Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - V


లంబించిన అత్యధిక మయిన పన్నులను విధించు పద్దతివలన రైతులకు చాల బాధ కలుగుచుండెను. యంత్ర పరిశ్రమల నభివృద్ధి చేయనందున దేశప్రజలు ఆర్థికముగా వెనుకపడి ఇంగ్లీషువ ర్తకుల పోటీకి నిలువలేకుండిరి. దేశము దారిద్య్రమున మునిగియుండెను. ఇంగ్లీషువారు తమపట్ల భ క్తి విశ్వాసములుగల వ్యక్తులను తయారుచేయుటకు వారికి కొన్ని బిరుదముల నిచ్చియు, నిజమైన అధికారము లేని కొన్ని ప్రజాప్రతినిధి సంఘములందు వారిని సభ్యులుగ నియమించియు, భారతీయ ప్రభుభక్తుల వర్గమును నిర్మించుటకును ప్రయత్నించుచుండిరి. ఇంగ్లీషు రాణి జన్మదిన సందర్భమునను, ప్రతి సంవత్సరాది (జనవరి 1 వ తేదీ) నాడును బిరుదులు పట్టికలు ప్రచురించి తాము బిరుదు లిచ్చిన వారిని దర్బారులకు రావించి గౌరవించు చుండిరి. రాణీగారి జన్మదినోత్సవ దర్బారులు మొదలైన సభలేగాక, ఆంగ్ల రాజభక్తి యుపన్యాసము లిచ్చుటకు వీలయిన సందర్భము లనేకములు కల్పింపబడుచుండెను. క్రొత్త పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, జిల్లా బోర్డులు మొదలయిన వాటి స్థావనోత్సవములు, వాటి వార్షికోత్సవములు, ఉద్యాన కృషి సంఘముల వార్షి కోత్సవములు, రెడ్ క్రాస్ వార్షికోత్సవములు, బాల భట సంఘసభలు మొదలయిన సభలయందీ ప్రభుభక్తి ప్రదర్శనము జరుపబడుచుండెను. వాని ఆహ్వాన సంఘముల కార్యదర్శుల ఉపన్యాసములు, ఆ సభ కధ్యక్షత వహించు గవర్నరులు, ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టరులు మొదలయినవారి ఉపన్యాసములు, ఆ సభలందు ప్రదర్శింప బడు ఇంగ్లీషు పతాకములు, ఇంగ్లీషు అలంకరణములు, ఆ సభలకు వచ్చు వారి వేషభాషలు ఆంగ్లేయ దొరతనము యొక్క గొప్పతనమును ప్రదర్శించి రాజభక్తిని ప్రోత్సహించుచుండెను. 1897 వ సంవత్సరము నాటికి బ్రిటిష్ సామ్రాజ్యము నేలు ఇంగ్లీషు రాణియైన విక్టోరియా సింహాసన మధిష్ఠించి అరువది సంవత్సరములు నిండినవి. అంతట భారతదేశమునగల ఇంగ్లీషు ఉద్యోగులు, ప్రభుభక్తి పరాయణులు దేశమంతట వత్రోత్సవ సభల నేర్పాటు గావించిరి. అందు ఒకరినిమించి యొకరు విక్టోరియా రాణి యొక్క గుణగణములను, ఆంగ్లేయదొరతనమువలన భారత దేశమునకు గలిగిన లాభములను వివరించుచు ఉపన్యాసము లిచ్చి, పద్యములు, పాటలు వ్రాసి చదివిరి. రాజభక్తిని బోధించు నాటకములు ప్రదర్శింపబడెను. హరికథలు, సంగీత సాహిత్యసభలు ఏర్పాటు గావింపబడెను. ఆంధ్రదేశములోని ప్రముఖులగు కవులు, పండితులు ఈ ప్రదర్శనములందు పాల్గొని తమ శక్తి వంచన లేకుండ రాజభక్తిని ప్రదర్శించిరి.

తానొకటి తలచిన దైవమొకటి తలచును. ఆంగ్లేయులీ దేశమున నిర్మించిన ప్రభుత్వ యంత్రమునందలి కట్టు దిట్టములు, నిబంధనములు, వీరు స్థాపించిన ప్రభుత్వ సంస్థలును భారతీయ ప్రజల కొక విధమయిన శిక్షణము నిచ్చినవి. ఆంగ్లేయ పరిపాలనా విధానములందు దేశీయులు శిక్షణముపొంది, ఆరితేరి రాజకీయ పరిజ్ఞానమును సంపాదింపసాగిరి. ఇంగ్లీషువారి విధ్యా విధానము నందు స్వాతంత్య్ర భావములతో నిండిన ఇంగ్లీషు సాహిత్యగ్రంథములను చదువుటవలన భారతీయులలో స్వరాజ్యవాంఛ కలిగెను. చదువుకొన్న వారి మూలమున ఈ స్వాతంత్య్ర భావములు జనసామాన్యమునందు వ్యాపింపసా గేను.

ఆంగ్లేయ పరిపాలనమున ఆంధ్రులు మద్రాసు రాజధానిలో చేరియుండిరి. చెన్న పట్టణ స్థాపనమునందు దాని అభివృద్ధి యందు తెలుగువారు భాగస్వాములుగ నుండిరి. చదువుకొరకు, న్యాయ విచారణముల కొరకు, ప్రభుత్వ వ్యవహారముల కొరకు, తెలుగుజిల్లాలలోని వారు తరచుగా రాజధానీ ముఖ్యపట్టణమైన చెన్నపట్టణమునకు పోవుచుండిరి. మొదట విశాఖపట్టణము, కాకినాడ, బందరు రేవులనుండి పొగయోడలలోను, బెజవాడ నుండి బకింగ్ హామ్ కాలువద్వారా పడవలలోను, చెన్న పట్టణమునకు పోవలసి వచ్చుచుండెను. కొన్ని సంవత్సరముల తరువాత రైలుమీద పోవ వీలయ్యెను. 1900 సంత్సరమున గోదావరిపయిన రైలు వంతెన తయారు కాగా ఆ అక్టోబరు నుండి సరాసరి రైలు నడువ సాగెను. తెలుగు జిల్లాలలోని నలుప్రక్కలకు రాకపోకలు సులభములై ఆంధ్రులు సంఘీభావముతో తమ అభివృద్ధికొరకు కృషి చేయ వీలయ్యెను. చెన్నపట్టణమునకు ప్రయాణ సౌకర్యము లభివృద్ధి చెందుటతో తెలుగువారి జనసంఖ్య అచట ఇంకను హెచ్చు అయ్యెను. రైలుమార్గములు ఏర్పాటగుటవలన భారతదేశమునందు ఆంధ్రులకన్న ఎక్కువరాజకీయ పరిజ్ఞానము,