ఆంధ్రదేశ చరిత్రము – V
నని తిలకుగారి నాయకత్వమున ఆనాటి తీవ్ర జాతీయవాదులు ప్రయత్నించిరి. ఇందుకు విరుద్ధముగ మితవాదులు కాంగ్రెసును సూరత్ లో సమావేశపరచి రసవిహారఘోషుగారిని అధ్యక్షునిగా చేసి యుండిరి. అందువలననే అక్కడ అల్లరి జరిగినది. ఆనాడు ఆంధ్ర దేశమున విద్యార్థులలో గొప్ప సంచలనము కలిగెను. వారు తిలకములు ధరించి మెడలలో వందేమాతర పతకములను ధరించి, చేతులలో వందేమాతర ధ్వజములను బూని వీధులలో నూరేగుచుండిరి. కొందరు విద్యార్థు లట్టి పతకములతో కాలేజీలకు పోవగా కళాశాలల అధికారులైన తెల్లదొరలు వారిని వెడలగొట్టి రెండేండ్లవర కేకాలేజీ లోను వారిని చేర్చుకొనరాదని శాసించిరి. వారికి ప్రభుత్వోద్యోగము లివ్వరాదని గెజెటులో ప్రకటించిరి. ఇట్లు
శిక్షింపబడిన వారిలో రాజమహేంద్రవరము అర్టుకాలేజీ విద్యార్థియైన గజవల్లి రామచంద్రరావు గారును, ట్రెయినింగు కాలేజీ విద్యార్థి యగు గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారును ఉండిరి. ఇట్టి యువకులందరును దేశ సేవా పరాయణులైరి.
సూరతు కాంగ్రెసులో మితవాదులను పరాభవించిన తీవ్ర జాతీయవాదుల నాయకుడగు లోకమాన్య బాలగంగాధరతిలకుగారే భారతదేశములోని అశాంతికి కారకులని తలచి ఆయనను పట్టుకొని నిర్బంధించుటకు ఆంగ్లేయాధి కారులు కృత నిశ్చయులైరి. ఆయన ఆకాలమున “కేసరి" అను మహారాష్ట్రపత్రికలో వ్రాసిన వ్యాసము లందు రాజకీయ హత్యలను సమర్థించెనని, వారి పత్రిక కార్యాలయమున బాంబులను తయారుచేయు కాగితము దొరికెనని ఆయనపై రాజద్రోహ నేరము మోపి ఆయనను పట్టుకొని సంకెళ్ళు వేసి న్యాయస్థానమునకు తీసికొనివచ్చిరి. ఆయనకా నేరమునకు 22-7-1908 తేదీన ఆరు సంవత్సరములు ద్వీపాంతరవాస శిక్షయు వేయిరూపాయల జరిమానాయును విధించి ఆయనను బర్మాలో మాండలే చెరసాలలో బెట్టిరి. దీనివలన భారత దేశమున గొప్ప సంచలనము కలిగెను. గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు బెజవాడలో బోడి నారాయణరావుగారితో కలసి స్వరాజ్యపత్రికయను నొక తెలుగు జాతీయపత్రికను నడిపించిరి. అందులో దొరలను దూషించి ఇంగ్లీషు ప్రభుత్వముపట్ల రాజద్రోహము చేసెనని ఆయనను, నారాయణరావుగారిని ప్రభుత్వమువారు పట్టుకొని 1908 లో కఠినశిక్షను విధించిరి. ఆ కేసు హైకోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ న్యాయవ్యాది కోరిక ననుసరించి హరిసర్వోత్తమరావుగారికి విధింపబడిన శిక్ష చాలదని 14-8-1909 వ తేదీన మూడు సంవత్సరముల కారాగారవాసమునకు హెచ్చు చేసిరి.
జనసామాన్యమును భయ పెట్టవలెనని రాజకీయ నేరములకు పట్టుకొనబడినవారిని పోలీసువారు చాలా క్రూరముగ జూచుచు సంకెళ్ళతో ద్రిప్పి శిక్షితులైన వారి తలలు గొరిగించి మల్లచిప్పలందు పురుగుల అంబలి పోసి బాధింపసాగిరి. ఇట్టి కఠిన చర్యలు తీసికొనినందున ప్రజలు భయపడిపోయిరి. అంతట ఆంధ్రదేశమునందీ యుద్యమము అణగి పోయినదని ఆంగ్లేయ ప్రభుత్వము వారు అనుకొనిరిగాని, దేశాభిమానము ప్రజల హృదయమునందు గాఢముగా నాటుకొని అనేక రీతులుగా కార్యరూపము దాల్చసాగెను, ప్రజలలో విదేశ వస్తు బహిష్కారము స్వదేశ వస్త్వభిమానము స్వరాజ్యవాంఛ హెచ్చెను. దేశములో చాలచోట్ల స్వదేశవస్తువులు చేయు కార్ఖానాలు, జాతీయ పాఠశాలలు వెలయజొచ్చెను.
ఆనాడు జాతీయ పత్రికలలో నగ్రగణ్యమైన కృష్ణా పత్రికను శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు ప్రకటింపసాగిరి. కోపల్లె హనుమంతరావుగారు న్యాయవాద వృత్తిని త్యజించి బందరు జాతీయ కళాశాల స్థాపనమునకు దాని అభివృద్ధికి తమ జీవితమును ధారపోయసాగిరి, డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారును ఉద్యోగాభిలాష విడనాడి జాతీయవాదియైరి. కొండా వెంకటప్పయ్యగారును దేశభక్తులై దేశసేవా పరాయణులైరి. తరువాత ఆంధ్రాభ్యుదయమునకు తోడ్పడినవారు చాలామంది ఆనాటి యువకులే. ఇట్టి పరిస్థితులలోనే కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు, వారి స్నేహితులైన మాడపొటి హనుమంతరావుగారు, రావిచెట్టు రంగారావుగారు మొదలయినవారు కలిసి 1907 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించి, తరువాత దాని కార్యస్థానమును చెన్నపట్టణమునకు మార్చిరి. విజ్ఞాన చంద్రికామండలిలో ప్రకటింపబడిన మొదటి