Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము


సాధింపులు, ఆడబిడ్డల ఘాతుక చర్యలు, మున్నగువాటిని ఆశ్రయించిన గేయములును కలవు. ఇట్టి స్త్రీల పాటలందు సాంఘిక జీవనము సమగ్రముగా కాననగును.

శ్రమిక గేయములు  : కవిత్వము ఉల్లాసమును కలిగించుట కేకాక కష్ట నివారణమునకు గూడ నుదయించుననుట పలువురు సాహిత్య తత్త్వజ్ఞులు అంకగీరించిన విషయము. మానవులు శ్రమించునప్పుడు కష్టము కనబడ కుండుటకై, అలసిపోకుండుటకై, అప్రయత్నముగా కూనరాగములు తీయుట లయాన్వితములగు నేవోమాట లుచ్చరించుట జరుగును. సామూహిక కర్తృత్వమున అట్టి రాగములు మాటలు జానపద గేయములుగా పరిణమించి వ్యాప్తి గాంచును. వివిధములగు పనులు చేయు వారు అయీ సందర్భములందు శ్రమాపనోదనమునకై పాటలు పాడుచుండుట కాంచనగును. కొందరిట్టి గీతములను 'పాట కజన' సారస్వత మనిరి. కొందరు కార్మిక కర్షక గీతము లనిరి. ఇట్టి శ్రమిక గీతములందు వస్తు వెద్దియైన నుండవచ్చును. వృత్తికి సంబంధించిన పాటలు, శృంగార గేయములు, స్థానిక వృత్తాంతములు, విషాద గాథలు, భక్తి గేయములు, మున్నగు తీరుతీరుల పాటలు శ్రమికులు పాడుకొందురు. శ్రమిక గేయము లన్నియు సాధారణ ముగా వారివారి కృషికి సంబంధించిన లయకు సరిపోవున ట్లుండుట గమంనింపదగిన విషయము. శ్రమికుల పాట లందు "లిబిడో" స్ఫుటముగా ధ్వనించుచుండుట మరియొక విశేషము. శరీర సుఖమునకు సంబంధించిన ఊహలు శ్రమికులకు ఉత్సాహమొసగును. కనుకనే విషయ వాంఛ ఇట్టి పాటలందు తరచుగా కాననగును. గారడి వానిపాటలందు ఆకర్షించుటకువలెనే బరువులు లాగెడు పాటలందు శ్రమాపనోదవమునకై బూతులు ప్రవేశించును. శ్రమికుల పాటలందు ఇట్టి బూతుపాట లెన్నియో కలవు. ఇట్టిపాటలు "ఘుమఘుమాపాట" ల పేరుతో కొన్ని ప్రచురింపబడినవి.

బాలగేయములు  : జానపద గేయ వాఙ్మయమునందు బాల గేయములు ఒక ప్రత్యేక శాఖకు చెందినవి. ఇవి రెండు విధములు. బాలుర కొరకై పెద్దలచే రచింపబడి తరతరములనుండి వచ్చునవి ఒక విధము. బాలుర చేతనే రచించబడి ఒక తరమునుండి మరియొక తరమువారి నోటి కండనవి మరియొక విధము. పెద్దలు పిల్లల కొరకు రచించిన పాటలందుకూడ రెండువిధము లున్నవి. పిల్లలను లాలించుటకును నిద్రపుచ్చుటకును పాడెడు లాలి పాటలును జోల పాటలును ఒకతీరువి. పిల్లలనే వస్తువుగా గ్రహించియో లేక ఏవేని కథావిషయములనో, ప్రపంచమందలి మనోహరవియములనో గ్రహించి పిల్లల కానందమును గూర్చుటకై, ఆటలాడించుటకై, రచింపబడినవి ఇంకొక తీరువి. లాలిజోలపాటల భావములను పిల్లలెంతమాత్రము అనుభవింపరు. కేవలము అందలి సంగీతము మాత్రము వారిని నిద్రపుచ్చుటకో, ఊరడించుటకో ఉపకరించును.ఇక రెండవతీరు పెద్దల పాటలు పిల్లలు కూర్చుండుటకు అలవాటు పడినప్పటినుండి నిచ్చెనమెట్లవలె క్రమక్రమముగా పెరిగి పిల్లలు తాము తలిదండ్రులవలననో లేక ఇతరులగు పెద్దల వలననో విన్న పాటలు స్వయముగా పాడునంత వరకు సాగి ఆగిపోవును. ఆ పైన వారి సొంతకవిత్వ మారంభమగును. పెద్దల పాటలందు మొదట నాదము, తరువాత లయ, ఆతరువాత అభినయము పిల్లలకు అలవడు నట్లుచేయు క్రమము కనుపించును. మొదటిది ఆకర్షణమును, రెండవది ఉత్సాహమును, మూడవది వారి శరీరమునకు శక్తిని కూర్చును. నాలుగైదేండ్ల వయసువచ్చునప్పటికి పిల్లలు సొంత కవిత్వ మారంఖింతురు. ఈ గేయము లందును రెండుతీరుల పాటలున్నవి. పెద్దలను అనుకరించి వారిపాటలందు తమ కవిత్వమును చేర్చి పాడుకొనునవి కొన్ని. పూర్తిగా స్వకపోలకల్పితములు మరికొన్ని. మొదటిరకము పాటలు రానురాను అర్ధవిహీనములై పోవును. కనుకనే వీటిని Non-sense Rhymes అనుచున్నారు. పిల్లలకొరకు పెద్దలు రచించినవి Nursery Rhymes అయినచో, పిల్లలు సొంతముగా రచించిన గేయములు Non-sense Rhymes అగుచున్నవి. నాలుగేండ్ల ప్రాయమునుండి పిల్లలజీవితమంతయు ఆటపాటల మయమగును. ఈ యాటలందును, మగపిల్లల ఆటలు వేరు ఆడపిల్లల ఆటలు వేరు. కొన్ని ఇరువురును చేరి ఆడుకొను నట్టివి. ఈ క్రీడలను ఆధారముగా చేసికొని వాటికి తగిన పాటలు పెక్కులు బయలు దేరినవి. చెమ్మచెక్క, బిత్తి దిరుగుట, గుడుగుడుగుంచం, బుజబుజ రేకులు, గొబ్బిళ్ళు,