ఆంధ్రదేశ చరిత్రము – V
పాల్గొనక బహిష్కరించినప్పుడు జస్టిసు పార్టీవారు శాసనసభలందు ప్రవేశించి చెన్నపట్టణ రాజధానియందు మంత్రులుగ నేర్పడి వారి యధీనము చేయబడిన ప్రభుత్వ శాఖలను పరిపాలింప సాగిరి, 1935 వ సంవత్సరపు రాజ్యాంగ చట్టమును బట్టి 1937 లో జరిగిన ఎన్నికలలో పరాజితు లగువరకు వారే పలుకుబడి కలిగియుండిరి. జస్టిసు పార్టీ నాయకులైన పానుగంటి రామారాయణింగారును, బొబ్బిలి రాజాగారును, కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారును, పాత్రోగారు మొదలైన
వారును ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు సుముఖులుగనే యుండిరి, ఆంధ్ర మహాసభలందు పాల్గొనిరికాని అధికార పదవు లందున్నప్పుడు మాత్రము వారు ఈ విషయమై గట్టి ప్రయత్నము చేయరైరి.
గాంధీ మహాత్వుని నాయకత్వమున సహాయ నిరాకరణోద్యమము శాసనోల్లంఘనోద్యమములు జరుగుచుండిన కాలమున భారత దేశమునకు పూర్ణ స్వరాజ్యము సంపాదించినచో భాషాప్రయుక్త రాష్ట్రముల సమస్య పరిష్కార మగుననియు అంతవరకు కాంగ్రెసువారిట్టి చిన్న విషయమును గూర్చి గాక భారతదేశ స్వాంత్య్రము కొరకు మాత్రమే కృషిచేయ వలయుననియు ప్రధాన కాంగ్రెసు నాయకులు తలంచినందున ఆంధ్ర కాంగ్రెసు ప్రముఖు లీ విషయమై తక్కిన పక్షముల వారితో గలిసి గట్టికృషి చేయరైరి. 1938 లో కాంగ్రెసు కార్యవర్గమువారు భాషా ప్రయుక్త రాష్ట్రములను నిర్మాణము చేయుట అవసర మేయనియు, తమచేతికి అధికారము వచ్చిన పిదప దీనిని గూర్చి చర్య గైకొందుమనియు తీర్మానించిరి. 1938లో కాంగ్రెసువారు ఎన్నికలందు విజయముపొంది వివిధ రాష్ట్రములందు ప్రభుత్వాధికారము వహించిరి. చెన్నపట్టణములో కూడ కాంగ్రెసు ప్రభుత్వాధికారము వహించెను. ఆంధ్ర శాసనసభ్యులు ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును గోరిరి. కాని ముఖ్యమంత్రి యైన రాజగోపాలా చార్యుల వారికి ఆంధ్రరాష్ట్ర నిర్మాణము చేయుట కిష్టము లేకపోయెను. అందువలన మన రాష్ట్ర నిర్మాణము వెనుక బడినది. ఎట్టకేలకు భారతదేశము స్వాతంత్య్రము పొందిన సందర్భమున ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య మరల ముందునకు వచ్చెను. 18-4-1947 వ తేదీన మద్రాసులోని ఉభయ శాసన సభలును భాషా ప్రయుక్త రాష్ట్రముల నిర్మాణము గావింపవలెనని రాజ్యాంగ నిర్మాణ సభకు శిఫారసు చేయుచు తీర్మానము గావించెను. అంతట నీవిషయమై విచారించి నివేదించుటకు రాజ్యాంగ (Constituent Assembly) నిర్మాణ సభవారు “థారు" కమీషను అను నొక విచారణ సంఘమును నియమించిరి. ఆ సంఘము వారు ఈ విషయమై విచారణసల్పి భారత దేశమునందు భాషాప్రయుక్త రాష్ట్రములను నిర్మాణముచేయుట యుక్తముగాదనియు, అయ్యది భారత జాతీయైక్యతకు భంగము కలిగించుననియు అభిప్రాయము నిచ్చిరి. అంతట దేశ ప్రజలలో చాల అసంతృప్తి కలిగెను. కాంగ్రెసు వారుకూడ ఆందోళనము గావించిరి. అంతట ఈ విషయమును గూర్చి పునరాలోచన చేయుటకు కాంగ్రెసు వర్కింగు కమిటీవారు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్, డాక్టరు పట్టాభి సీతారామయ్యగార్ల నొక ఉప సంఘముగా నియమించిరి. వారి నివేదికకు "జె. వి. పి" రిపోర్టు అని పేరు వచ్చినది. తక్కిన రాష్ట్రములమాట ఎటులున్నను, ఆంధ్రుల చిరకాల వాంఛితమైన ఆంధ్ర రాష్ట్రమును మాత్రము నిర్మాణము చేయవచ్చుననియు అయితే అట్లేర్పడు క్రొత్త రాష్ట్రమునందు మద్రాసు నగరమును చేర్చుటకు అరవవారి కభ్యంతరము కలదనియు అందువలన మద్రాసు రాజధాని లోని నిర్వివాద ప్రాంతములతోనే నూతనాంధ్రరాష్ట్రము నిర్మాణము చేయవలసి యుండుననియు ఉపసంఘమువారు అభిప్రాయపడిరి. ఈ నిర్ణయమును ఆంధ్రరాష్ట్ర సంఘమువారు 1949 సం. నవంబరు 11 వ తేదీన శిరసావహించుచు తీర్మానించిరి. భారతీయ ప్రభుత్వమువారును వీరి తీర్మానమును అంగీకరించి వెంటనే ఆంధ్రరాష్ట్రమును నిర్మింప తల పెట్టి మదరాసు ప్రభుత్వముతో నాలో చింపగా మద్రాసు మంత్రివర్గమువారు 1950 సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీకిగాని క్రొత్త రాష్ట్రము నిర్మింప వీలుకాదనియు, ఈలోపుగ కొంత చర్య గైకొందు మనియు చెప్పి 1949 డిశంబరు 7 వ తేదీన ఒక విభజన సంఘమును (Partition Council) నియమించిరి. ఈ విభజనసంఘమువారు 1950 జనవరి 3 వ తేదీన తమ నివేది