Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - V


విస్తీర్ణములో చాల పెద్దదిగానున్నందునను జనసంకీర్ణమై యున్నందునను ముసల్మాను జనసంఖ్య అధికముగానున్న తూర్పు భాగమునకు ఢాకా ముఖ్యపట్టణముగ జేసి, హిందువుల జనసంఖ్య అధికముగనున్న భాగమునకు కలకత్తాను రాజధానిగ చేసి రెండురాష్ట్రములుగ చేయుట బాగుండు నని అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వాధి కారులకు తోచగా కర్జను దీని కంగీకరించెను. బంగాళా విభజనము 1905 వ సంవత్సరము అక్టోబరు నెల 16వ తేదీన అమలులోనికి వచ్చెను. బంగాలి మాతృభాషగాగల ప్రజల నిట్లు విడదీయవలదని ఎందరు మొర పెట్టుకొన్నను కర్జను వినలేదు. అమలులోనికి వచ్చులోపలనే కర్జను వేరొక సందర్భమువలన తనపదవికి రాజీనామా నిచ్చెను, కాని బంగాళా విభజనముమాత్రము మారలేదు. బంగాళీయులు తమకు ఘోరమయిన అన్యాయము జరిగినదని దుఃఖపడి భూమ్యాకాశములు బ్రద్దలగునంతటి ఆందోళనముచేసిరి. హిందూదేశములోని అన్ని భాగముల వారును బంగాళీల యెడల సానుభూతి కలిగి తమతమ దేశములలో గొప్ప సభలు చేసి దొరతనమువారి చర్యలు ఖండించిరి. ఈ విషయమున ఆంధ్రులు వెనుకపడలేదు. ఈ విషయములను గూర్చి చెన్నపురి రాజధానిలో రాజకీయోపన్యాసము లియదలచి బిపిన చంద్రపాలుగారు కలకత్తా నుండి బయలుదేరి బరంపురము, విశాఖపట్టణముల మీదుగా రాజమహేంద్రవరము, బెజవాడ, బందరు, నెల్లూరు మొదలయిన పట్టణములందు ఆంగ్లేయ దొరతనమువారు హిందూదేశమును పాలించుచున్న పద్ధతులను ప్రబలముగా ఖండించుచు ప్రతిదినము ఇంగ్లీషులో దీర్ఘపన్యాసము లిచ్చుచుండిరి. వాటిని ప్రతియూరను ఎవరో ప్రముఖులు తెలుగులోని కనువదింపగా వేలకొలది ప్రజలుద్రేక పూరితులు కాసాగిరి. ఆ సందర్భమున

తే. గీ. “భరతఖండము చక్కని పాడియావు,
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియకట్టి."

అని చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు పాలు గారి ఉపన్యాసానంతరము చదివిన పద్యమును విని రాజమహేంద్ర వరములోని సభాసదులు బ్రహ్మాండము పగులునట్లు చప్పట్లుకొట్టి పలుమారులు దానిని చదివించుకొని కంఠ పాఠము చేసిరి. అది అన్ని పత్రికలలోను ప్రకటింపబడి ఆంధ్రదేశమంతటను వ్యాపించి, ప్రతివారి నోటను విన వచ్చుచుండెను. హరికథలలోని కెక్కెను. ఆంగ్లేయ దొరతనమును గూర్చి ఆంధ్రు లెట్టి యభిప్రాయమును కలిగియుండిరో దీనివలననే విదితమయ్యెను.

బిపినచంద్రపాలు ఆంధ్రదేశ పర్యటనమువలన వందేమాతరోద్యమము తెలుగు దేశమంతటను వ్యాపించెను. ఆయన ఉపన్యాసములు విన్న వారు పరవశులై తత్ క్షణమే విదేశవస్తు బహిష్కారదీక్ష గైకొనసాగిరి. వానిని చూచి తక్కిన వారాకాలమున ధరించుచుండిన గ్లాస్కో మల్లు బట్టలను విసర్జించి స్వదేశీ నేతబట్టలను ధరింపసాగిరి.వందేమాతర మను మాట స్వరాజ్యమంత్రమై నలుప్రక్కల ప్రతిధ్వను లిచ్చుచుండెను. ఎచ్చట చూచినను దేశభక్తి పూరితములగు పాటలు, నాటకములు, హరికథలు, భజనలు ఉపన్యాసములు; ఎచ్చట చూచినను లోక మాన్యుని తిలక ధారణము; ఎక్కడ చూచినను వ్యాయామక్రీడలు: స్త్రీలు, పురుషులు కూడ నీదేశాభిమానమునందు మునిగి తేలుచుండిరి. చిన్నపిల్లలు, తుదకు గోరువంకలుకూడ “వందేమాతరమ్ మనదేరాజ్యం " అని పలుకుట పరిపాటియై పోయినది.

1907 వ సంవత్సరమున హిందూదేశములో ననేక స్థలములందు విదేశవస్తు బహిష్కారము, స్వరాజ్య సంపాదనము, జాతీయవిద్యాభివృద్ధియను విషయమును గురించి ప్రజలు తీవ్రముగా నాలోచింప సాగిరి. ఆ కాలమున రాజ మహేంద్రవరమున 'ఆంధ్రకేసరి' యను పత్రికయును, బందరులో 'కృష్ణాపత్రిక ' యు నిట్టి జాతీయభావములకు తోడ్పడు వ్యాసములను ప్రచురించుచుండెను. ఈ కృషిఫలితముగా రాజమహేంద్రవరము, బందరు మొదలయినచోట్ల జాతీయపాఠశాలలు, స్వదేశపరిశ్రమలు స్థాపింపబడెను.

1907 వ సంవత్సరము మే నెల 9 వ తేదీన పంజాబు ప్రభుత్వమువారు దేశాభిమానియు, మహాపురుషుడునైన లాలా లజపతిరాయిగారిని పట్టుకొని నిష్కారణముగ బర్మాకు కొనిపోయి మాండలే చెరసాలలో నిర్బంధించి యుంచిరి. ఈయనను కాంగ్రెసు అధ్యక్షునిగా చేయవలె