ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము
చిఱ్ఱగోనే, కోతికొమ్మచ్చివంటి ఆటలతోపాటు పాటలును గలవు.
శృంగారగేయములు : జానపద వాఙ్మయమున శృంగార రస ప్రధానము లయిన పెక్కు గేయములు కలవు. ఇవి యెంత బహుళ సంఖ్యలో గలవో అంత విరళసంఖ్యలో ముద్రింపబడినవి. ఇట శృంగారము పరకీయమా, స్వకీయమా, ఉత్తమ నాయికానిష్ఠమా లేక ప్రాకృతనిష్ఠమా అను చర్చలతో పనిలేదు. జానపదుల - ప్రాకృతుల -వాఙ్మయమున శిష్టాలం కారిక వచనములు అంతటను పొసగవు. జానపదులు చిత్రించిన సీతారాములు మున్నగు ఉత్తమ నాయికా నాయకులకు సంబంధించిన శృంగారము కూడ పామరభావ సమన్వితమే. జానపదుల పేరిటనున్న వాఙ్మయమం దంతటను గోచరించునవి వారి భావములే కాని ఆయాపాత్రముల భావములు కావు. ఎట్టి గేయములందైనను జానపదుల ప్రేమకలాపములు, సాంఘిక నియమోల్లంఘనములు, పరస్పరాకర్షణము లే కాననగును. జీవితము యథాతథముగ నగ్న తేజముతో భాసించును. కావ్యధర్మమైన ఔచిత్యవిచారమును, ఔచిత్యపోషణో ద్దేశముతో పాత్రములకు మెరుగు పెట్టు పద్ధతియు జానపద గేయములందు లేవు. ఉదాత్తతయు నీచతయు, సభ్యశృంగారము, శృంగారరసాభాసము, నీచ శృంగారము, మొదలగునవి అన్నియు నొకదానితో నొకటి బుజము లొరసికొనుచు పోవుచుండును. ఐనను ధర్మా వలంబనముగల ప్రేమశృంగారములతో ఒప్పు గేయములుకూడ అనేకములు గలవు. రామాయణ గేయము లందు సీతగడియ, సీతామ్మవారి అలుక, సీతాదేవి వేవిళ్లు, ఊర్మిలా దేవినిద్ర, సీతాదేవి ఆనవాలు మున్నగు పాట లందు సభ్యశృంగారమునకు వెలికాని మనోహర భావము లున్నవి. సుందర కాండ పదమున వియోగ శృంగారము చక్కగా ప్రదర్శింపబడినది. భారతగాథలందు నలచరిత్ర, సుభద్రాకల్యాణము, శశిరేఖాపరిణయము, దేవయాని చరిత్రము శృంగార గేయములు, భాగవత కథలు అనేకములు రసతుందిలములు. చారిత్రక గేయములైన దేశింగు రాజు కథ, బొబ్బిలికథ, సదాశివ రెడ్డికథ మున్నగు వాటి యందు ఆయా వీరదంపతుల శృంగారము ఉత్తమశ్రేణికి చెందినదిగా కాననగును, లక్ష్మమ్మ, సన్యాసమ్మ, మండపేట పాపమ్మ, నల్లతంగాళ్, ఎరుకల నాంచారి, వీర రాజమ్మ — ఈ గేయములందు ధర్మస్వభావులైన జానపద దంపతుల ఉత్తమశృంగారము ధ్వనించుచున్నది. గంగా వివాహమున హరుడు దక్షిణనాయకుడు. సురాభాండేశ్వరమున పరకీయ శృంగారమున్నది. వరదరాజు పెండ్లి, ఆండాళ్ చరిత్రము, వెంకటేశ్వర్ల వేట, చెంచెత కథ ఇత్యాదులందు చక్కని శృంగారమున్నది. ఇట్టి గేయము లందు శృంగార మంగముగా నున్నది. శృంగారము ప్రధానముగాగల చిన్న చిన్న గేయములు లక్షలసంఖ్యలో నున్నవి. చల్ మోహనరంగ, వెంకయ్య చంద్రమ్మపాట, నారాయణమ్మపాట, సిరిసిరిమువ్వ, రంగం పదములవంటి కొన్ని పెద్దపాటలు అచ్చైనవి. తెలంగాణమున కాముని పున్నమ సందర్భమున పాడునట్టి పాటలన్నియు శృంగార కళా ఖండములే.
అద్భుతకథలు : జానపదులకు అద్భుతరసాఖినివేశము మెండు. సాధారణ విషయములందు అలౌకికములును, అద్భుతములు నగు కల్పనలు కూర్చి పెద్ద చేయుట వారికి వినోదముతోపాటు భక్తియో, భయమో, పెంపొందించు కొనుటకు ఉపకరించును. దుర్భరమగు సంఘటనము కలిగినప్పుడుకాని, అసాధ్యమగు విషయమును ఆకాంక్షించి అఱ్ఱులు సాచునప్పుడుకాని, మానవాతీత శక్తులుగల, దేవతలో, మంత్రదండమో, భూత అద్దమో, బీజాక్షరములో, పావుకోళ్ళో అడ్డుపడి చిక్కును మంచుతెరవలె తొలగించిన నెంతబాగుండు నను కోరిక అసాధ్యమైనను మానవసహజమే. ఇట్టి కోరికను ఆధారముగా చేసికొని ప్రాకృతులు అత్యద్భుత విషయములను అనేక కథలందు జోడించినట్లు కాననగును.. అద్భుతకథలం దన్నింటికన్న అధిక ప్రచారముగాంచినది బాలనాగమ్మ కథ. దీని కథారంగము మహబూబు నగరమందలి పానుగల్లు. ఇది ప్రాంతీయమగు రామాయణగాథ వంటిది. నమ్మరానంతటి ఆద్భుత కృత్యములతో, అలౌకిక విషయములతో, నిండిన గాథ - కమ్మవారి పణతి పనల బాలరాజుకథ - ఈ కథా జీవము వర్ణాంతర వివాహము. అద్భుత కథా గేయములందు గాంధారికథ అగ్రగణ్యము, పురాతనముగూడ. ఇటులే ధర్మాంగద పాముపాట, కాంభోజరాజుకథ, బాలరాజుకథవంటి అద్భుతకథలు జానపదులకు 'భయ