ఆంధ్రదేశ చరిత్రము . IV
నిజామలీఖాను ఇంగ్లీషు కంపెనీవారి సహాయముతో క్రీ. శ. 1761 లో నిజాము సలబతుజంగును రాజ్యభ్రష్టుని చేసెను.
క్రీ.శ. 1761 లో ఆసఫ్ జా నాల్గవ కుమారుడు నిజామలీఖాను దక్కనుకు సుబేదారుడై నిజాము బిరుదు వహించెను. ఇంగ్లీషు కంపెనీవారు తనకు సైనిక సహాయముచేయు పద్ధతిపై ఇతడు 1762 లో శ్రీకాకుళము, రాజమహేంద్రవరము, ఏలూరు, కొండపల్లి అను నాలుగు సర్కారులను వారికిచ్చెను. ఈరాజ్యమును వారు స్వయముగా పరిపాలించుటకు జంకి, తాము కోరినప్పుడు తమకు స్వాధీనపరచు పద్ధతిపై ఆ ప్రాంతమును నిజాము సరదారుడైన హుస్సేనల్లీ క్రిందనే యుంచిరి. ఫ్రెంచి వారెవ్వరును ఈ దేశములోనికి రాకుండ చేయుటయే ఇంగ్లీషువారు' అప్పుడు తల పెట్టిన ముఖ్య కార్యము.
బంగాళమున ప్లాసీయుద్ధములో విజయము పొందిన పిమ్మట క్లైవు బలవంతుడై ఢిల్లీ చక్రవర్తితో రాయబారములు జరుపగా ఇంగ్లీషు కంపెనీ వారిని ఢిల్లీ చక్రవర్తి బంగాళము, బీహారు, ఒరిస్సా పరగణాలకు క్రీ.శ. 1765లో దివానులుగ జేసెను. ఆ సందర్భమున క్లైవు, చక్రవర్తి వలన ఉత్తర సర్కారులకు కూడ ఒక సన్నదు సంపాదించెను. అతడు ఈ సంగతిని మచిలీబందరులో ప్రకటించి ఫ్రెంచివా రీప్రాంతములకు రాకుండ చేసెను. అయితే ఈప్రాంతములన్నింటికిని నిజముగా పరిపాలకుడు దక్కను సుబేదారుడైన హైదరాబాదు నిజామే. అందుచేత అతనితో ఇంగ్లీషు కంపెనీవారు క్రీ. శ. 1766 లోను 1768 లోను సంధి రాయబారములు జరిపి, ఆయనకు సైనికసహాయము చేయు పద్ధతిలో, ఉత్తర సర్కారులకు ధ్రువమైన కౌలు పొందిరి. కాని వానిని వెంటనే తాము స్వాధీనపరచుకొనక, తమకు ఎప్పుడు కావలసిన అప్పుడు వశపరచుకొను పద్ధతిపై హుస్సేనల్లీ అను నిజాము సర్దారు క్రిందనే ఉంచిరిగదా! ఆ ఏర్పాటు 1769 తో అంతమయ్యెను. అంతట కంపెనీవారు ఉత్తర సర్కారులను స్వయముగా పరిపాలింపసాగిరి. అంతవరకును గుంటూరు మండలము మాత్రము నిజామల్లీఖాను సోదరుడైన బసాలతుజంగు క్రింద నుండెను. దానిని కూడ కంపెనీ వారు క్రీ. శ. 1778 లో ఆయనవలన కౌలుకు తీసికొనుటతో ఈ జిల్లాలన్నియు వారి వశమయ్యెను. అంతట ఈ ప్రాంతము చెన్నపట్టణ రాజధానిలోని భాగముగా పరిపాలింపబడసాగెను.
ఇంగ్లీషువారి పరిపాలన : ఉత్తరసర్దారులు ఇంగ్లీషువారి వశమగునప్పటికి గ్రామపరిపాలనము, గ్రామపంచాయతుల ద్వారమున జరుగుచుండెను. గ్రామమునసబు, కరణము, మణేదారు, తలారి మొదలగు అధికారులును, గ్రామమునకు కావలసిన పనులు చేయు వృత్తుల వారును, ఆయకాండ్రనబడిరి. భూమిపంటలో వీరికి స్వల్ప భాగము లొసగబడు చుండెను. పంటలో సర్కారుకు చెల్లవలసిన భాగమే శిస్తు. అప్పుడప్పుడు జమీందారుల సిబ్బందులు ఇంకను సొమ్ముకావలెనని ప్రజలను బాధించుచుండెను.
జమీందారీ ప్రాంతమందలి భూమియంతయు జమీందారుల క్రింద నుండేడిది కాదు. ప్రతి జిల్లా యొక్క ముఖ్యపట్టణము చుట్టుపట్లనుండు భూములును సర్కారుభూములుగ నుండెను, వాటిని హవేలీ భూము లనిరి. వాటిమీదవచ్చు ఆదాయము మహమ్మదీయ సైనిక వ్యయముక్రిందను, ఉద్యోగుల జీతబత్తెములు క్రిందను వినియోగింప బడుచుండెను.
మహమ్మదీయుల కాలమున ఉత్తర సర్కారులలో నాలుగు న్యాయస్థానము లుండెను. ఏలూరులోను, రాజమహేంద్రవరము లోను "ఖాజీలు" క్రిమినలు నేర విచారణలు చేయుచుండిరి. పెద్ద కేసులను విచారించుటకును, మరణదండన విధించుటకును, ఫౌజుదారులు అమలుదారులు మాత్రమే అధికారము కలిగియుండిరి.
ఈ దేశము తమ వశము కాగానే ఇంగ్లీషు కంపెనీవారు తమ ఏజంటుల ద్వారమునను, దుబాషులద్వారమునను, పరిపాలన జరుపసాగిరి. వీరిపైన రాష్ట్రీయక వున్సిళ్లు అను కార్యాలోచనా సంఘములును, వానికి ఛీపు లను ముఖ్యాధ్యక్షులును ఉండిరి. వీరిపైన మద్రాసులోని గవర్నరుండెను. క్రీ. శ. 1784 లో మద్రాసు గవర్నరును కలకత్తాలోని గవర్నరు జనరలు అధికారమునకు లోబరచిరి. 1786 లో చెన్న పట్టణమున నొక రెవిన్యూ బోర్డు నేర్పాటు చేసిరి. 1794 లో అదివరకు అమలు జరుగుచున్న పరిపాలనా పద్ధతిని మార్చి ప్రతి జిల్లాకును కలెక్టర్ల నేర్పాటు చేసిరి. నేరములను విచారించుటకు మేజ