ఆంధ్రదేశ చరిత్రము . IV
స్ట్రేటులును, సివిలు తగాదాలను తీర్మానించుటకు మునసబులును, సదరమీనులును, వారిపైన అదాలతు న్యాయ
స్థానములును ఏర్పాటు చేయబడెను. ఇవన్నియు కంపెనీవారి కోర్టులు. చెన్నపట్టణములో, ఇంగ్లాండు దేశ రాజ్యాధి
కారము క్రింద పరమోన్నత న్యాయస్థానము 1800 లో నెలకొల్పబడినది. క్రీ. శ. 1823లో కంపెనీవారు ఉత్తర సర్కారు లపైన నిజామునకు ప్రతి ఏట చెల్లించు పేష్కషకు బదులుగా రు. 11,66,666 రూపాయలు ఒకే మొత్తముగా చెల్లించి సర్వాధికారు లయిరి. అప్పటినుండి 1859 సం.వరకును ఈ ప్రాంతము విశాఖపట్టణము, రాజమహేంద్రవరము, మచిలీపట్టణము, గుంటూరు, నెల్లూరు అను అయిదు జిల్లాలుగా విభజింపబడి చెన్న పట్టణ రాజధానిలో చేరియుండెను.
జమీందారీలు : ఉత్తర సర్కారులు ఇంగ్లీషు కంపెనీ వారి వశము లగునాటికి గంజాముజిల్లాలోని పర్లాకిమిడియు, విశాఖపట్టణములోని విజయనగరము, జయపురము, బొబ్బిలి జమీందారీలును, గోదావరిజిల్లాలోని పెద్దాపురము, మొగలితుఱ్ఱు, పిఠాపురము, గూటాల, పోలవరము, కోటరామచంద్రపురము మొదలయిన జమీందారీలును, కృష్ణాజిల్లాలోని నూజవీడు జమీందారీలును ముఖ్యమైన విగనుండెను. నెల్లూరుజిల్లాలోని వేంకటగిరి, చిత్తూరుజిల్లాలోని కాళహస్తి, ఉత్తరా ర్కాటులోని కార్వేటినగరము జమీందారీలుకూడ తెలుగు జమీందారీలే.
ఉత్తర సర్కారులలోని జమీందారులు మట్టికోటలను గట్టుకొని రాజబిరుదములను వహించి, రాజలాంఛనములతో రాజభోగముల ననుభవించుచు, రైతులను పీడించి పుచ్చుకొనుచున్న సొమ్మును దుర్వినియోగముచేసి, తాము సర్కారుకు ఇవ్వవలసిన శిస్తులు బకాయి పెట్టి, పేచీలు పెట్టుచు అక్రమములు చేయుచుండిరి. పూర్వపు మహమ్మ దీయ నవాబుల అధికార పురుషులు హెచ్చుసొమ్ము నొనగుడని జమీందారులను బాధించుచుండిరి. దేశము తమ స్వాధీనమైన పిమ్మట, ఇంగ్లీషుకంపెనీవారు జమీందారులు తమకు చెల్లింపవలసిన శిస్తు మొత్తములను నిర్ణయించి, వానిని కఠినముగా వసూలు చేయుచుండిరి. కొన్ని జమీందారీలవలన మొత్తము ఆదాయములో మూడింట రెండువంతులు కూడ వసూలు చేయసాగిరి. క్రీ. శ. 1786 లో అతివృష్టివలన పంటలు పాడుకాగా జమీందారులు సర్కారు శిస్తులు చెల్లించలేక బాకీలుపడిరి. కొందరు మెల్లగా బాకీలను పరిష్కరించిగి, కొందరు పరిష్క రింపలేక పేచీలు పెట్టిరి. ఆ సందర్భములో కంపెనీవారు కొన్ని జమీందారీలను వశము చేసికొనిరి.
కంపెనీవారు క్రీ.శ. 1802 లో జమీందారీ గ్రామములలోని రైతులవలన జమీందారులు వసూలు చేయతగిన శిస్తులను, జమీందారులు కంపెనీవారికి చెల్లించవలసిన పేష్కషును, శాశ్వతముగా నిర్ణయముచేసిరి. దీనికే పర్మనెంటు సెటిల్మెంటు అని పేరు. ఈ ప్రకారము శాశ్వతముగా ఫైసలా చేసి జమీందారులకు సన్నదు లిచ్చిరి. జమీందారులు తరువాత అనేక ఉపాయముల నవలంబించి రైతులవలన వసూలుచేయు శిస్తులను హెచ్చించిరి. క్రొత్తరుసుము లనేకములు వసూలు చేయసాగిరి. అందువలన తగు కట్టుబాటులు చేయుచు ఇంగ్లీషు ప్రభుత్వము వారు జమీందారీల చట్టమును చేయవలసి వచ్చెను.
తెలుగుదేశములోని జమీందారీలలో నెల్ల గొప్పది విజయనగరము. ఇందు మూడువేల ఎకరముల భూమియు, 1252 గ్రామములును ఉండెను. ఈ జమీందారీ నిజమున కొక సంస్థానమువలె నుండెను. దీని విషయమునగూడ కంపెనీవారు క్రీ. శ. 1802 లో శాశ్వతమైన ఫైసలా జరిపి సన్నదు నిచ్చిరి. తరువాత ఇంగ్లీషు ప్రభుత్వము వారు క్రీ. శ. 1862 లో జమీందారుగారికి 'రాజా' అను బిరుదమును, 18 ఫిరంగులు కాల్చు గౌరవము నిచ్చిరి.
మొగలితుఱ్ఱు జమీందారీ అప్పులలోపడి శిస్తులు చెల్లించలేకపోగా కంపెనీవారు వాటిని రద్దుచేసిరి. పెద్దాపురము జమీందారీకూడ చాల గొప్పదేకాని అది కూడ ఋణగ్రస్తమై శిస్తులు చెల్లించలేక విచ్ఛిన్నమైనది. పిఠాపురము మాత్రము అభివృద్ధిచెందినది. కృష్ణామండలమున నూజవీడు జమీందారీ 1802 లో రెండుభాగము అయినది. తరువాత వ్యాజ్యములు రాగా నూజవీడు సగభాగము 1879 లో మరల ఆరుభాగము అయినది. వేంకటగిరి జమీందారులు హైదరాలీని ప్రతిఘటించి కంపెనీవారికి సహాయు అయినందువలన వారికి నమ్మిన బంటు లయిరి.