ఆంధ్రదేశ చరిత్రము - V
గ్రంథము స్వతంత్ర అమెరికా అధ్యక్షు డగు అబ్రహాము లింకను జీవిత చరిత్ర. దానిని రచించినవారు గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారే. దానికి పీఠిక వ్రాయుచు లక్ష్మణరావుగారు వంగరాష్ట్రములోను, మహారాష్ట్ర దేశములోను వైజ్ఞానిక సాహిత్య విషయములందు దేశాభ్యుదయము కొరకు జరిగిన కృషిని వివరించి ఆంధ్రులుకూడ వారివలెనె కృషిచేయుట అవసరమని వక్కాణించిరి. ఆ గ్రంథమాలయందు ప్రకటించబడిన గ్రంథములెల్ల తెలుగువారిలో విజ్ఞాన వికాసము కలి
గించి దేశాభిమానమును పురిగొల్పగల ఉత్తమ గ్రంథములే. అందు ముఖ్యముగా 1910 వ సంవత్సరమున ప్రకటింపబడిన "ఆంధ్రుల చరిత్ర" ఆంధ్రులలో గొప్ప దేశభక్తిని పురికొల్పిన చరిత్ర గ్రంథము. దానికి శ్రీ లక్ష్మణరావుగారు పీఠిక వ్రాయుచు “భారత ఖండాంతర్గతములైన ఒక్కొక్క దేశముయొక్క చరిత్రమును విపులముగా వ్రాయించి ప్రకటించవలెనని మండలివారు యత్నించుచున్నారు. ఆంధ్రులకు ఆంధ్రదేశ చరిత్రము అత్యంతావశ్యకముగదా. పూర్వ మొకప్పుడు రాజ్య
విస్తీర్ణమునందు ఉన్నత నాగరకత యందును, బుద్ధి వైభవమునందును, ఆంధ్రులు హిందూదేశమునందలి యన్య రాష్ట్రముల వారికి దీసిపోయినవారు కారని ఈ చరిత్రవలన స్పష్టపడగలదు." అని వారు వ్రాయుటలోనే ఆంధ్రరాష్ట్ర ప్రజలు మరల పూర్వపు మహోన్నతస్థితి పొందవలెనన్న భావము ద్యోతక మగుచుం డెను. శ్రీ లక్ష్మణరావుగారి మహదాశయమే ఆనాడు ఆంధ్ర దేశాభ్యుదయము కొరకు పాటుపడిన వారందరకు నుండెననుటకు సందేహములేదు.
1910 వ సంవత్సరమున గుంటూరులోని ఆంధ్ర యువజన సాహిత్య సంఘమునందలి సభ్యులు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను గూర్చి ఆలోచించి ఒక తీర్మానము గావించిరి. ఈ సభ్యులలో కీ. శే. జొన్నవిత్తుల గురునాథము, కీ. శే. చల్లా శేషగిరిరావుగార్లును, శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు మొదలయినవారు ఉండిరి. అయితే దీనిని గూర్చి అప్పుడు ప్రచారముగాని కృషిగాని జరుగుట కవకాశము లేకపోయెను. ఇంతలో నాంధ్ర దేశమునందు కలిగిన విజ్ఞాన వికాసము యొక్క ఫలితముగా బయలుదేరిన అనేక గ్రంథమాలలు దేశాభ్యుదయమునకు తోడ్పడగల గ్రంథములను ప్రచురింపసాగెను, అనేక పత్రికలు వెలసెను. తరువాత అనేక అముద్రిత గ్రంథములు సేకరించి, ఆంధ్రవాఙ్మయ పరిశోధనము గావించి, మన భాషకు చాల సేవజేసిన ఆంధ్రసాహిత్య పరిషత్తు కూడా 1911 లోనే స్థాపింపబడెను. దాని మొదటి వార్షికోత్సవము 1912 లో చెన్నపట్టణమున జరిగెను. తరువాత ప్రతిసంవత్సరము నొక పట్టణములో వార్షికోత్సవము జరుపసాగిరి. ఆ సమయముననే ఆంధ్ర దేశములోని ప్రతిపట్టణమునందును పుస్తక భాండాగారములు స్థాపింపబడి, గ్రంథములను, పత్రికలను ప్రజల కందించుచు, ఉపన్యాసము లేర్పాటుచేయుచు, ప్రజల విజ్ఞాన వికాసమునకు తోడ్పడసాగేను. ప్రతి సంవత్సరమును వార్షికోత్సవములు జరుపుచు ఆంధ్ర ప్రముఖుల యధ్యక్షతక్రింద మహాసభలు జరుపుట ప్రారంభమై అది త్వరలోనే ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమముగ బరిణమించెను.
1912 లో ఢిల్లీ దర్భారు జరిగెను. ఆ సందర్భమున పూర్వము దేశమును కలవరపెట్టిన బంగాళా విభజనము రద్దు చేయబడి బంగాళీ భాష మాట్లాడు ప్రాంతము లెల్ల నొకేరాష్ట్ర మయ్యెను. భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిరి. దేశములో నన్ని ముఖ్యపట్టణము లందును ఉత్సవములు సభలు జరిగెను. ఇట్లాకాలమున వివిధసంస్థలవారు చేసిన కృషియు, వా రేర్పరచిన సభలు ఉత్సవములు, ఉపన్యాసములును ప్రజలలో విజ్ఞాన వికాసమును ఆంధ్రాభి మానమును కలిగించి కార్యదీక్షను పురి కొల్పుచుండెను.
"వంగరాష్ట్ర విభజనం సందర్భమునను, తరువాత దానిని రద్దుచేయునప్పుడును జరిగిన చర్చల వలనను, ఆ కాలమున నడచిన ప్రసంగముల వలనను, రాజప్రతినిధి మొదలగువారి రాజకీయ లేఖలవలనను, భాషాసామ్యము జాత్యైక్యత, ప్రత్యేక రాష్ట్రనిర్మాణమునకు ముఖ్య కారణములని స్పష్టీకరింపబడినవి" అని శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారే ఆంధ్రోద్యమముయొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చిన ఒక వ్యాసమున వ్రాసినారు.