మొదట ఈ సూచన చేసినపుడు 'ఎవరుగాని తగినంత పెద్ద మొత్తములు విరాళము లిచ్చుటకు సాహసింపకపోవుటవలన కొంత నిరుత్సాహము కలిగినది. కాని వారి మిత్రులగు తాడేపల్లి సుబ్బారావుగారు, ఉదయగిరి గోపాలరత్నంగారు, మొదలగు వారిచ్చిన తోడ్పాటువలన ఈ సంస్థ 1920 వ సం. నవంబరు 20 న రిజిస్టరు కాగలిగినను, అనేక బాలారిష్టముల నెదుర్కొనవలసివచ్చినది. ఇంపీరియల్ బ్యాంకుకు అప్పుడుగల యూరోపియన్ ఏజంటు వ్యతిరేక ప్రచారము, ఆ బ్యాంకు హెడ్డాఫీసువారు ఓవర్ డ్రాఫ్టు ఇచ్చుటకు నిరాకరించుట, ఇందుల కుదాహరణములు.