ఆంధ్రప్రదేశము - II
నగరు జిల్లాలలోను ఇసుక నేలలు ఎక్కువ. ఇవి చాల తక్కువ సారవంతమైనవి.
వృక్షజాలము : తెలంగాణములో సహజముగా పెరుగునవి ఉష్ణమండల అరణ్యాలు, చిట్టడవులు, ముండ్లపొదలు గడ్డిమైదానములు. వర్షపాతము ఎక్కువగనున్న తూర్పు భాగములో అరణ్యములు కనుపించును. కాని పశ్చిమముగా పోయినకొలది, ఎత్తయి, వర్షపాతము ఎక్కువగా నున్న ప్రాంతములలో తప్పితే, ముండ్లపొదలు, గడ్డి కనిపించును. ఆదిలాబాదు, కరీంనగరు, మహబూబునగరు, వరంగల్లు, ఖమ్మం, నిజామాబాదు జిల్లాలలో అడవులు సహజముగా ఎక్కువ. గోదావరి కృష్ణాతీరములలో తుమ్మచెట్లు ఎక్కువ. వరంగల్లు జిల్లాలోని ములుగు, నరసంపేట, ఆదిలాబాదు జిల్లాలోని మహాదేవపూరు, కరీంనగర్ జిల్లాలోని మాననూరు, మహబూబ్ నగరుజిల్లాలోని అమరాబాదు తాలూకాలలో, వేసవిలో ఆకులు రాల్చు జాతిచెట్లతో నిండిన అడవులు కలవు. ఈ అరణ్యములలో చెట్లు రమారమి 50 అడుగుల ఎత్తువరకు పెరుగును. గంధపుచెట్లు, టేకు, నల్లమద్ది మొదలగు ఉపయోగకర మయిన చెట్లు ఈ అడవులలో పెరుగును. హైదరాబాదు, మహబూబునగరు, నల్లగొండ, మెదక్ జిల్లాలలో చెదరు చెదరుగా నున్న చెట్లతోను, పొదలతోను, సీతాఫలము, తాడి మొదలగువానితోను కూడిన చిట్టడవులు పెరుగును. వర్షము బాగుగా తక్కువగా నున్న చోట్లయందును కొండ వాలులలోను గడ్డి పెరుగును. దీనిలో వాసనగల గడ్డి రకములుకూడ కలవు. ఆదిలాబాదు, నిజామాబాదు జిల్లాలలో పెరిగెడు గడ్డియే కాగితములు తయారుచేయుటకు చాల తగినది. వరంగల్లు, ఆదిలాబాదు జిల్లాలలోని అడవులలో నుండి టేకు ఎక్కువగా లభించుచున్నది.
నీటిపారుదల, వ్యవసాయము : తెలంగాణమున మొత్తముమీద సంవత్సరమునకు 33 అం. వర్షము పడునని చెప్పవచ్చును. ఈ వర్షము తూర్పుప్రాంతములలో ఎక్కువగాను, పశ్చిమ ప్రాంతములలో తక్కువగాను ఉన్నది. వర్షపాతము తక్కువగుటచే పంటభూములు సాగుచేయవలసిన అవసర మున్నది. పెద్ద నూతుల, చెరువుల సహాయముతో భూములను సాగుచేయుట తెలంగాణములో గమనించవలసిన విశేషము. ఆంధ్రదేశపు తీర
ప్రాంతములతో సరిపోల్చినచో తెలంగాణములో కాలువలు లేవని చెప్పవచ్చును. 700 సంవత్సరముల పురాతనమయిన పాకాల సరస్సు చాల పెద్దది. మునేరునదికి 4000 అ. పొడవున వేసిన అడ్డకట్టవలన నిది ఏర్పడినది. దీనిలోతు 50 అ. పరిమాణము 325 కోట్ల ఘనపు టడుగులు. హైదరాబాదు సికింద్రాబాదుల మధ్యనున్న హుస్సేనుసాగరు చెరువు 400 సంవత్సముల పూర్వము నిర్మింపబడినది. దీని కట్టపొడవు 7000. అ., లోతు 75 అ. పరిమాణము 290 కోట్ల ఘనపు టడుగులు. 50 అ. లోతు కలిగిన రామప్ప చెరువు 120 కోట్ల ఘ, అ. పరిమాణము కలది. 50 అ. లోతుకలిగిన లక్నవరం చెరువుకూడ ప్రసిద్ధమయిన పురాతన తటాకము. ఈ చెరువులవలన వేలకొలది ఎకరములు సాగుచేయబడు చున్నవి.
నీటిపారుదలకు, విద్యుచ్ఛక్తికి ఉపయోగపడు నదీ ప్రాజెక్టులు తెలంగాణములో చాల కలవు.
ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు సరస్సులు హైదరాబాదు, సికిందరాబాదు నగరములకు నీటిని సప్లయి చేయుటకు ఉపయోగించుచున్నవి.
మంజీరనదికి కట్టబడిన ఘనపురం ఆనకట్టవలన సుమారు 25 వేల ఎకరములు సాగు అగుచున్నవి. ఆలేరు నదికి కట్టబడిన పోచవరం ఆనకట్టవలన 13 వేల ఎకరములు, మహబూబునగరు జిల్లాలోని దిండి ప్రాజెక్టు వలన 39 వేల ఎకరములు సాగుచేయబడుచున్నవి. కామా రెడ్డి పట్టణమునకు 18 మై. దూరములో మానేరు నదిపై నిర్మింపబడ్డ చెరువువలన 12 వేల ఎకరములు సాగుచేయుటకు, 1000 కిలో వాట్ల విద్యుచ్ఛక్తి తయారుచేయుటకు వీలున్నది. 15 చ. మై. వైశాల్యము, 3000 కోట్ల ఘనపు టడుగుల పరిమాణము, 100 అడుగుల లోతు కలిగిన నిజాముసాగరు చెరువు, మంజీరనదికి అడ్డముగా 2 మై. పొడవున కట్టబడిన అడ్డకట్టవలన ఏర్పడినది. దీని వలన 6 లక్షల ఎకరములు సాగు అగుచున్నవి. 3,000 నుండి 11,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి తయారు అగును.
17 వేల ఎకరములు సాగుబడి చేయు, వరంగల్లులోని వైరా ప్రాజక్టు, సుమారు 20 వేల ఎకరములు సాగు చేయుటకు వీలగు పాలేరు ప్రాజక్టు, చెప్పదగినవి. ఇవి గాక తుంగభద్ర, నాగార్జునసాగరు ప్రాజెక్టుల వలన