Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లభాషాసాహిత్యములు


వాఙ్మయమే ఎక్కువగా ఏర్పడినట్లు కానవచ్చుచున్నది.

14 వ. శతాబ్దమునందు సాగ్జను, నార్మను భాషలు రెండును మిళితముచేసి ఆంగ్లభాషగా రూపొందించిరి. 'సర్ జాక్ మాండెవల్' అనునతడు తన యాత్రలను గురించి యొక చరిత్రను రచించెను, ఇది ప్రథమవచన గ్రంధమై యున్నది. ధర్మసంస్కర్తయైన 'విక్లిపు' కొంత గద్యరచన సాగించెను.

నవయుగ సాహిత్యమునందు మొదటి గొప్పకవి 'ఛాసరు'. అతడు పండితుడుగా, సిపాయిగా, రాజ్యాంగ వేత్తగా, రాయబారిగా యూరపునందు అనేక ప్రాంతము లందు ముఖ్యముగా ఇటలీ దేశమునందు విశేష సంచారము సలిపి అధికమైన లోకజ్ఞానమును సంపాదించెను. అతడు వ్రాసిన 'కాంటర్బరీ కథలు' అనేక కారణములచే సుప్రసిద్ధ గ్రంథముగా పరిగణింపబడుచున్నది. అనాటి ఆంగ్లేయుల జీవితము, వారి ఆచారములు, అభిప్రాయములు, విశ్వాసములు, వారి వేషభాషలు అన్నియు అద్దమునందు వలె ఇందు మనకు స్పష్టముగా గోచరమగుచుండును. ఆంగ్లపద్య వాఙ్మయమునకు పదిమాత్రల పంక్తిని పునాదిగా వేసినది ఈతడే. 15 వ శతాబ్దపు చివరిభాగమున మొదటి అచ్చుయంత్రమును స్థాపించి 'కాక్సటన్' అచ్చువేసి ప్రకటించిన 64 గ్రంథములలో మాలరీ వ్రాసిన 'మార్ట్ డీ ఆర్థర్' అను గ్రంథమును, ఛాసర్ వ్రాసిన 'కాంటర్బరీ కథలును' కలవు. 16 వ శతాబ్దమునందు వైయట్, సట్టే అను నిద్దరు సుప్రసిద్ధకవులు అగ్రగాములైరి. వైయట్ అనునతడు ఫ్రెంచి, ఇటాలియన్ భాషల యందలి వాఙ్మయమును చదివి అందలి కవితాసంప్రదాయములను ఆంగ్లమునందు ప్రవేశ పెట్టెను. సణే అనునతడు ' బ్లాంక్ వర్స్' అనెడి, పంక్తికి పదిమాత్రలుగల సుప్రసిద్ధ ఛందస్సునకు సృష్టికర్త. రాజ్యాంగవే త్తఅయిన సర్ థామస్ మూరు 'యుటోపియా' అను గ్రంథమును రచించెను. 'విలియమ్ టిండేలు' అను నాతడు బైబిలును ఆంగ్లములోనికి అనువదించెను. The Poets' Poet అని ప్రఖ్యాతిగాంచిన ఎడ్మండ్ స్పెన్సరు 'ది ఫేరీక్విన్' అను కథారూపకమును రచించెను. ఛాసర్ రచించిన కాంటర్బరీ కథలకు గద్య ప్రపంచముననున్న ప్రముఖస్థానమే కావ్య ప్రపంచమున థేరీక్వీనునకు కలదు. ఇందలి శైలి శోభాయమానమై కడు శ్రావ్యమైనదిగా నున్నది. ఎలిజబెత్తు మహారాణి కాలమునందు ఆంగ్లేయులుపొందిన ప్రతిభా గౌరవ ములు ఈ గ్రంథమునందు ప్రతిబింబితములు. ఇది 20 సంవత్సరముల కృషిఫలితము. బెంజాన్సను, మార్లో యీ కాలపువారు. ‘Every man in his humour', 'Volpone' అను రెండు గొప్ప నాటకములను బెన్ జాన్సను రచించెను. Tamborlaine the Great, Dr. Jaustus, The Jew of Malta అను మూడు విషాదాంత నాటకములను 'మార్లో’ రచించెను. ఈతనికి భగవంతుడు చిరాయువు ప్రసాదించి యుండిన యెడల ఎంత గొప్ప నాటకములను వ్రాయగలిగి యుండెడివాడో ! 'The Laws of Ecclesiastical Polity' అను గ్రంథమును వ్రాసిన Hooker అను కవియు, Arcadia, Apology for Poetry అను రెండు మహా వ్యాసములు రచించిన Sir Philip Sydney యును ఈ యుగమునందలి గద్యరచయితలలో ప్రముఖులు. 'సిడ్నీ' యొక్క శైలి మిక్కిలి ప్రసిద్ధి కాంచెను.

ఈ యుగమునాటి విద్వత్కవులలో సర్వవిధముల శిరోభూషణమువలె ప్రకాశించువాడు 'షేక్స్పియరు' మహాకవి. ఆతని ప్రతిభ వర్ణనాతీతము, అగ్రాహ్యము. ఆమహాపురుషునకుగల ప్రకృతి పరిచయము, మానవ హృదయ పరిజ్ఞానము అసామాన్యములు. భాష మీద అతనికిగల అధికారమును, ప్రేమతత్త్వ సంబంధమైన ఆంతరంగిక దృష్టియు అపారములు.భావసంచలనములను గూర్చి ఆతడు గడించిన జ్ఞానము నిజముగా అద్వితీయము. స్త్రీ పురుషుల హృదయములు ఏయే పరిస్థితులయందు ఎట్టెట్టి పరిణామములు చెందుచుండునో - వానిని గ్రహించుటయందును, చిత్రించుట యందును, ఇతడు అపూర్వ ప్రతిభ గలవాడు. సుఖాంతములును, విషాదాంతములును, చారిత్రకములు నయిన రసవత్తర నాటకము లనేకములు అత్యంత సామర్థ్యముతో నవరసభరితముగా రచించిన ప్రతిభాశాలి ఇతడు. నాటికిని నేటికిని ఇంగ్లాండుకు ఉత్తమ పుత్రుడై, ఆంగ్లభాషకు వాఙ్మయమునకు తలమానికమై, ఆంగ్ల భాషావేత్తల హృదయములను బంధించు ఏకసూత్రమై, అక్షిణ ప్రతిభతో అలరారుచున్నవాడు షేక్స్పియరు మహాకవి.