ఆంధ్రప్రదేశము - II
తెలంగాణమునకు నీరు, విద్యుచ్ఛక్తి విస్తారముగా లభించును.
తెలంగాణములో పంటక్రింద నున్న భూమి ఈ విధముగా నున్నది.
లక్షల ఎకరములు | |
---|---|
వ్యవసాయము క్రింద నున్నది. | 116.85 |
నీటిపారుదల వసతులు గలది. | 16.67 |
వ్యవసాయమునకు అనువైనను ఖాళీగా నుండిపోయినది. | 10.06 |
బంజరుభూమి | 36.44 |
సాగులోనికి తీసికొని రాతగినది. | 20.40 |
పైన చెప్పిన భూములలోని పంటలు ఈ క్రింది విధముగా నున్నవి.
లక్షల టన్నులు | |
---|---|
ధాన్యము | 11.15 |
అపరాలు | 1.57 |
చెరకు | 1.76 |
ఆముదము | 0.51 |
వేరుసెనగ | 2.42 |
మిరపకాయలు | 0.15 |
ఉల్లి | 0.37 |
పొగాకు | 8500 టన్నులు |
ప్రత్తి | 39,000 బేళ్లు |
ఖనిజసంపద :- (ఆంధ్ర దేశపు ఖనిజసంపద చూడుము).
పరిశ్రమలు :- సింగరేణి మొదలగు గోదావరిలోయ బొగ్గుగనులు కారణముగా, తెలంగాణములో పరిశ్రమలు నెమ్మదిగా నభివృద్ధి చెందినవి. ప్రాంతీయముగా కావలసిన వస్తువులు తయారుచేయు భారీపరిశ్రమలు, గృహ పరిశ్రమలు చాలకలవు. వీటిలో ముఖ్యమయినవి ఈ క్రిందివి :
హైద్రాబాదులోని డి. వి. ఆర్. మిల్లులోను, వరంగల్లులోని అజంజాహి మిల్లులోను నూలు ఉత్పత్తి యగు చున్నది. ఇది కాక వస్త్రములు కూడ నేయుమిల్లు హైద్రాబాదులో నొకటి యున్నది.
సిర్ పూర్ లో కృత్రిమపు సిల్కు తయారుచేయు ఫ్యాక్టరీ కలదు. దీనిలో రోజునకు 5 టన్నుల రయాను తయారు అగును. దీనితో రమారమి 50,000 గజముల సిల్కు దారము తీయబడును.
బోధనులోనున్న నిజాము పంచదార ప్యాక్టరీలో 2,40,000 రూపాయలు విలువగలిగిన 21,000 టన్నుల పంచదార సాలీనా తయారగుచున్నది. ఈ ఫ్యాక్టరీలో నుపయోగించగా మిగిలిన చెరకుపంట ఇతరరాష్ట్రములకు ఎగుమతి చేయబడు చున్నది. ఈ ఫ్యాక్టరీలోనే సంవత్సరమునకు 5 లక్షలగాలన్ల సారాయికూడ తయారగును.ఇది యంత్రములు నడుపుట కుపయోగించు ప్రత్యేకమైన సారాయి.
హైదరాబాదులో నున్న కోహినూర్, తాజ్ గ్లాసు ఫ్యాక్టరీలలో గాజుసామానులు తయారగును.
ఆస్బెస్టాసు తయారుచేయు హైదరాబాదు ఆస్బెస్టాసు సీమెంటు ప్రోడక్టు ఫ్యాక్టరీ హైదరాబాదులో నున్నది.
సిరుపూరులో కాగితములు తయారుచేయు ఫ్యాక్టరీ యున్నది. దీనిలో సాలీనా 6,000 టన్నుల కాగితములు తయారగును.
హైదరాబాదులోని చార్మినార్ సిగరెట్టు కంపెనీ తెలంగాణములో ముఖ్యమయినది. దీనిలో రోజుకు 40 లక్షల సిగరెట్లు తయారగును. వజీర్ సుల్తాను సిగరెట్టు కంపెనీ మరియొక ముఖ్యమైన ఫ్యాక్టరీ.
నేత పరిశ్రమ తెలంగాణములో ముఖ్యమయిన గృహ పరిశ్రమ, ఇందుకు కావలసిన ప్రత్తి, నూలు ఇతర ప్రాంతముల నుండి వచ్చినను తెలంగాణములో నేత పరిశ్రమ చాల అభివృద్ధి చెందినది.ఈ పరిశ్రమకు ముఖ్యమయిన జిల్లా లగు నిజామాబాదు, నల్లగొండ, మహబూబునగరు, వరంగల్లులలో సుప్రసిద్ధమైన ఉన్నికంబళ్ళు నేయబడును. వీటిని దేశములో నితరప్రాంతములకు ఎగుమతి చేయుదురు.
ఆటవస్తువులు, ఇతరములయిన కళాప్రాధాన్యమైన వస్తువులు తయారుచేయుటలో దేశమునందంతటను ప్రసిద్ధి గాంచినది నిర్మలపట్టణము. హైదరాబాదులో అనేకము బత్తాము ఫ్యాక్టరీలు ; బెల్లంపల్లి, ఆజమాబాదు పట్టణములలో రసాయనపదార్థములు చేయు ఫ్యాక్టరీలుక లవు . ఇవిగాక పింగాణి, తదితరవస్తువులు చేయు ఫాక్టరీలు తెలంగాణములో నున్నవి. హైద్రాబాదు ఆల్విన్ మెటల్ వర్క్సు, ప్రాగాటూల్సు కార్పొరేషనులలో ఇనువసామానులు,