Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అళియ రామరాయలు


పదవులంది విజయనగర సైనికబలమును, రక్షణను గురించిన విశేషములను గ్రహింపగలిగిరి. విజయనగర, బహమనీ రాజ్యములమధ్య యుద్ధము సంభవించిన క్లిష్టసమయములందు ఈ మహమ్మదీయులు విశ్వాసఘాతకులగుదురనియైన రామరాయలు ఊహింపకపోవుట అనర్థదాయక మయ్యెను. అదియునుగాక డక్కను సుల్తానుల అంతఃకలహములందు జోక్యముకలిగించుకొని రామరాయలు ఒకరిపైనొకరిని రెచ్చగొట్టి, అందరిని తానోడించుటయేగాక విజయనగరమునకు అగ్రస్థానమును సాధింపగల్గెను. ఈ విషయమున రామరాయలు చాలవరకు కృష్ణరాయల అడుగుజాడలలోనే నడచెను, కాని ఆవిధానమును చరమ స్థానమునకు కొనిపోయి, సుల్తానులకు విజయనగరము నందు అసూయాద్వేషములను వారిలో వారికి ఐకమత్యమును పెంపొందించెను. రామరాయల జోక్యము వలన సుల్తానులలో కలిగిన నూతన చైతన్యమే రాక్షసి. తంగడి యుద్ధమునకు దారితీసెను. ఈ ఘోర సంగ్రామమునకు రామరాయలు మహమ్మదీయమతముపై చూపిన ద్వేషమే కారణమని ఫెరిస్తావంటి ముస్లిము చరిత్రకారులు వ్రాసిన వ్రాతలు విశ్వసింపదగవు. రామరాయలు మహమ్మదీయులను అత్యంత గౌరవముతో చూచెను. తన సోదరుడయిన జంషీద్ షాకు భయపడి శరణు చొచ్చిన మాలిక్ ఇబ్రహీమునకు ఆశ్రయ మొనగి అతనికి జాగీరు ఇచ్చుటయేగాక (1543_1550), జంషీ దుమరణానంతరము అతడు గోల్కొండ సుల్తాను అగుటకు రామరాయలు చేసిన ఉపకారము అమూల్యమయినది. బీజపూరు సుల్తానయిన ఆలీఆదిల్ షాను రామరాయలు పుత్రసమానముగా ప్రేమించెను. అతనిని అనేక పర్యాయములు రక్షించెను. తన ఆస్థానమునందలి మహమ్మదీయుల మతవిశ్వాసములను ఏ మాత్రము అతడు తృణీకరింపలేదు. వారు కాఫరునకు నమస్కరింప రని తెలిసికొని, రామరాయలు తన సింహాసనముపై కోరాను యొక్క ప్రతిని ఉంచుకొనెడివాడట ! అందుచే రాయల మతద్వేషముగాక, హిందూమహమ్మదీయుల మధ్యగల సహజద్వేషమే, విజయనగర అధికారవైభవాభివృద్ధి, సుల్తానులలో కలిగించిన భయో ద్రేకములే, రాక్షసి- తంగడి యుద్ధమునకు కారణములు అనుట నిస్సంశయము.

మొట్టమొదట 1548 లో రామరాయలు నిజాంషాతో(అహమ్మదు నగరము) చేరి ఇబ్రహీంఆదిల్ షా (బీజపూరు)తో పోరాడెను. ఇబ్రహీం సంధిచేసికొని యుద్ధము నుండి విరమించెను. 1556 లో అహమ్మదునగరు, గోల్కొండ సుల్తానులు కలిసి బీజపూరుపై దండెత్తి, గుల్బర్గాను ముట్టడించిరి. ఇబ్రహీం ప్రార్థనపై రామరాయలు జోక్యము కలిగించుకొని సుల్తానులమధ్య సంధి కుదిర్చి యుద్ధమును మాన్పెను. ఇబ్రహీం మరణానంతరము అతని కుమారు డయిన ఆలీ అదిల్ షా, బీజపూరు సింహాసన మెక్కెను. ఆలీ బాలుడగుట సదవకాశముగా గ్రహించి నిజాంషా బీజపూరుపై దండెత్తెను. ఆలీ విజయనగరమునకు పారిపోయి రామరాయల సహాయము అర్థించెను. కుతుబ్ షాను (గోల్కొండ) కూడ గట్టుకొని రాయలు నిజాంషా పై దండెత్తి దౌలతాబాదువరకును సేనలను నడిపించెను. నిజాంషా పరాజయమంది, కల్యాణిదుర్గమును ఆలీ అదిల్ షా కొసగి సంధిచేసికొనెను.

రామరాయల విజయ పరంపరలు, గోల్కొండ సుల్తానైన ఇబ్రహీం కుతుబ్ షాలో అసూయాద్వేషములను ప్రజ్వలింప జేసెను. రామరాయలు తన కొనర్చిన మహోపకారమును గూడ విస్మరించి అతని తుదముట్టించుటకై ఇబ్రహీం కుతుబ్ షా ప్రయత్నింపసాగెను. పై యుద్ధమున రాయలు అహమ్మదు నగరమును ముట్టడించు సందర్భమున కుతుబ్ షా రహస్యముగ నిజాంషాతో సంధిచేసికొని దుర్గరక్షకులకు సహాయ మొనరించెను. అదియునుగాక, కొండపల్లి దుర్గము నొసగుదు నని రాయలను నిజాంషాతో సంధి కొడబరచెను. కాని ఆ వాగ్దానమును మన్నింపలేదు. రామరాయలు గూడ కుతుబ్ షా పై తిరుగుబా టొనరించిన జగదేవరావునకు ఆశ్రయ మొసగి ఆతని ఆగ్రహమును రెచ్చగొట్టెను. అందుచే కుతుబ్ షా నిజాంషాతో సంధిచేసికొని తన కుమార్తెను అతని కొసగుటకు నిర్ణయించెను. ఈ వివాహము కల్యాణదుర్గమును జేయవలె నని కుతుబ్ షా నిజాంషాలు 1558 లో కల్యాణిని ముట్టడించిరి.

ఆదిల్ షా బరీదుషా (బీదరు) లతో కలిసి రామరాయలు కుతుబ్ షా, నిజాంషాలతో యుద్ధమునకు