Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - V


1912 వ సంవత్సరమున కృష్ణాజిల్లా మహాసభ నిడదవోలులో జరిగినప్పుడు ఆంధ్రదేశమందలి ప్రముఖులు చాలమంది అచ్చట సమావేశమయిరి. జిల్లా సభలవలెనే, ఆంధ్రదేశ మంతటికిని ప్రతి సంవత్సర మొక్కొకచోట మహాసభను జరిపించుట యుక్తమను భావము వారికి తోచినది. ఆంధ్రమహాసభా సమావేశము ఆంధ్ర వ్యక్తిత్వమును దృఢపరచి సర్వతోముఖముగా ఆంధ్రజాతి నుద్ధరించుటయే ముఖ్యోద్దేశముగ గలది యగుటచే, ఒక భాష, ఒక సంస్కృతి, ఒక చారిత్రము గలిగిన ఆంధ్రు లెల్లరు నొక రాష్ట్రములో ప్రత్యేకింపబడుట అత్యంతావశ్యక మను భావము వెంటనే ఆంధ్రయువకుల హృదయములందు మొలకెత్తినది. అట్టి యువకులలో కీ. శే. జొన్నవిత్తుల గురునాథము, కీ. శే. చల్లా శేషగిరిరావుగార్లు పేర్కొనదగినవారు. ఆంధ్రరాష్ట్ర తీర్మానము పైనచెప్పిన కృష్ణాజిల్లా మహాసభలోనే ప్రవేశ పెట్టబడెను గాని అది సకాలములో తేబడనందున అధ్యక్షులు దానిని నిరాకరించిరి. అంతట నా యువకులును, వింజమూరి భావనాచార్యులుగారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మొదలగు పెద్దలును చేరి ఆంధ్రరాష్ట్ర నిర్మాణము విషయమును చర్చించి, దాని ఆవశ్యకతను గుర్తించి ఆంధ్రులలో ప్రబోధము కలిగించుటకు ఆంధ్రోద్యమము సాగించిరి. ఈ విషయమై ప్రచారముచేయుటకు కొండా వేంకటప్పయ్యగారు కూడ పూనుకొనిరి. ఈ సందర్భమున తమిళ ప్రాంతములనున్న తెలుగువారిలో కూడ ఆంధ్రోద్యమ ప్రచారము జరిగినది.

ఈ ప్రచారము యొక్క ఫలితముగా బాపట్లలో 1913వ సంవత్సరమున ప్రథమ ఆంధ్రమహాసభ జరుపబడినది. మద్రాసు రాష్ట్రీయ శాసనసభలో సభ్యులుగ నుండిన శ్రీ బయ్యా నరసింహేశ్వర శర్మగారు సభకు అధ్యక్షత వహించిరి. ఆంధ్రరాష్ట్ర నిర్మాణ విషయమునుగూర్చి విచారించి మరుసటి సంవత్సరము జరుగు ఆంధ్ర మహాసభకు నివేదించుటకు తీర్మానించిరి.

1914 లో ఐరోపా మహాసంగ్రామము ప్రారంభమయ్యెను. ప్రజలకు వార్తా పత్రికలయం దభిరుచి పెరిగెను. ఆదివరకు బొంబాయిలో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారు నడుపుచుండిన ఆంధ్రపత్రికను చెన్న పట్టణమునుండి దినపత్రికగా ప్రకటింపసాగిరి. అది ఆంధ్రోద్యమమునుగూర్చి తీవ్రమైన ప్రచారము చేయసాగెను.1914 లో బెజవాడలో ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు పంతులుగారి అధ్యక్షతక్రింద జరిగిన రెండవ ఆంధ్రమహాసభయందు ఆంధ్రరాష్ట్ర నిర్మాణము గావించుట అవసరమని తీర్మానించిరి.

1915 లో కాకినాడలో శ్రీ మోచర్ల రామచంద్రరావు పంతులుగారి అధ్యక్షతక్రింద జరిగిన మూడవ ఆంధ్రమహాసభలో ప్రత్యేకాంధ్రరాష్ట్ర నిర్మాణము చేయవలయునని తీర్మానము గావించిరి. అప్పటినుండి ప్రతి సంవత్సరము ఆంధ్రమహాసభ ఏదో యొక ముఖ్యపట్టణమున సమావేశమగుచు ఆంధ్రరాష్ట్రము నిర్మించవలెనని తీర్మానింపసాగెను. తరువాత ఆంధ్ర సాహిత్య సభలందు, గ్రంథాలయ సభలందు, ఇతర సభలందుగూడ ఈ విషయమై తీర్మానములు గావింపబడుచుండెను. జాతి, మత కుల పక్షవిభేదములను విస్మరించి రాష్ట్రమునందు ఇతర రాష్ట్రములందుగల తెలుగువారందరును ఆంధ్రో ద్యమము నభిమానించిరి, కాంగ్రెసు మహాసభకూడ భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సూత్రము నంగీకరించెను. 1918 లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పరుప బడినది. 1917 లో మాంటేగు- షేమ్సుఫోర్డు రాజ్యాంగ సంస్కరణముల సందర్భమున నీ విషయమై విచారణ సంఘమునకు నివేదింపబడినది. 1919 వ సంవత్సరపు రాజ్యాంగ చట్టమునందు భాషాప్రయుక్త రాష్ట్రములు ప్రజా ప్రతినిధుల యంగీకారముపైన నిర్మింపవచ్చునని నిర్ణయింపబడెను. కాని దాని విషయమై ఎట్టి చర్యయు గైకొనబడలేదు. ఆంగ్లేయ పరిపాలకులు మరల రాజ్యాంగ సంస్కరణములు చేసినప్పుడు 1935 లో సింధు, ఒరిస్సా పరగణాలను ప్రత్యేక రాష్ట్రములుగ నిర్మాణము చేసిరేగాని ఆంధ్రరాష్టమును నిర్మింప రైరి.

1917 వ సంవత్సరము నాటికే చెన్నపురి రాజధానిలో బ్రాహ్మణేతరోద్యమము ప్రబలమై జస్టిసుపార్టీ యేర్పడి కాంగ్రెసుకు వ్యతిరేకముగా పనిచేయసాగెను. ఈ యుద్యమము తలయెత్తుటకు కారకులు బ్రిటిష్ అధికారులే అని చెప్పవచ్చును. 1919 వ సంవత్సరపు రాజ్యాంగము ప్రకారము జరిగిన ఎన్నికలందు కాంగ్రెసు