Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లభాషాసాహిత్యములు


17 వ శతాబ్ది పూర్వార్ధమునందు ప్రధానమైన గద్య రచయితలు రాలే, బేకను అనువారలు. రాలే మహా తేజశ్శాలి. ఎలిజబెత్తు కాలమునాటి సర్వతోముఖ వికాసమును స్వాయత్త మొనర్చుకొనిన ప్రతిభాశాలి ఇతడు. బేకను అధిక మేధావంతుడు. భావగర్భితములై సూత్రప్రాయములైన వాక్యములుగల గద్యశైలిని వ్రాయుదిట్ట. ఆతడు రచించిన 'Advancement of Learning' అను గ్రంథమును, ' వ్యాసావళి'యు ఉద్గ్రంథములు. ఈ శశాబ్దపు టుత్తరార్ధమునం దుండిన పద్య గద్య రచయిత లందరిలోను మహోన్నత పర్వత శిఖరమువలె కన్పట్టు వాడు 'మిల్టను' మహాకవి. ఆతడు రచించిన Paradise Lost, Paradise Regained, Samson Agonistes అను మూడు గ్రంథములు ఆంగ్లభాష యున్నంత కాలమును మనగల గ్రంథరాజములు. అతడు ఆంగ్ల పద్య కావ్య ప్రపంచమునందు అత్యంత గంభీరమైన శైలియు, ప్రమాణమైన ఛందస్సును కల్గిన మహాకవి. హాస్యరస ప్రధానమైన హ్యూడి బ్రాసు అను కావ్యమును రచించినవాడు బట్లరు, అధిక్షేప వాఙ్మయమును వ్రాయుటయందు అగ్రస్థానము నాక్రమించి, గద్య పద్య కావ్యములందు అసమానమైన ప్రతిభను ప్రదర్శించినవాడు డ్రైడేను. ఆంగ్ల గద్య రచనయందు ఇతడొక నవశకమును ప్రారంభించెను. ‘Heroic Couplet' అను ఒక క్రొత్త ఛందస్సునకు ప్రఖ్యాత స్థానమును సంక్రమింపజేసినవా డిప్రోడ, గద్య రచనయందు అప్రతిమానమైన ప్రతిభగలవాడు Jeremy Taylor, Essay on Human Understanding మహా వ్యాసమును రచించిన తత్త్వవేత్త 'లాకు' ఈ యిరువురుగూడ ప్రముఖ రచయితలలోనివారే. ఈ యుగమునందలి అసమాన ప్రతిభావంతులలో ముఖ్యమైనవాడు 'జాన్ బనియను'. ఇతడు సామాన్య సంసారి. బీదవాడు. బైబిలు గ్రంథమును జీర్ణించుకొనుటచే పాండిత్యమును పొందినవాడు. కారాగారమునందున్న కాలమున 'ది పిల్ గ్రింప్ ప్రోగ్రెస్' అను అద్భుత ద్వ్యర్థికావ్యమును రచియించి ఆ మహా గ్రంథమునందు, సుఖదుఃఖములతో కూడిన మానవ జీవితయాత్రను అత్యంత సౌందర్యవంతముగను, భావగర్భితముగను చిత్రించినాడీ కవివర్యుడు.

18 వ శతాబ్ది పూర్వభాగము గద్యరచనా ప్రధానమయిన యుగము. ' రాబిన్ సన్ క్రూసో' అను సుప్రసిద్ధ బాలసాహిత్య గ్రంథముతోపాటు అనేక ప్రౌఢ గ్రంథముల రచించిన డీఫో, నేటి వార్తాపత్రికలకు పితామహుడు. కాని యీ యుగము నందలి ప్రధాన గద్యరచయిత 'స్విఫ్ట్లు'. మత వైషమ్యములను గూర్చిన ప్రహసనమగు ‘A Tale of a Tub' ను, మానవ ప్రకృతిని దెలుపు గల్లి వర్స్ ట్రావెల్స్ రచించి, గద్యరచనయందు అసమాను డనిపించుకొనిన వాడీ కవి, సులభమై, సుందరమై, హాయిని గూర్చునది అయిన గద్యరచనయందు ఆరితేరినవాడు 'ఎడిసను', ఆతని 'స్పెక్టేటరు' (Spectator) వ్యాసములు, అందు అతడు సృష్టించిన 'సర్ రోజర్ డీకావర్లీ 'అను పాత్ర చిర కాలముండునది అనుటలో అతిశయోక్తి లేదు. కావ్య ప్రపంచములో ఈ యుగమున పేరెన్నిక గన్న కవి పోపు. ఈతని కవితా శిల్ప చాతుర్యము ప్రశంస్యము. సుప్రసిద్ధ గ్రీకు మహాకవియైన హోమరు వ్రాసిన ఇలియడ్ అను మహాకావ్యమును ఆంగ్ల పద్య కావ్యముగా అనువదించినవాడును, క్షుద్ర రచయిత లయిన సమకాలికులను ‘డన్సియడ్' (Dunciad) అను ప్రహసనము నందు తీవ్రముగా హేళన పూర్వకముగా విమర్శించిన వాడును ఇక్కవి చంద్రుడు. గంగాప్రవాహమువలె ప్రవహించు శైలి, స్థాలిత్య రహితమయిన ఛందస్సు ఈతని రచనా విశేషములు. సూత్రప్రాయముగ నుండి విశ్వజనీనము లయిన వ్యావహారిక సత్యములను నిరూపించు వాక్యములను అత్యంత శిల్పచాతుర్యముతో నిర్మించిన మహా శిల్పి ఈ కవి వరేణ్యుడు.

ఈ యుగమునందలి గద్యపద్య కావ్యము లన్నియు నాగరక ప్రపంచమునకును రాజకీయ వాతావరణమునకును సంబంధించినవే. వాటియందు ప్రకృతి పరిచయము ఎచ్చటను మందునకయిన కానరాదు. The Elegy in a Country Churchyard' అను అద్వితీయఖండ కావ్యమును రచించిన 'గ్రే' అనునతడు 'Ode to the Evening” ను రచించిన 'కాలిన్సు' - ఈ యిరువురు కవులును ఆంగ్ల కావ్య ప్రపంచమునందు ప్రకృతి రహస్యములకు భాష్యములు కల్పించినవారలు.