Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - IV


ఈ పరిస్థితులలో తర్జనభర్జనలు జరిగిన పిమ్మట ఇంగ్లీషు వారు తమకు ఇంగ్లీషు నేర్చిన గుమాస్తాలు కావలసి యున్నందున ఎట్టకేలకు ఈ దేశమున ఇంగ్లీషుభాషను, విజ్ఞానమును బోధించు విద్యావిధానము స్థాపించుటకు క్రీ.శ. 1835 లో నిశ్చయించిరి. 1840 లో చెన్నపట్టణమున స్థాపింపబడిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు, అరవము, తెలుగు బోధించుట కేర్పాటుచేయబడెను. క్రీ.శ. 1842 లో పచ్చయప్ప పాఠశాల స్థాపింపబడి అట్టి ఏర్పాటులే చేయబడెను.

క్రైస్తవమత ప్రచారము : ఇంగ్లీషు కంపెనీవారీదేశము లోనికి చాలకాలమువరకు క్రైస్తవ మతబోధకులను రానియ్యలేదు. హిందువులు మతాచారములపట్ల కంపెనీవారు సానుభూతితో ప్రవర్తించుచు హిందువుల దేవాలయములను కొన్నిటిని తామే నిర్వహించుచుండిరి. ఇంగ్లీషు కలెక్టరులే దేవాలయములలోని అర్చకులను నియమించి నిత్యధూపదీప నైవేద్యముల కేర్పాటులు చేయుచు, దగ్గరనుండి ఉత్సవములు జరిపించుచుండిరి. దేవాదాయముల పరిపాలనను గూర్చి క్రీ. శ. 1817 లో ఒక చట్టముకూడ చేయబడెను.

ఇట్టిస్థితిలో 1813 తరువాత క్రైస్తవ మత బోధకులీ దేశమునకు వచ్చి విద్యాబోధనము ద్వారమున క్రైస్తవ మతప్రచారము చేయసాగిరి. పాఠశాలలందలి పిల్లల మనస్సులు విరిచి వారిలో విపరీతభావములు కలిగింపసాగిరి. హిందూ దేవాలయములను క్రైస్తవ పరిపొలకులు నిర్వహించుట బాగుగలేదని ఆందోళనముచేసి దానిని మాన్పించిరి. తిరుపతి మొదలగు దేవస్థానములు మహంతున కప్పగించి కంపెనీవారు తొలగిరి. క్రైస్తవ మతప్రచారకులకు కంపెనీ పరిపాలనమున పలుకుబడిహెచ్చెను. ఉద్యోగుల సహాయముతో వారు దేశీయులను క్రైస్తవమతమున గలుపుకొన ప్రయత్నించిరి. ప్రభుత్వ పాఠశాలలందు బైబిలు బోధించునట్లు చేయుటకై ప్రయత్నించిరి. కాని అది జరుగలేదు. అయినను, బైబిలునుగూర్చి ప్రశ్నలు వేసి జవాబులు చెప్పలేనివారిని పరీక్షలలో తప్పించసాగిరి. తప్పినవారికి ఉద్యోగము లొసగరయిరి. కనుక బైబిలు నేర్చుకొనుట తప్పనిసరి యయ్యెను. క్రైస్తవమతమున గలిసినవారికి కుటుంబము యొక్క ఆస్తిలో హక్కులు పోకుండ శాసనము చేయించిరి.అంతట కొంతమంది విద్యార్థులు క్రైస్తవమతమున కలియగా చెన్న పట్టణమున ప్రజలలో కల్లోలము కలిగెను. ఆ కాలమున చెన్న పట్టణమున తెలుగువర్తకులలో ప్రముఖులయిన గాజుల లక్ష్మీనర్సు శెట్టిగా రీ అన్యాయములను జూచి వీని నరికట్టుటకు క్రీ. శ. 1844 లో "చెన్నపట్టణ స్వదేశసంఘము" అను ప్రజాసంఘమును స్థాపించి, క్రెసెంటు అను పత్రికను స్థాపించి, దాని కొరకు ఇంగ్లీషు దొరను సంపాదకునిగా నేర్పరచిరి. క్రైస్తవ మతబోధకులును, కంపెనీ ఉద్యోగులును కలిసి చేయుచున్న అక్రమములను గూర్చి విమర్శించి అసమ్మతి తీర్మానములను గావించి గొప్ప ఆందోళన జరిగించిరి.

ప్రజల కష్టములు  : ఆ కాలమున దేశీయులకు పెద్ద ఉద్యోగము లియ్యకుండిరి. దొరలకు దేశ భాషలు రావు. అధికారులు లంచగొండు లయియుండిరి. న్యాయ విచారణలో సామాన్యులకు న్యాయము జరుగకుండెను. పోలీసులు అసమర్థులుగనుండి నేరములు చేయువారిని కనిపెట్టలేక నిరపరాధులను బాధించుచుండిరి. పల్లపుసాగుకు నీటి సౌకర్యములు లేవు. కాలువలు, చెరువులు మరమ్మతులు లేక పొడగుచుండెను. పన్నులు అత్యధికముగా నుండినవి. వానిని వసూలు చేయుటలో కంపెనీ అధికారులు రైతులను చిత్రహింసలకు గురిచేయుచుండిరి. దీనిని గూర్చి లక్ష్మీనర్సుగారు తమపత్రికలో విమర్శించి, చెన్నపట్టణ స్వదేశ ప్రజాసంఘములో తీర్మానములుగావించి, పై అధికారుల కంపి, సీమలో కూడ ప్రచారము చేయసాగిరి. తెలంగాణములోని పరిస్థితులు కూడ ఇట్లే యుండెను. అక్కడ శిస్తు వసూలుచేయుటకు ఇజారాలు పొందిన గుత్తేదారులును, సర్కారు నౌకరులును శిస్తులను వసూలుచేయుటలో ప్రజలను చిత్రహింసలపాలు చేయుచుండి రని క్రీ. శ. 1829 లో హైదరాబాదు రెసిడెంటుగా నున్న సర్ చార్లెసు మెట్కాఫుగారు వ్రాసినారు. ఆ రాజ్యమున నవాబుగారు మొదలుకొని చిన్న యుద్యోగివరకు కలవారికి నజరానాలిచ్చి ప్రజలు తమ పసులు చేయించుకొనవలసి యుండెను. పోలీసులు అప్రయోజకులై యుండ శాంతిభద్రతలకు భంగము వాటిల్లెను. హైదరాబాదులోను, గ్రామములలోను దొంగలు