ఆంధ్రదేశ చరిత్రము . V
పోవువరక ను ఆయన ఆంధ్ర సంస్కృతి వ్యాప్తికి, విజ్ఞాన వికాసములకును, మూలకంబముగ నుండెను. ప్రపంచము
నందు విఖ్యాతిగాంచిన దివ్యజ్ఞాన సమాజము యొక్క ప్రధాన కార్యాలయము 1882 లో అడయార్ లో నెలకొల్పబడుటకు ముఖ్యముగా కాకినాడ కాపురస్తులును, చెన్నపట్టణ హైకోర్టులో న్యాయవాదియు నగు తల్లాప్రగడ సుబ్బారావుగారు కారకు లని దివ్యజ్ఞాన సమాజ స్థాపకులే వ్రాసియున్నారు. అందువలన ఈ సమాజమున ఆంధ్రులనేకులు సభ్యులై విదేశముల నుండియు, భారత దేశములోని వివిధ ప్రాంతములనుండియు వచ్చిన సభ్యులతో కలిసి ప్రాచ్య పాశ్చాత్య మత ధర్మములను గూర్చియు సంస్కృతిని గూర్చియు చర్చించి జ్ఞాన సముపార్జనము గావించి దేశాభిమానులై కాంగ్రెసు మహా
సభా స్థాపనమునకు తోడ్పడి దేశాభివృద్ధికి పాటుపడుట కవకాశము కలిగెను. ఇట్లే రామకృష్ణ పరమహంస శిష్యుడగు వివేకానందస్వామి చెన్న పట్టణమునకు వచ్చి రామకృష్ణుని సందేశమును ఆంధ్ర, ద్రావిడ దేశములందలి జనుల కంద జేసినాడు. ఆయన 1902 లో దివంగతుడగు నప్పటికే ఆయన బోధనములు, ఉపన్యాసములు ప్రజలలో మంచి విజ్ఞానమును దేశాభిమానమును కలిగించెను. వంగ దేశమునందు వర్థిల్లిన బ్రహ్మసమాజము యొక్క పరిశుద్ధాస్తిక మత బోధనములును. సంఘ సంస్కార భావములును క్రమక్రమముగా ఆంధ్రదేశమున వ్యాపింప సాగెను. బ్రహ్మసమాజ ప్రచారకుడైన శివనాథ శాస్త్రిగారు మొదట 1881 లో ఆంధ్రదేశమునకు వచ్చిరి. తరువాత 1890 లోను 1907 లోను కూడ మరల వచ్చిరి. తరువాత వందేమాతరోద్యమమున ఆంధ్రదేశమున రాజకీయోపన్యాసము లిచ్చిన బిపిన చంద్ర పాలు
గారును మొదట బ్రహ్మసమాజ ప్రచారకుడుగనే వచ్చిరి. వీరేశలింగము పంతులుగారు బ్రహ్మసమాజ సభ్యులై
స్త్రీ పునర్వివాహోద్యమము కొరకును, సంఘసంసారము కొరకును పాటుపడిరి. ఆంధ్రదేశమున రాజమహేంద్రవరము, బందరు, మొదలైనచోట్ల బ్రహ్మసమాజ శాఖలు ప్రార్థన సమాజములు స్థాపింపబడెను. ఆంధ్రదేశమునందన్ని విధములుగా విజ్ఞాన వికాసము కలిగినందు వలననే వీరేశలింగముగారి స్త్రీ పునర్వి వాహసంఘ సంస్కరణోద్యమములు కొనసాగుటకు వీలు కలిగెను. ప్రజలయందు ఉదారభావములు, విజ్ఞానమును వృద్ధిచెందుటవలననే, తరువాత వంగరాష్ట్ర సందర్భమున ప్రజ్వలించిన విదేశ వస్తు బహిష్కార స్వదేశీయోద్యమములు అతి త్వరితముగ ఆంధ్రదేశము నలము కొనెను. ఒకప్పుడు మనము అనుకొనిన సంగతులే దేశములోని మత, సంఘ విషయములందు జరిగిన మార్పులకు కారణమగుచుండును. 1900 సంవత్సరమునకు పూర్వము కొన్ని సంవత్సరముల క్రిందట ఆత్మూరి లక్ష్మీ నరసింహ సోమయాజులు గారను నొక వైశ్య శిఖామణి స్త్రీ పునర్వివాహములందు జోక్యము కలిగించుకొ నెనని ఆగ్రహించి, శ్రీ శంకరా
చార్యులవా రాయనపై ఆంక్ష వేసిరి. అంత సోమయాజులుగా రాయన పైన అభియోగము చేసి హైకోర్టువరకును పోవగా శంకరాచార్యుల వారికి రు. 200 లు జరిమానా విధింపబడెను. దీని ఫలితముగా స్త్రీ పునర్వివాహము లందు పాల్గొనిన వారిని గూర్చిగాని, జాతి, మత, కుల వివక్షత లేకుండ భోజనము చేసిన వారిని గూర్చిగాని, శంకరాచార్యులవారు మొదలగు పీఠాధిపతులు చర్య తీసికొనుటకు భయపడిరి. ఇందువలన దేశములో రాజకీయ సాంఘిక విషయములందు అన్ని కులముల వారును గలిసి పనిచేయ వీలు కలిగెను.
పందొమ్మిదవ శతాబ్ది అంత్యభాగమునను, ఇరువదవ శతాబ్ది ఆరంభమునను అనేక కారణములవలన భారతదేశమునం దశాంతి చెలరేగెను. అనేక రాష్ట్రములలో కాటకములు చెలరేగి ప్రజలకు దుర్భరబాధ కలిగించెను బొంబాయి రాష్ట్రమున మహామారి వ్యాధి ప్రవేశించి అనేకులు జనులను తనపొట్టన బెట్టుకొనెను. ఈ సందర్భమున ప్రభుత్వమువారి చర్యలను తీవ్రముగా విమర్శించిన నేరమునకై దేశపు టగ్రనాయకులలో నొకరగు శ్రీ బాలగంగాధరతిలకుగారు కారాగారమున కంప బడిరి. రూపాయ మారకమునకు సంబంధించిన మార్పులు దేశమున కార్థికముగా గొప్ప నష్టమును తెచ్చిపెట్టెను. ఈ కాలమున భారత దేశమునకు రాజ ప్రతినిధిగ నేతెంచిన కర్జనుప్రభువు తన నోటి దురుసుదనమువలన భారతీయుల ననేకమారులు తిరస్కరించి, అవమానించి, వారియాగ్రహమునకు పాత్రుడయ్యెను. ఇట్టిపరిస్థితులలో వంగరాష్ట్రము