Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము


క్యము ప్రతిపాదితమగుటచే సంఘవ్యవస్థ యందున్న ఎక్కువతక్కువలు వేదాంత విచారమున నుండవు. కనుక అధికారులు బోధనమునకై, అనధికారులు సంతుష్టికై ఇట్టి పాటలు పాడుట యాచారమైనది. అగ్రవర్ణములవారి వర్ణాశ్రమాచార విధులు పూజా పురస్కారములు ప్రవచనములు మున్నగునవి కొన్నితత్త్వము లందు గర్హింపబడుట కాననగును. తత్త్వములందు కొంత మర్మకవిత్వముకూడ కలదు. ఏగంటివారు, పోతులూరి వీరబ్రహ్మము, వేమనయోగి, సిద్దప్ప, శేషాచలస్వామి,పరశురామపంతుల లింగమూర్తి, భోజదాసు, ఎడ్ల రామదాసు మున్నగు. అనుభవజ్ఞులైన యోగులెందరో తత్త్వములను, వేదాంత గేయములను వ్రాసియున్నారు. సీతపాట, నారాయణ శతకము, రామరామ శతకము, ఆత్మబోధామృత తత్త్వములు, కవిప్రమాణ తత్త్వ కీర్తనలు, కాలజ్ఞాన తత్త్వములు, శుద్ధనిర్గుణ తత్త్వ కందార్థ దరువులు, తారకామృతసారము, శ్రీరామగీత, గురుజ్ఞానామృతము, వేదాంత కుచ్చెలకథ, బ్రహ్మానంద కీర్తనలు ఇత్యాది ముద్రిత గ్రంథములందలి గేయములు జానపదుల నోటి కెక్కినవి. సాధారణముగా ఈ తత్త్వము లందు రాజయోగము, అచలవేదాంతము, గురుభక్తి, నీతిబోధము, సంఘసంస్కార పరాయణత్వము, వర్ణాశ్రమాచార నిరాసము, వైరాగ్య బోధనము, అహింస, సత్ప్రవర్తనము మున్నగు విషయము లుండును.

పురాణోక్తముగా నున్న కర్మకాండయు, వ్రతములు నోములు మున్నగునవి అందరి అందుబాటులో నుండుటచే అట్టి వాఙ్మయముకూడ బాగుగా ప్రచారమందినది. ఇట్టి కర్మకాండ స్త్రీలకు మిక్కిలి అభిమానపాత్ర మగుటచే స్త్రీలపాటల రూపముననే ఇట్టి వాఙ్మయము అధికముగా గలదు. నన్నయనాటినుండి మనకీ నోములు వ్రతములు ఉన్నటులు కాననగును. ఇవి స్త్రీలకును చాతుర్వర్ణ్యముల వారికిని పూజాధికారము కల్పించుటకు ఉద్దేశింపబడినవి. వీరశైవ వీరవైష్ణవ మతోజ్జృంభణ ఫలితముగా ఇట్టి సంస్కారమునకు తావులభించినదని ఊహింపనగును. మదన ద్వాదశీవ్రతము, నిత్యదానము నోము, దీపదానము నోము, మోచేటి పద్మమునోము, చాతుర్మాస్యవ్రతము, కృత్తికదీపాలనోము, పెండ్లి గుమ్మడి నోము, వరలక్ష్మీ పాట, తులసినోము, లక్షవత్తులనోము, కామేశ్వరీవ్రతము, శ్రావణ శుక్రవారపునోము, శ్రావణ మంగళవారవ్రతము మున్నగువాటికి సంబంధించిన పాటలు అధిక ప్రచార మందినవి. వీటిలో కామేశ్వరిపాట క్రీడాభిరామ కాలము నుండి వినబడుచున్నది. అగ్రవర్ణముల వారికి లక్ష్మీ గౌరీ వ్రతములు పూజలు ఉన్నటులే శూద్రులకు ఎల్లమ్మ. మైసమ్మ, పోచమ్మ, బాలమ్మ, మున్నగు క్షుద్ర దేవతల పూజలు కలవు. ఈ దేవతల కొలుపులు పల్లెటూళ్ళయందు బవనీలు మున్నగువారు చేయుదురు. ఎల్లమ్మయే రేణుకా దేవి. క్రీడాభిరామమున బవనీల చక్రవర్తి "పరశురాముని కథలెల్ల ప్రౌఢి బాడి" నట్లున్నది.

స్త్రీల పాటలు  : సంసారయాత్రలో గృహలక్ష్మికే అధిక ప్రాధాన్యము కలదు. అటులే గృహజీవనమున కవిత్వము నకును స్త్రీలే అధికముగా ఆలంబనములు. ఇట్టి పాటలను స్త్రీలపాటలని పిలువవచ్చును. వీటిలో కల్పనకన్న వాస్త వికత హెచ్చు. మాతృత్వము నాధారముగ చేసికొని ఎన్నియో గేయములు పుట్టినవి. సంతానమునకై స్త్రీలు పడెడు బాధలు, నోచెడు నోములు, మ్రొక్కెడి మ్రొక్కులు, గొడ్రాండ్ర స్థితి, అట్టి పాటలందు వర్ణితములు, సంతానము కలిగినవెంటనే లాలిపాటలు, జోల పాటలు వచ్చును. ఈ పాటలందు తల్లులు తమ సంతానమును రాముడుగనో, కృష్ణుడుగనో, శంకరుడుగనో, సీతగానో, రుక్మిణిగానో, పార్వతిగనో వర్ణించుకొందురు. వివాహము నాధారముగా చేసికొని వెలసిన పెండ్లి పాటలు అనంతములు, కొట్నాల పాటలు, నలుగు పాటలు, గంధము పాటలు, కల్యాణపు పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతుల పాటలు, బువ్వము పాటలు, వధూవరుల పాటలు, అలక పాటలు, ముఖముకడుగు పాటలు, కట్నాలపాటలు, మిథునవిడెముల పాటలు, అవి రేణి పాటలు, అప్పగింతల పాటలేకాక ప్రతి స్వల్ప విషయమునకు, అనగా పసుపునకు, తిలకమునకు తలంటులకు, ఊయలకు వసంతములకు పానుపులకు సంబం ధించిన పాటలుకూడ కలవు. అత్తమామల భక్తిని, పతి భక్తిని, ఆడుబిడ్డల భ క్తని, తోడి కోడండ్రతో, బావ మరదులతో, ఇరుగుపొరుగు వారలతో మెలగవలసిన రీతిని దెలుపు పాటలు కొన్ని కలవు. అత్తల ఆరండ్లు, కోడండ్ర