Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లభాషాసాహిత్యములు


మహావ్యాధులలో నొకటియనియు, ప్రేమ యనునది పరమ పవిత్రమయిన వస్తువనియు, అది జీవితము ఉద్దరింపగల మహాశక్తియనియు ఇతడు బోధించెను. పక్షి పాడినట్లు అప్రయత్నముగా అనర్గళ ధారతో పాడగల సహజ కవిత్వ మితనిది. ఇతడు గ్రీకుపద్ధతి ననుసరించి 'Prometheus Unbound' అను మహానాటకమును రచించెను. కీట్సు మరణించెనని వినగానే ఇతడు Adonais అను నొక కావ్యమును The Cloud, Ode to the sky lark, Ode to the west wind మున్నగు అమూల్యములైన చిన్న కావ్యములనుగూడ రచించెను. కీట్సు అసామాన్య ప్రతిభాశాలి. సౌందర్యోపాసకుడు. అతడు అకాల మృత్యువు వాతను బడుట శోచనీయము. పంచకావ్యములు అనదగు ఆతని Odes ఆంగ్ల సాహిత్య చరిత్రయందు అపూర్వ శోభతో వెలుగొందుచున్నవి.

చారిత్రక నవలాకారుడయిన స్కాట్ అనునాతడును, అనన్యసామాన్య వ్యాసరచయితయగు లాంబు (Lamb)ను, సాంఘిక సాంసారిక విషయములను చిత్రించు నవలలను రచించిన జేన్ ఆన్లైన్, సొగసైన శైలిలో 'The Confessions of an English Opium Eater, అను ప్రసిద్ధ గ్రంథమును రచించిన 'డిక్వెన్ సి'యు గద్య రచనయందు పేర్కొనదగిన ప్రముఖులు, కార్లైల్ మహర్షి మరియొక అద్వితీయ రచయిత. ఇతడు వ్రాసిన ప్రముఖ గ్రంథము Sartor Resartus అనునది. ఇతని చారిత్రక శైలి అనన్య సామాన్యము. ఇతడు అనేక నూతన పదములను సృష్టించిన భాషానియంత. సజీవమైన చారిత్రక శైలితో నొప్పి విమర్శ కాగ్రణియైన మెకాలే (Macaulay) మహాశయుడు, సర్వతోముఖ సంస్కర్తయైన శ్రీ రాజా రామ మోహన రాయలు, మన దేశమునందు ఆంగ్లేయ విద్యావిధానమును ప్రవేశ పెట్టుటకు కారకులైనవారు.

19 వ శతాబ్దపు టు త్తరభాగమున పేర్కొనదగిన ఆరుగురు గొప్పకవులుకలరు. వీరిలో అమెరికా కవులలో అగ్రగణ్యుడైన లాంగ్ ఫెలో అనునతడు హయవాతా, ఇవాంజ్ లైన్ అను కావ్యములను రచించెను. ఆంగ్లేయ ఆస్థానకవియైన టెన్నిసను వాస్తముగా ఒక మహాకవి. అతని ఉద్గ్రంథములలో ప్రధానమైనవి 'In Memorium' అను స్మృతి కావ్యమును, 'Idylls of the king' అను కావ్యమునై యున్నవి. ఆతని కవిత్వమునందు గొప్ప శిల్పచాతుర్యము కాననగును. 'మిసెస్ బ్రౌనింగ్ ' అను నా ఆంగ్లేయ కవయిత్రులలో అగ్రస్థాన మధిగ మించెను. ‘Auroraleign' అను పెద్ద కావ్యము, The cry of the children అను చిన్న కావ్యము, Sonnets ఆమె కృతులలో సుప్రసిద్ధములు. ఆమె భర్త అయిన రాబర్టు బ్రౌనింగు టెనిసనుతోపాటు ఈ శతాబ్దమునందు కవితా సదనమున అగ్రస్థానము నలంకరించెను. ఇతడు అసామాన్య మేధా వంతుడు. సంక్షిప్తమై భావగర్భితమైన శైలి కలవాడు. The Ring and the Book' అను అపరాధ పరిశోధక కావ్యము ఆతని యుద్గ్రంథము. అందు పండ్రెండు పర్వములుకలవు. రక్బీ షాపెల్ Rugby Chapel, సోహరాబ్ అండ్ రుస్తుమ్ అను కావ్యములను రచించిన మాచ్యూఆర్నాల్డును, The Earthly Paradise ను రచించిన విలియం మారిస్సు అనునతడును ఈయుగము నందలి ప్రముఖ కవులలో పేర్కొనదగిన వారు.

గద్య రచనయందు మహామహులగువారు గూడ ఈ యుగమునందు ఉద్భవించిరి. Vanity Fair, The New Comes, Henry Edmond అను గొప్పనవలలు రచించిన థాకరీ కవియు, The Pickwick Papers, David Copperfield మొదలగు గ్రంథములను రచించిన డికెన్సు, Adam Bede, The Mill on the Floss అను నవలలను రచించి జార్జి ఇలియట్ (George Eliot) అను పురుషనామ ధారిణియైన మేరియన్ ఇవాన్సు (Marian Evans), The Ordeal of Richard Feveril, Evan Harrington అను వాటిని రచించిన మెరెడిత్తు, అత్యద్భుత నవలారాజమగు Tess ను రచించిన థామస్ హార్డీ వీరు ఈ గద్యకాలము నాటి ప్రధాన నవలాకారులు. మరియు అధిక సుందరమైన శైలిని నిర్మించిన వాల్టర్ పీటరు, సౌందర్య తత్త్వమును పరిశోధించి దాని లక్షణమును 'The seven lamps of Architecture', 'The Stones of Venice', అను గ్రంథములలో నిరూపించిన రస్కిను, On Liberty అను వ్యాసరాజమును వ్రాసిన 'జాన్ స్టూవర్టు మిల్లు', అను వారిని పేర్కొనుటతో, ఈ శతాబ్ది సింహావలోకనము ముగింపవచ్చును. -