Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - IV


బహిరంగముగా దోపిళ్ళు చేయుచుండిరి. నిజాము రాజ్యములో పిల్లలను పెద్దలను బానిసలుగా విక్రయించుచుండిరి.

గాజుల లక్ష్మీనర్సు సెట్టిగారు చేసిన తీవ్రమైన ఆందోళనము ఫలితముగా 1852 లో డేన్ టి సేమరు అను నొక పార్లమెంటు సభ్యు డీ దేశమునకు వచ్చి శిస్తుల వసూళ్ళలో జరుగు చిత్రహింసలను జూచి వర్ణించినాడు. అంతట మద్రాసులో హింసల విచారణ సంఘము నియమింపబడెను. ఆ సంఘమువారు బయల్పరచిన అన్యాయముల ఫలితముగా ఇకముందు ఇట్టి అకృత్యములు జరుగరాదని ప్రభుత్వము వారు క్రీ. శ. 1854 లో ప్రకటించుట తటస్థించెను.

కంపెనీ పరిపాలనమున ప్రజలకుగల కష్టములనుగూర్చి దేశ ప్రజ లెంత మొర పెట్టుకొనినను లాభము లేకపోవుచుండెను. అప్పటి కేదో విచారణ చేసి తరువాత ఏమియు చర్య జరుపక ఉపేక్షించుచుండిరి. కంపెనీ ప్రభుత్వవిధానము మారినగాని ఈ అన్యాయములు తొలగవని ప్రజలు గ్రహించిరి.

సిపాయీల పితూరీ అను విప్లవము : కంపెనీవారికి రాజ్యాధికారపు పట్టాను మరల నొసగవలదని దేశములో అన్ని ప్రాంతములనున్న ప్రజాసంఘములును ఇంగ్లీషు పార్ల మెంటు వారికి మహజరు లంపుకొన్నను ప్రజల మొరలను పార్లమెంటువారు పెడచెవిని బెట్టిరి. 1853 లో మరల కంపెనీ వారికి ప్రభుత్వాధికారము లభించెను. అంతట ఈ దేశమునందు దుష్పరిపాలనమును ప్రజాపీడనమును పెచ్చు పెరిగినవి. దేశములోని రాజులను, నవాబులను కంపెనీ వా రేదో సాకుతో పదభ్రష్టులుగ జేసి రాజ్యములను కలుపుకొనసాగిరి. దేశములోని ప్రజలు తమకష్టములను చెప్పుకొనినను ఆలన పాలనలు చేయువారు లేరైరి. ప్రజలబాధలు దుర్భరము లయ్యెను. క్రీ.శ. 1857 లో ఇంగ్లీషు కంపెనీ కొలువులో నుండిన సిపాయిలు ముందుగా తిరుగుబాటు చేసిరి. అంతట దేశములోని ప్రజలు ఇంగ్లీషు పరిపాలనను ధిక్కరించి దౌర్జన్యములు జరిపిరి. ఇంగ్లీషువారు చాలమంది వధింపబడిరి, విప్లవకారులు ఇంగ్లీషువారి కోటలను స్వాధీనము చేసి, కొనిరి. దీనికి ఇంగ్లీషువారు సిపాయిల పితూరి అని పేరు పెట్టియున్నను ఇది నిజముగా నొక ప్రజావిప్లవమే. ఇంగ్లీషువా రెట్లో ఈ గండము గడచి బయటపడిరి.

హైదరాబాదులో మతావేశపరులయిన మహమ్మదీయులు కొందరును, షోరాపూరు అను బీదరు సంస్థానము నేలు వేంకటప్పనాయకుడును ఈ సందర్భమున తిరుగుబాటు చేసిరి గాని లాభము లేకపోయెను. నిజాము ప్రభుత్వ మంత్రియైన సాలారు జంగు ఇంగ్లీషువారికి సహాయుడై దేశములో శాంతిని కాపాడెను. క్రీ. శ. 1846-1855 మధ్య గోదావరి కృష్ణానదులకు ఆనకట్టలు నిర్మింపబడినందున ఈ మండలములు సుభిక్షముగా నుండి ఇందలి ప్రజలు ఇంగ్లీషు కంపెనీ వారిపట్ల కృతజ్ఞులై యుండిరి.తెలుగు జిల్లాలనుండి కంపెనీ సైన్యములో చేరిన తెలుగు సిపాయిల దళములను "తెలింగా రెజిమెంటు" అనిరి.

1857 లో సిపాయిల తిరుగుబాటులో తెలుగు సిపాయీలు చేరక పోవుటయే గాక ఆ విపత్సమయమున ఇంగ్లీషువారికి గొప్ప అండగా నుండి వారి పక్షమున శత్రు సైన్యములతో యుద్ధము చేసి జయము చేకూర్చిరి. విప్లవము అణచు సందర్భములోనేగాక తరువాత కూడ ఇంగ్లీషువారు అనుమానమున్న వారినందరిని విచక్షణ లేకుండ కాల్చి వేయసాగిరి. ఆ సందర్భమున నెంతో రక్తపాతము జరిగెను. విప్లవా నంతరము కంపెనీ పరిపాలన రద్దుచేయబడి క్రీ. శ. 1858 నవంబరు 1వ తేదీన ఇంగ్లండు రాణియైన విక్టోరియా భారత దేశ చక్రవర్తినిగా ప్రకటింపబడెను. ఇంగ్లాండు పార్లమెంటు వారి మంత్రిక్రింద భారతదేశమున గవర్నరు జనరలు పరిపాలన జరుగసాగేను.

ఆ సమయమున ఇంగ్లీషు దొరతనమును సుస్థిరముగా చేయుటకు అవసరమైన శాసనములు కట్టుబాటులు అనేకములు చేయబడినవి, ఇంగ్లీషువారు భారతదేశ ప్రభుత్వము నొక ఇనుప యంత్రముగా చేసి కఠినములైన పద్ధతులతో పరిపాలన చేయసాగిరి. ఇంగ్లీషువారు విప్లవానంతరము చేయుచుండిన కఠినచర్యలను జూచి ప్రజలు భయపడి పోయిరి, ప్రజలు తమ కష్టములనుగూర్చి చెప్పుకొనుట కయిన సాహసింపలేకుండిరి. ఆకాలమున కలకత్తాలో 'హిందూ పేట్రియటు' పత్రికాసంపాదకుడైన హరిశ్చంద్ర ముఖర్జీగారు మాత్రము ప్రజల కష్టసుఖములను గూర్చి