Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము


భక్తులను గలిగించి సత్యధర్మములకే జయము అను నీతిని చాటి చెప్పి, వారి జీవితమును దిద్దునట్టివి.

కరుణ రసాత్మకములు : జానపదులు శృంగారము తరువాత కరుణాద్భుతములకు రెండింటికిని సమప్రాధాన్య మిచ్చిరి. నిత్యజీవితమున దుఃఖము అధికమగుటచే తత్ప్రభావమును సహజముగా జానపదులు చిత్రింపగలిగిరి. దీనియందును వారికి శిష్టులకుండు ఆదర్శ దృక్పథము, లేదా, యౌచితీ విచారము తక్కువ. ఆయావ్యక్తుల శౌర్యమునకు ఉత్సాహము, దుర్మరణమునకు జాలి అను నీ రెండు భావములును పామరులచే వారి చరిత్రములను పాడించినవి. ఉత్సాహము తరువాత జానపదులను సులువుగా ఆవరించినది జాలి. ఆంధ్ర జానపద వాఙ్మయమున కరుణ పూరితములును చిత్తధ్రుతి కారణములునునగు కథ అనేకములు కలవు. అత్త పెట్టిన ఆరడివలననో, కట్టుకొన్న భర్త యొనర్చిన అత్యాచారమువలననో, తోడికోడండ్ర అసూయచేతనో, ఇరుగుపొరుగువారి దౌష్ట్యము వలననో, దైవ దుర్విపాకమువలననో ఇడుములపాలైన స్త్రీలకథలు జానపద గేయ వాఙ్మయ సముద్రమందలి కన్నీటి కెరటములు. జరిగిన విషాద గాథలకు జానపదులు కొంత మాహాత్మ్యమునుకూడ జతపరచినారు. దేశీయేతి వృత్తములందు కరుణా రసపూరితమైన గాథ కన్యకామ్మ వారికధ. ఇది ప్రాచీన మైనది. కామమ్మ కథ పిచ్చుక కుంట్లకు కల్పవృక్షము. జరిగినకథ జరిగినట్లుగా, హృదయవిదారకముగా, కరుణ రసపూరితముగానున్న కథలందు లక్ష్మమ్మకథ అగ్రగణ్యము. ఆమె సహనము, త్యాగము, తెలుగుజాతికి గర్వకారణములు, అవిభక్త కుటుంబమున కనిష్ఠులు పడెడుబాధల సూచించునది సన్యాసమ్మకథ. గోదావరీ మండలపు పేరంటాలైన మండపేట పాపమ్మకథ మరియొకటి. కరుణరసాత్మకగాధలందు పేరంటాండ్రగాథల కొక ప్రత్యేకత కలదు, కామమ్మకథ, పాపమ్మకథ, శృంగవరపుకోట 'యెరుకమ్మకథ, సన్యాసమ్మ కథ. తిరుపతమ్మకథవంటి పేరంటాండ్రకథలు ముద్రితములైనవి. సతి ఆచారము నిషేధింపబడిన తరువాత విశేష ప్రయత్న ముతో సహగమనము చేసినట్టి వారు వీరందరును. ఇది యొక విశేషము. పేరంటాండ్రందరు మ్రొక్కులుతీర్తు రనునది ఈ కథలందలి మరియొక విశేషము. తమిళదేశమునుండి వలసవచ్చినట్టిది నల్లతంగాళ్ కధ. వీరరాజమ్మకథ పలనాటి సీమకు చెందినట్టిది. ఎరుకల నాంచారి, రాములమ్మ, సరోజిని, మూసిపొంగు కథలు తెలంగాణమున ప్రశస్తి నార్జించినవి.

హాస్యపు పాటలు  : నాగరకులకు గల సుఖ దుఃఖాను భూతులు జానపదులకును గలవు. వీటి బాహ్యచిహ్నము లగు నవ్వు, ఏడ్పులునుగూడ కలవు. అట్టి నవ్వు జానపద గేయవాఙ్మయమున అచ్చటచ్చట చక్కగా ప్రదర్శింప బడినది. శాంతగోవింద నామములందు ఋష్యశృంగుడు, అడవిగోవింద నామములందు కుంభకర్ణుడు, సూక్మ రామాయణమున శూర్పణఖవంటివారు చక్కని హాస్యమునకు ఆలంబనములుగా కనిపింతురు. సీత గడియ పాటలో హాస్య శృంగారములకు మైత్రి కలదు, సీతమ్మ పరిహాసోక్తులు "వ్యాహారము" నకు ఉదాహరణముగా చెప్పుకొనవచ్చును. ఊర్మిళా దేవి నిద్రలో సీతాశాంతల సరస సంభాషణము, శ్రీరామ పట్టాభిషేకమున శంకరుని మాటలు ఉత్తమకోటికి చెందిన హాస్యముతో నిండియున్నవి. శశిరేఖా పరిణయమున ఘటనా వికృతికిచెందిన హాస్యము కలదు. పల్నాటి వీరచరిత్రమున వెశ్యమాత వర్ణనము ఆకార వికృతికి సంబంధించిన హాస్యము. వీర గేయములందలి యుద్ధభీరువుల వర్ణనమున వాక్చేష్టలకు సంబంధించిన హాస్యము గలదు. కాటమరాజు కథలో భట్ల సంవాదమునందు వ్యాజస్తుతి 'వ్యాజనింద, వక్రోక్తి' నర్మోక్తి, నీచోపమ, కాక్వాక్షి ప్తము మున్నగు నలంకారములతో అర్థ సంబంధమగు వికృతిలో వాచ్యముగను వ్యంగ్యముగను హాస్యము భాసించును. గంగా గౌరీ సంవాదము, ఈశ్వరభృంగీ సంవాదము, లక్ష్మీ పార్వతుల సంవాదము, సవతుల కయ్యము, చెంచులక్ష్మికి కృష్ణునకు జరిగిన సంవాదము. చెంచెతకు లక్ష్మికి జరిగిన సంవాదము మున్నగు వాటియందు నర్మోక్తులు, దెప్పి పొడుపులు, వ్యాజోక్తులు కలిగిన హాస్య మున్నది. లక్ష్మీ పార్వతుల సంవాదము 'మృదవము'నకును, సవతుల కయ్యము "నాళిక”కును, ఈశ్వరభృంగి సంవాదము “అవస్పందితము”నకును ఉదాహరణములు. కేవలము హాస్య పూరితము లగు గేయములు కొలదిగనే ముద్రింపబడినవి. వేడుక పెండ్లిపాట లందును, స్త్రీ జనానంద 442