ఆంగ్లభాషాసాహిత్యములు
18 వ శతాబ్దియొక్క ఉత్తరార్ధమునందలి ప్రధాన గద్యరచయితలు గోల్డుస్మిత్తు, జాన్సను, బర్కు, గిబ్బను, కౌపరు, బర్ న్సు, బ్లేకు, క్రాబు అను వారు. నీతివిషయకమైన అనేక సూత్రములను ప్రవచించి లలితమైన అమృత శైలి ప్రదర్శించినవాడు గోల్డుస్మిత్తు. ఇతడు The Deserted Village అను పద్యకావ్యమును, She Stoops to Conquer అను నాటకమును హాస్యరస భరితముగా రచించెను ఇతని 'ది వికార్ ఆఫ్ షేక్ ఫీల్డు' అను కావ్యము ఆంగ్లభాషయందలి ప్రధాన నవలగా శాశ్వత కీర్తిని కాంచెను. బహు విషయక విజ్ఞానభరితమై సమయ స్ఫూర్తిగల సంభాషణయం దారి తేరి, అమరకోశమును బోలిన మహానిఘంటువునకు నిర్మాతయై, సాహిత్య సమ్రాట్టు అనిపించుకొన్న ప్రతిభాశాలి జాన్సను, మహా రాజ్యాంగ వేత్తయు, మహామేధావియు నగు బర్కు, సాహిత్య సౌరభోపేతములైన మహోపన్యాసముల మూలమున 'ది ఫ్రెంచ్ రెవల్యూషన్' దిఅమెరికన్ రివల్యూషన్' అను రెండు రాజకీయ విప్లవముల విషయమున ఆంగ్లేయు లవలంబించిన విధానమును విమర్శించెను. ఆ యుపన్యాసములు రాజకీయవేత్తలచే ఈనాటికిని వేద గ్రంథములుగా పరిగణింప బడుచున్నవి. The Decline and Fall of the Roman Empire అను చారిత్రక గ్రంథరాజమును గంభీరమైన శైలితో రచించిన 'గిబ్బను' మహాశయుడు సుప్రసిద్ధుడు. The Task అను కావ్యమును రచించిన మధురకవి కౌపరు, బీదసాదల జీవితమును చక్కగా చిత్రించిన క్రాబు, రసభరితములైన గీతములను స్కాట్లండు ప్రాంతీయ భాషయందు రచించి సుప్రసిద్ధుడయిన ‘బరస్సు', అమాయిక శిశుస్వభావముతో కూడిన భక్తి గీతములను రచించిన బ్లేకు మున్నగువారి కవితలందు రాగల నూతన సాహిత్య విప్లవ చిహ్నములు స్పష్టముగా కనుపించుచుండును.
19 వ శతాబ్దము ఆరంభము కాకమునుపే దాని లక్షణములు తత్పూర్వార్ధ శతాబ్దమునందే కన్పడెను. 1789వ సంవత్సరమున ఫ్రాన్సు దేశమందు ఏర్పడిన మహావిప్లవముచే యూరపు రాజ్యములయందలి సమస్త జీవిత వ్యాపారములయందును నూతన శకము ఆరంభించెను. అపూర్వశక్తులు ప్రజా సామాన్యమునందు కన్పట్ట సాగెను. మేధావంతులును, ఉదార స్వభావులును అగుమహాపురుషు లెందరో దేశ దేశములందు బయలుదేరిరి. ఎలిజబెత్తురాణి యుగమునాడు కన్పించిన ధీశక్తి, మనోవేగము, హృదయావేశము తిరిగి చూపట్ట నారంభించెను. నూతనోత్సాహముతో కూడిన భావకవు లెందరో బయలు దేరిరి. వర్డ్స్ వర్తు, కోల్రిడ్జి అను ఇద్దరు కవులును కలిసి 'Lyrical Ballads' అను పద్యకావ్య సంపుటము ప్రకటించిరి. అది కావ్యప్రపంచమున నూతన శక ప్రారంభమునకు శంఖారావమువంటి దయ్యెను. సామాన్య వస్తువులను, జీవితమును ఆవరించు సౌందర్యము శోభను, వెల్లడిచేయుట వర్డ్స్ వర్తు కవివర్యుని ఆశయము. అసామాన్య వస్తువులను, విషయములను వర్ణించునపుడు వాటిని విశ్వసనీయముగా చిత్రించుట కోల్రిడ్జి కవి ఆశయము. ఈ కావ్యసంపుటి యొక్క ఉద్దేశమును వర్డ్సువర్తే ఇట్లు నిరూపించెను. "దుఃఖాక్రాంతులైన వారిని ఉపశమింపజేయుట, సంతోషాంతరంగులను మరింత సంతోష పరచుట, ఆలోచనాశీలురై ధర్మకాంక్షను అభివృద్ధి చేసికొనునట్లు యువకులను పురిగొల్పుట." సాంఘిక సమస్యలనుగూర్చి ఆలోచించుట, ప్రకృతివైపునకు దృష్టిని మరల్చి, మానవ హృదయము యొక్క ఆంతరంగికము లయిన అనుభవములను గూర్చి తెల్పుట అనునవి కావ్యాదర్శములు. తన కావ్యములు భయోత్పాదకములయిన విషయములను చిత్రించుట కొరకుకాక ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించుట కొరకే ఉపయోగించునని ఆతడు నిర్భయముగా చెప్పెను, "The Excursion; The Prelude, అను బృహద్గ్రంథములును, The immortality Ode, The Ode to Deity అను చిన్న కావ్యములును, మరికొన్ని సానెట్సును అతని రచనలలో శ్రేష్ఠములైనవి. కోల్రిడ్జి మహాకవి Biographia Literaria అను విమర్శనాత్మక గ్రంథమును, The Ancient Mariner, Christabel, Kublakhan అను ఉన్నతశ్రేణికి చెందిన కావ్యములను రచించెను. స్వాతంత్య్ర ప్రియుడయిన బైరను, చారిత్రక నవలలు అనేకములు వ్రాసి భూతకాలమును, వర్తమానమునందు పునస్సృష్టి కావించిన స్కాటు మహాశయుడు ఈ యుగమునందలివారే. షెల్లీ ఒక అద్వితీయ మహాకవి: నిరంకుశపరిపాలనము మానవులను పీడించు