ఆంధ్రదేశ చరిత్రము - I
వారి ప్రాపకముపొంది బలవంతుడయ్యెను. ఈ వంశము నందలి విక్రమేంద్రవర్మయు, గోవిందవర్మయు గొప్ప పరాక్రమో పేతులైన రాజులు. తరువాతి రాజులలో మూడవ మాధవవర్మ ముఖ్యుడు. ఇతనికి 'జనాశ్రయుడ'ను పేరు కలదు. 'జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి' అను గ్రంధమును రచించిన గణస్వామిని ఇతడు ప్రోత్సహించెను. గోదావరినది దాటి ఈతడు రాజ్యము విస్తరించుకొని నట్లున్నది. ఇతడు పొలంబూరు గ్రామమును, నాలుగు నివర్తనముల భూమిని శివశర్మ అను బ్రాహ్మణునికి దానము చేసెనని ఇతని పొలమూరు శాసనము తెలుపుచున్నది. మాధవవర్మ కుమారు డయిన మంచన భట్టారకుని కాలమున చాళుక్య రాజగు రెండవ పులకేశి విష్ణుకుండినుల నోడించి వేంగీ రాష్ట్రమును స్వాధీనము చేసికొని తన తమ్ముడగు కుబ్జ విష్ణువర్ధనుని పిఠాపురములో రాజ ప్రతినిధిగా నియమించెను. ఈ కుబ్జ విష్ణువర్ధనుడే
క్రీ. శ. 625 లో స్వతంత్రుడై తూర్పు చాళుక్య వంశమునకు మూలపురుషు డయ్యెను. క్రీ.శ. 638 లో ఈ చాళుక్య వంశమునకు చెందిన రాజు జయసింహుడు పొలంబూరు గ్రామమును శివశర్మ కుమారుడగు రుద్రశర్మకు దానము చేసినట్లు మరియొక పొలమూరు శాసనము చెప్పుచున్నది. విష్ణుకుండినుల అనంతరము తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశమునకు అధిపతులైరి. విష్ణుకుండినుల కాలము గుహాలయములకు ప్రాముఖ్యము కాంచినది. ఉండవల్లి, సీతానగరము, విజయవాడ, మొగలు రాజపురము ప్రాంతములలోని ఏకశిలా గుహాలయ నిర్మాణములు వీరి కాలమునాటివే.
కదంబులు :- సముద్రగుప్తుని దండయాత్ర తరువాత పల్లవుల ప్రతిభ తగ్గుటతోడనే కదంబులను వారు కర్ణాటక ప్రాంతమున స్వతంత్రులైరి. వీరు బ్రాహ్మణులు. యజ్ఞయాగాది క్రతువులు చేయువారు. ఈ వంశమున మయూరశర్మ అనునతడు కాంచీనగరముచేరి సంస్కృతా భ్యాసము చేయుచుండగా ఒక పల్లవ ఆశ్వికుడు అతనిని హేళనము చేసెనట. అంతట మయూరశర్మ క్షాత్రపథ మవలంబించి పల్లవుల నోడించి క్రీ. శ. 345 ప్రాంతమున రాజ్యము స్థాపించెను, వైజయంతి లేక వనవాసి కదంబుల రాజధాని. సుమారు 2½ శతాబ్దులు ఈ వంశపురాజులు పాలించిన తరువాత వాతాపి (బాదామి) చాళుక్యులు వారి రాజ్యమును వశపరచుకొనిరి.
వాకాటకులు : క్రీ. శ. మూడవ శతాబ్దాంతములో వాకాటకులను వారు మధ్యప్రదేశములో స్వతంత్రులైరి. ప్రస్తుత బీరారులో వారి రాజధాని యుండెడిది. రాజ్య స్థాపకుడు వింధ్యశక్తి అనువాడు. పద్మావతిని రాజధానిగా చేసికొని మధ్య భారతములో పాలించిన భార శివనాగులకు వీరు బంధువులు, వైదిక మతాభిమానులు. గుప్త చక్రవర్తులతోను, విష్ణుకుండి నులతోను, కదంబులతోను వివాహ సంబంధములు చేసికొని వీరు తమ రాజ్యమును బలపరచుకొనిరి. గుప్తులతో కలిసి శకుల నోడించిరి. వైదిక మత పునరుద్ధరణమునకు సంస్కృత భాషాభివృద్ధికి గుప్తులకు మార్గదర్శకులయిరి. ప్రవర సేనుడు అను రాజు విష్ణుభక్తుడు. ఇతడు సేతుబంధమను ప్రాకృత కావ్యమును రచించెను. అజంతా గుహాలయము లందలి చిత్రలేఖనములలో వాకాటకులు ప్రతిభయు, కళాభివృద్ధికి వారొసగిన ప్రోత్సాహమును కనబడును. తుదకు బాదామీ చాళుక్యులు వారి పతనమునకు కారకులయిరి.
కాళింగులు : గంగా మహానదులకు మధ్యగత మయిన దేశము ఉత్కళము. అందలి జనులు ఉత్కళులు, మహానదీ గోదావరుల మధ్యదేశము కళింగదేశము. అందలి జనులు కాళింగులు. మహాభారత యుద్ధమున ఉత్కళులు పాండవులకు సాయము చేయగా కాళింగులు కౌరవులకు తోడుపడిరి. సముద్రగుప్తుని దండయాత్రానంతరము కళింగమును మాఠరవంశజులు, వాసిష్ఠీ వంశజులు, తరువాత గాంగవంశజులు పాలించిరి. కాళింగులు నేర్పరులయిన . నావికులు. వారు దూరద్వీపములందు వలస లేర్పరచి తమ వైదిక, బౌద్ధమతములను, నాగరకతను, శిల్పమును తమతో గొనిపోయి వ్యాపింప జేసిరి.
ఆంధ్రదేశమున ఆంధ్రశాతవాహన సామ్రాజ్యము క్షీణించిన తరువాత పెక్కు చిన్న చిన్న రాజ్యములు తలలెత్తినవి. అనేక రాజవంశములు పాలించినవి. మరల తూర్పు చాళుక్యుల ఆధిపత్యమున ఆంధ్రదేశమునకు ఏకత్వము, స్థిరత్వము ఏర్పడెను.
వై. వి. ఆర్.