Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - V


పడియుండిరి. ఒకప్పుడు దక్షిణాపథమునందు విజ్ఞాన వికాసములకు, సంస్కృతికి మేలుబంతిగనుండి ఆంధ్రత్వము, ఆంధ్ర భాషాభ్యాసము తపఃఫలమునగాని లభింపవనిపించుకొన్న మన తెలుగుదనము, తెలుగుభాష దుస్థితిలో పడినవి.

1900 సంవత్సరమునాటికి తెలుగువారి ప్రధాన ఆవాసములు హైదరాబాదు నైజాము పరిపాలనములో చేరిన తెలంగాణపు జిల్లాలలోను, మదరాసు రాజధాని నేలు గవర్నరు పరిపాలనములో చేరిన రాయలసీమ, ఉత్తర సర్కారు జిల్లాలలోను ఇమిడియుండి ఆయా జిల్లా కలెక్టరుల పాలనముక్రింద నుండెను. మద్రాసు రాజధానిలోని భాగములన్నియు పైనుండి దొరతనము వారు జారీచేయు ఉత్తరువుల ప్రకారము ఆయా జిల్లా అధికారులచే పరిపాలింబడు చుండెనే కాని ఆయా ప్రాంతముల ప్రజల కందు పలుకుబడిలేదు. గవర్నరుల చెప్పు చేతలలో నుండువారిని కొందరిని శాసనసభలందు నియమించుచు ప్రభుత్వము వారు వారిని కీలుబొమ్మలవలె చూచుచుండిరి. జిల్లాలలోని రహదారులు, ప్రాథమిక విద్య, ఆరోగ్యము, మొదలైన వానికి సంబంధించిన వ్యవహారములను చక్క బెట్టుటకు కలెక్టరులు నియమించిన సభ్యులు గల జిల్లాబోర్డు సంఘములను, పట్టణమందలి పారిశుద్ధ్యము ఆరోగ్యము, ప్రాథమిక విద్య మొదలైన పనులు చక్క బెట్టుటకు కూడ కలెక్టరులు నియామకముచేయు పురపాలక సంఘములను ప్రభుత్వమువారు ఏర్పాటు చేసిరి. వానికి నిజమైన అధికారము లెవ్వియులేవు. అన్ని పనులను సర్కారు ఉద్యోగులే నిర్వహించుచుండిరి.

ఇంగ్లీషువా రేపని చేసినను తమ క్షేమ లాభములను, గౌరవమును ఆలోచించుకొనియే చేయుచుండిరి. వారి యధికారము క్రింద సంస్థానములను పరిపాలించు దేశీయ రాజులను, నవాబులను కనిపెట్టి యుండుటకై రెసిడెంట్లను నియమించిరి. తమ దొరతనమును బలపరచుకొనుటకై సైన్యములను దేశములో నలుమూలలను గల కంటోన్మెంటులను దండు ప్రదేశములలో నెలకొల్పి యుంచిరి. తమ సైన్యముల రాకపోకల కొరకును, తమ సరకుల రాకపోకల కొరకును, అవసరములైన రహదారులను నిర్మించిరి. బందిపోటులు మొదలైనవి లేకుండ చేయుటకును, దేశములో కల్లోలము గాని అశాంతిగాని ప్రబలకుండ నుండుటకును పోలీసుబలమును చేర్చియుంచిరి. తమ తాబేదారులైన జిల్లా కలెక్టరులకే నేరమును మోపు నధికారమును, వాటిని విచారించు నధికారమును ఇచ్చిరి. ఈ దేశమున ఇంగ్లీషు విద్యా విధానము నెలకొల్పు విషయములో కూడ వారవలంబించిన పద్దతి చిత్రమైనది. మొదట వారింగ్లీషు విద్యను ప్రోత్సహించలేదు. మొదట 1812లో తెల్ల దొరలకై మద్రాసు సెంటు జార్జికోటలో నొక కాలేజీని స్థాపించి, అందులో అరవము, తెలుగు పండితులను నియమించిరి. వారు రచించిన గ్రంథములు కొన్ని ఇప్పటికిని గలవు. తరువాత తమకు కావలసినట్లు ప్రభు భక్తిగల గుమాస్తాలను, చిన్న ఉద్యోగులను తయారుచేయుటకు గావలసిన ఇంగ్లీషు విద్యను బోధించుటకు 1835 లో నిశ్చయించిరి. అందుకు కావలసిన పాఠశాలలు కళాశాలలు జిల్లా ముఖ్య పట్టణములలో స్థాపించిరి. విద్యార్థులను పరీక్ష చేయుటకు విశ్వవిద్యాలయములను 1857 లో రాజధానీ నగరములందు స్థాపించిరి. ఇట్లే దేశములో శాంతి భద్రతలను క్రమ పద్ధతిని నెలకొల్పుటకు న్యాయస్థానములను నెలకొల్పి వివిధ రాజధానీ నగరములందు ఉన్నత న్యాయస్థానములను స్థాపించిరి. మన దేశములో క్రైస్తవమత ప్రచారమునకై వచ్చిన మిషనరీలు విద్యాబోధనము చేసియు, వైద్యశాలలను స్థాపించియు ప్రజల నాకర్షించి తమ మతమున కలుపుకొన బ్రయత్నించుచుండిరి.

దేశములో రైలుమార్గములను, తంతి తపాలా మార్గములను వేయుటలోకూడ ఆంగ్లేయ ప్రభువులు తమ సైన్యముల కొరకును, తమ వ్యాపారమునకును అవసరము లయినవానిని మాత్రము నిర్మించిరిగాని, దేశీయ ప్రజల యావశ్యకములను గమనింపలేదు. ఆంగ్లేయ ప్రభుత్వము వచ్చిన తరువాత పూర్వమువలె అరాజకము లేకుండ, రాచబాటలలో దోపిళ్ళు లేకుండ శాంతిభద్రతలు, కలిగినమాట నిజము ; ఈ ప్రభుత్వమున తెల్ల వారికిని, దేశీయులకును వివాదములు జరిగినప్పుడు తప్ప న్యాయ పరిపాలనము చక్కగా జరిపినమాట నిజము; గోదావరీ, కృష్ణానదులకు 1846-55 ల మధ్య అనకట్టలు నిర్మించియు, మరికొన్నిచోట్ల నీటివసతులను కల్పించియు, పల్లపు సాగు వ్యవసాయము నభివృద్ధిచేసినమాట నిజము. కాని వా రవ