ఆళియ రామరాయలు
రాయలను సకుటుంబముగ తుదముట్టించి, భయభ్రాంతులైన ప్రజలను ఒడబరచి సలకము తిరుమలయ్య విజయ
నగర సింహాసన మధిష్ఠించెను. నానాటికి అతని దౌష్ట్యములు మితిమీరుటచే ప్రజలు ఆదిల్ షాను ఆహ్వానించిరి.కాని అతడు తన దురహంకారముచే ప్రజల అభిమానమును గోల్పోయి ప్రాణభీతితో తన రాజ్యమునకు పారిపోయెను. ఇట్టి పరిస్థితులలో తిరుమలయ్య యొక్క దుష్ట పరిపాలనమును తుదముట్టించి, దేశమున శాంతి భద్రతలను నెలకొల్పుము అని ప్రజలు అనేక విధముల రామరాయలను ప్రార్థించిరి. రామరాయలు గూడ ఇట్టి తరుణమునకై వేచియుండెను. అందుచేత తన పక్షము వారిని కూర్చుకొని విజయనగరమునకు సరియైన పెనుగొండను వశపరచుకొని అటనుండి బయలు దేరి కోమలి, బేతంచర్ల, జూటూరు, బెడగల్లు, ఆదవాని యుద్ధములందు తిరుమలయ్యను ఓడించి తుద కాతనిని మిత్రబృందముతో తుంగభద్రానదీతీరమున వధించి విజయగర్వముతో రామరాయలు విజయనగరమును ప్రవేశించెను. సదాశివరాయలు పట్టాభిషేకమహోత్సవ మత్యంత వైభవముగ జరిగెను (1543).
రామరాయలు, సదాశివరాయలు : సదాశివరాయలు పేరునకు మాత్రమే సార్వభౌముడు, ప్రభుత్వభారమంతయు రామరాయలే వహించెను. మొట్టమొదట దండనాథుడుగ నున్న రామరాజు క్రమముగ సర్వాధికారి అయ్యెననియు, రాజాధిరాజ, రాజపరమేశ్వర, వీరప్రతాప మహారాజాది సార్వభౌమోచిత బిరుదములను ధరించెననియు, యువరాజ పదమును గూడ బడ సెననియు స్థానిక చరిత్రలు నుడువుచున్నవి. చివరకు సదాశివరాయలను చెరసాలలోనుంచి సంవత్సరమున కొకమారు మాత్రము అతనిని ప్రజలకు ప్రదర్శించి, సార్వభౌమోచిత మర్యాద లొనర్చుచుండెను అనికూడ తెలియుచున్నది.
సదాశివరాయల పట్టాభిషేకానంతరము రామరాజు తనకు శత్రువులై నవారిని తొలగించి, తన అధికారమును బలపరచు కొనెను. అతని అధికారవ్యామోహమును నిరసించుటచే గాబోలు, నాటివరకును విజయనగర సామ్రాజ్యమును భక్తివిశ్వాసములతో కొలుచుచుండిన సాళువాది వంశములు పదచ్యుతినందెను. స్వార్థపరుడై రామరాజు అనుసరించిన ఈ ఆంతరంగిక విధానము, ఆరవీటి వంశస్థాపనకు సుగమమార్గ మేర్పరచినను, ఆది విజయనగర సామ్రాజ్యపు పునాదులను భేదించి వైచెను.
రాజధానిలో తన మార్గము నిష్కంటకమైన వెంటనే రామరాయలు దక్షిణదేశమున ప్రబలిన అశాంతి నడచుటకు నిర్ణయించెను. ఈ కాలమున దక్షిణ దేశమున స్థానిక ప్రభువులతోబాటు పోర్చుగీసువారుకూడ అల్లరులకు కారకులైరి. పోర్చుగీసువారు మత ప్రచార మొనర్చుటయేగాక, దేవాలయములను పడగొట్టి చర్చీలను నిర్మింపసాగిరి. చోరమండల తీరమందలి పల్లెవాండ్రకు కిరస్తాని మత మొసగి వారిని విజయనగరాధీశులపై దుండగములకై పురికొల్పుచుండిరి. రామేశ్వరమున కేగు యాత్రాపరులను అనేక విధములైన హింసలకు గురిచేయుచుండిరి. సుప్రసిద్ధములయిన తిరుపతి, కాంచీనగరము మున్నగు హైందవ క్షేత్రములనుగూడ కొల్లగొట్టుటకు ప్రయత్నించిరి (1545). అందుచేత వారి దుష్కృత్యములను మాన్పుట అత్యవసరమై యుండెను. రామరాజు ఇది గ్రహించి చిన తిమ్మరాజు, విఠలరాజు అను సోదరులను దక్షిణదేశ దండయాత్రకు పంపెను. వీరు మధుర, తంజావూరు,నాయకులు సహాయముతో తన్నరసునాడు, టూటికారన్, తిరువాడి రాజ్యములందు తిరుగుబాటుల నణచి కన్యాకుమారికడ విజయస్తంభమును ప్రతిష్ఠించిరి. పోర్చుగీసు వారి దుండగములు తగ్గెను, 1546 లో పోర్చుగీసు గవర్నరయిన డకాస్ట్రో రామరాయలతో సంధి గావించుకొనెను. కాని రామరాయలు పోర్చుగీసు వారిని విశ్వసింపక 1548 లో తాను సెయింటు థోమ్ పై దండెత్తి విఠలరాజును గోవాపైకి పంపెను. పోర్చుగీసువారు ఓడిపోయి రాయలకు కప్పము చెల్లించిరి.
రామరాయలు, మహమ్మదీయులు : రామరాయలు మహమ్మదీయులపట్ల అనుసరించిన రాజనీతి విచిత్ర మైనది. హిందూమతవిధ్వంసమే మహమ్మదీయుల ఆశయమనియు వారిని అరికట్టుటకును, హిందూధర్మములను రక్షించుట కును విజయనగర సామ్రాజ్యము వెలిసెను అను సత్యమును రామరాయలు విస్మరించినట్లు కన్పించును. తన్నెదిరించిన హిందూసర్దారులపై ప్రతీకారమునకో అనునట్లు తన కొలువున ముస్లిము ఉద్యోగుల సంఖ్యను ఇతడు పెంచెను. ఐ౯ - ఉల్ - ముల్కు లవంటివారు ఉన్నత