Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - V


సాహిత్యాభివృద్ధిగాంచిన వంగ రాష్ట్రీయులతోను, మహారాష్ట్ర ప్రజలతోను, ఇతర భారతీయులతోను కలసి పరస్పర క్షేమలాభములనుగూర్చి యోచించుటకు వీలయ్యెను. 1885 లో స్థాపించబడిన కాంగ్రెసు మహాసభకు శాఖలుగా తెలుగుదేశమందు వివిధ మండలసభలు జరుపుచు కాంగ్రెసు సందేశమును వ్యాప్తిచేయ వీలయ్యెను.

రాజధానీనగరములో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, విద్యావిషయములను పలువురతో కలిసి చర్చించుటకును, అక్కడ ప్రకటింపబడు దేశీయ ఇంగ్లీషు వార్తాపత్రిక లందు తమ కష్టసుఖములనుగూర్చి ప్రకటించుటకును, ప్రభుత్వమునకు చెప్పుకొనుటకును, తమ క్షేమలాభములకు అవసరమయిన కృషి చేయుటకును ప్రజలకు అవకాశము కలిగెను. శాసనసభ లేర్పడిన తరువాత అందలి చర్చ లందు తెలుగు ప్రతినిధులు పాల్గొని రాజకీయ పరిజ్ఞానమును సంపాదించి ప్రజాప్రతినిధి ప్రభుత్వపద్ధతులు, ప్రజాభిప్రాయ ప్రకటనరీతులను అలవరుచుకొన కలిగిరి. రాజధానీనగరమందు స్థాపింపబడిన మద్రాసు విశ్వవిద్యాలయమునందును, కళాశాలలందును, పాఠశాలలందును అరవముతోబాటు తెలుగునకు కూడ చాల ప్రాముఖ్య మొసగబడుటవలన చెన్న పట్టణమునందు గొప్ప తెలుగు పండితులు, కవులు స్థిరనివాసముల నేర్పరుచుకొనిరి. తెలుగులో అచ్చుకూటము లుండుటవలన ఉద్గ్రంథములు ప్రకటింపబడసాగెను. కొన్ని మాస పత్రికలును వెలసినవి. 1900 సంవత్సరము నాటికి ఆంధ్రదేశములో నలు ప్రక్కలనుండి పండితులు, కవులు, గాయకులు, రాజధానీ నగరమునకు వచ్చుచుండుటవలన అక్కడ తెలుగుభాషాభివృద్ధికి చాలా కృషి జరుగుచుండెను. బహుజనపల్లి సీతా రామాచార్యులుగారు, చెదలవాడ సుందరరామశాస్త్రిగారు, సీతారామశాస్త్రిగారు, పరవస్తు రంగాచార్యులు గారు, కందుకూరి వీరేశలింగముగారు, కొక్కొండ వేంకట రత్నముగారు, గురజాడ అప్పారావుగారు, వేదము వేంకట్రాయ శాస్త్రిగారు మొదలయినవారి గ్రంథములు, ఉపవ్యాసములు, వ్యాసములు ప్రకటింపబడసాగెను. అందువలన తెలుగువారిలో విజ్ఞాన వికాసములు కలిగెను. చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి నాటకములును, ప్రహనవములును 1900 నాటికే ప్రకటింపబడెను. ఆనాటికే తిరుపతి వేంకటేశ్వరకవులు ఆంధ్రదేశములో నన్ని ప్రాంతములకు పోయి శతావధానములను జేయుచు, నానారాజ సందర్శనము చేయుచు ఆంధ్రసంస్కృతికి వ్యాప్తి కలిగించుచుండిరి. ఇట్లే మహాకవియు, గాయకుడును, నర్తకుడును అగు ఆదిభట్ట నారాయణదాసుగారు తమ సుప్రసిద్ధ హరికథలను దేశమంతట చెప్పుచు విజ్ఞానవికాసము కలిగించు చుండిరి. చాలమంది యువకులు ఆయన శిష్యులై దేశమంతటను ఆయన సందేశమును ప్రచారము చేయుచుండిరి. 1900 నాటికి కొన్ని సంవత్సరములకు పూర్వమే నాటక ప్రదర్శనములం దారితేరిన ధార్వాడ నాటక సమాజము వారును, పారసీ సమాజము వారును, ఆంధ్ర దేశమునకు వచ్చి హిందీనాటకము లాడినందున తెలుగు దేశములో అన్ని ముఖ్యపట్టణములందును నాటక సమాజము లేర్పడి నాటక ప్రదర్శనములు వ్యాప్తి చెందెను. అందులో కొన్ని విజ్ఞానబోధకములును, దేశభక్తి పూరితములును అయి యుండెను. ఆ కాలమునాటి కింకను మైసూరు సంస్థానమునగూడ తెలుగుభాష నాదరించు చుండిరని ఆనాడు మైసూరులోను, బెంగుళూరులోను ప్రకటింపబడిన తెలుగు లిపిలోని అసంఖ్యాకములగు సంస్కృత గ్రంథములును, ఆంధ్ర గ్రంథములును నిదర్శనముగ నున్నవి. ఇట్లే కార్వేటినగర సంస్థానమువారును, వెంకటగిరి సంస్థానమువారును, పిఠాపురము సంస్థానము వారును, ఆంధ్రభాషను. సంగీత సాహిత్యములను పోషించిరి. చిన్న సంస్థానమువా రయినను పోలవరపు జమీందారుగారైన రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావుగారు “సరస్వతి" యను పత్రికను ప్రకటించుచు అందనేక పురాతన గ్రంథములను ముద్రింపించుచుండిరి. పోలవరం రాజా వారు తమ యాస్థానమున తిరుపతికవిగారి కాశ్రయ మిచ్చి ఆదరించిరి. ఏలూరులోని రాజా మంత్రిప్రగడ భుజంగ రావుగారును కవులను పోషించుచుండిరి.

విశాఖపట్టణము జిల్లాలోని విజయనగర సంస్థానాధీశులగు ఆనంద గజపతి అభినవ భోజుడని, అభినవ కృష్ణదేవరాయ అని ప్రసిద్ధి కెక్కునంతగా సంగీత సాహిత్య కళల నాదరించెను. ఆయన తరచుగా తన ఆస్థాన కవులతోను, గాయకులతోను, పండితులతోను, చెన్న పట్టణమునకు వచ్చి నివసించుచుండెను. 1897 లో ఆయన చని