Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము _ II


ఆంధ్రదేశ చరిత్రము II (క్రీ. శ. 624-1323) : తూర్పుచాళుక్యులు 624 - 1064 :- తూర్పు చాళుక్య రాజగు కుబ్జవిష్ణు విర్ధనుడు వేంగిలో క్రీ. శ. 624 లో రాజ్యపాలనము ప్రారంభించెను. ఈతని యొక్కయు ఈతని వంశపువారి యొక్కయు చరిత్రము వారివారి తామ్ర శిలా శాసనముల వల్లను, నాణెముల వల్లను, ఆ కాలపు వాఙ్మయము వల్లను, సమకాలపు రాజుల శాసనముల వల్లను తెలియుచున్నది,

క్షత్రియులును, చంద్రవంశీయులును అగు చాళుక్యులు ప్రథమమున అయోధ్యనుండి దక్షిణాపథమునకు వచ్చిరి. జయసింహుడు వంశకర్త. అతని మనుమడు మొదటి పులికేశి బిజాపూరు జిల్లాయందలి వాతాపి లేక బాదామి నగరము రాజధానిగా జేసికొనెను. అతని మొదటి కుమారుని (కీర్తివర్మ) శాసన మొకటి బాదామి గుహ యందలిది 500 శతాబ్దమును తెలుపును. బాదామి శిలాశాసనకర్త మొదటి పులికేశి 465 శతాబ్దపు (క్రీ. శ. 543) నాటి వాడు. కీర్తివర్మ కుమారుడు రెండవ పులి కేశి. ఈతని సతారా శాసనమున క్రీ. శ. 618 లో తన తమ్ముడు కుబ్జవిష్ణువు యువరాజని పేర్కొనబడెను, ఈతడే క్రీ. శ. 623 - 624 లో దుర్జయుల నోడించి, వేంగి మండలమును జయించి తన తమ్ముని కుబ్జవిష్ణుని యువ రాజుగా నియమించెను. కృష్ణానది దక్షిణ తీరమున నున్న పల్లవులను, పిష్ఠ పురమున విష్ణుకుండినులను జయించి దేశమును స్వాధీనపరచుకొనెను, ఉత్తరమున విశాఖపట్టణము జిల్లాను స్వాధీనపరచుకొనెను. దక్షిణమున గుంటూరు, నెల్లూరు జిల్లాలను జయించెను. ఈ తీరస్థ ఆంధ్రదేశమునకు ఏలూరుకడ నున్న పెదవేగిని రాజధానిగా ఏర్పరచుకొని కుబ్జవిష్ణువర్ధనుడు క్రీ. శ. 624 నుండి 641 వరకు రాజ్యమేలెను. ఈతని తిమ్మాపురము, చీపురుపల్లి, చేజెర్ల, శాసనములు ఈతని దానములనేగాక ఈతని రాజ్యవి స్తీర్ణమునుగూడ తెలుపును. ఈతని రాజ్యమునకు ఉత్తరమున కళింగగాంగులు, దక్షిణమువ కాంచీపుర పల్లవులు, పశ్చిమమున చాళుక్యులు; రాష్ట్రకూటులు పరిపాలించుచుండిరి. కుబ్జవిష్ణువు. అతనిభార్య అయ్యన దేవి ముషి.నికొండ గ్రామమును బెజవాడ యందలి జైన మఠమునకు, జైన గురువులకు దాన మొసంగిరి. ఈ దానమును వీరి మనుమని మనుమడు మూడవ విష్ణువు స్థిరపరచెను. ఈతని కాలమున చైనా దేశమునుండివచ్చిన బౌద్ధయాత్రికుడు యు అన్ ష్వంగు తెలుగుదేశమునకువచ్చి వేంగి, ధరణికోట, అమరావతి, శ్రీశైలములను దర్శించి అప్పటి రాజకీయ, మతవిషయములను గురించి వ్రాసెను.

కుబ్జవిష్ణువర్ధనుని తరువాత ఇతని కుమారుడు జయసింహ వల్లభ మహారాజు రాజ్యమునకువచ్చి క్రీ.శ.641 మొదలు క్రీ. శ. 673 వరకు రాజ్య మేలెను. ఈతని తండ్రికి 'విషమసిద్ధి' యను బిరుదముండినట్లే ఇతనికి 'సర్వసిద్ధి' యను బిరుదముండెను. వేంగి, దక్షిణ కళింగ, మధ్య ఆంధ్రదేశములను జయించి గిరి, వన, జల, స్థల దుర్గములను పెక్కింటిని స్వాధీనపరచుకొని పల్లవ, దుర్జయ, విష్ణుకుండిన రాజుల నోడించి తరిమి వేసి, దేవ బ్రాహ్మణ మాన్యముల నెక్కువగా దానముచేసి, కన్నడ, తెలుగు, సంస్కృత భాషలను, జైన, బాహ్మణ గురువులను పోషించుచు తీరస్థ ఆంధ్ర దేశమున సుస్థిర పరిపాలనము చేయసాగెను. ఈతని శాసనమును, ఇంతకు పూర్వపు రాజవంశమగు విష్ణుకుండిన మాధవవర్మయొక్క శాసనమును పొలమూరు గ్రామమున దొరికినవి. విష్ణు కుండిన మహారాజు చేసిన దానమును తిరిగి ఇతడు అసనపుర వాస్తవ్యుడును, పూర్వాగ్రహారీకుడును అగు శివశర్మ కొడుకు రుద్రశర్మకు స్థిరపరచెను.

ఈ తూర్పు చాళుక్యరాజులు తామ్రశాసనములనుబట్టి వీరి వంశక్రమ, రాజ్యకాలములు తెలియుచున్నవి. కుబ్జ విష్ణువు 18 సంవత్సరములు, ఆతని కొడుకు జయ సింహుడు 33 సంవత్సరములు, అతని తమ్ముడు ఇంద్ర భట్టారకుడు 7 రోజులు, అతని కొడుకు విష్ణువర్ధనుడు 9 సంవత్సరములు, ఆతని కొడుకు మంగిరాజు 25 సంవత్సరములు, అతని కొడుకు జయసింహ 13 సంవత్సరములు, అతని సవతి తమ్ముడు కొక్కిలి ½ సంవత్సరము, అతని అన్న విష్ణురాజు 35 సంవత్సరములు, అతని కొడుకు విజయాదిత్యుడు 18 సంవత్సరములు, అతని కొడుకు విష్ణువర్ధనుడు 35 సంవత్సరములు రాజ్యమేలిరి. వీరి కాలమున అనేక భూములు, గ్రామములు బ్రాహ్మణులకు, దేవాలయములకు దానమివ్వబడెను.తరుచు పశ్చిమ చాళుక్యుల నోడించి వారి రాజ్య మాక్రమించిన