Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అహోబిలము

క్రీ. శ. 1210 వ సంవత్సరమున నిశ్శంక బిరుదాంకితుడగు శార్జదేవ మహామహుడు రచించిన సంగీత రత్నాకరము నందలి విషయములను కొంతవరకు అనుసరించి పై గ్రంథమును ఇతడు రచించెను. ఇతడు తాను రచించిన 'సంగీత పారిజాతము' అను గ్రంథమును

శ్లో॥ సంగీత పారిజాతో౽యం సర్వకామ ప్రదోనృణాం !
అహోబలేన విదుషా క్రియతే సర్వసిద్ధయే॥

అను శ్లోకముబట్టి సందేహములను తీర్చి సమస్తమైన కోరికలను సిద్ధింపజేయు దానినిగా ఉద్దేశించి రచించినట్లు తెలియు చున్నది. వీణయందు స్వరస్థానము కొరకు సారికలను మెట్లను పెట్టు పద్థతిలో క్రొత్త సంప్రదాయమును మొదట వెల్లడి చేసినది అహోబల పండితుడే. దీనినిబట్టి వీణయందు ఇంత కొలతలో ఈస్వరము ఉన్నదను విషయము తెలియ గలదు, రత్నాకరుడు ఏడు శుద్ధస్వరములు పండ్రెండు వికృతిస్వరములు కలవని చెప్పెను. అహోబలుడు ఇరువది రెండు వికృతి స్వరములను పేర్కొనెను. హిందూస్థానీ గానములో శుద్ధ వికృతిస్వరములకు క్రమముగ కోమల తీవ్ర అను నామములు కలవు. కర్ణాటక పద్ధతిలోని సాధారణ గాంధారమును తీవ్రగాంధారముగా, కైశికి నిషాదమును నీవ్రనిషాద ముగా, అంతర గాంధారమును తీవ్రతర గాంధారముగా కాకలి నిషాదమును తీవ్రతర నిషాదముగా, మృదుపంచమమును అనగా వరాళీ మధ్యమమును తీవ్రతర మధ్యమముగా, శుద్ధమధ్యమమును అతితీవ్రతమ గాంధారముగా పేర్కొ నెను.

హిందూస్థానీ గానమును అనుష్ఠించువారలకు సంగీత పారిజాతము ప్రమాణ గ్రంధము. దీనినే ఇప్పటికిని హిందూస్థానీ గాయకులు కొంతవరకు అనుసరించు చున్నారు,

నో. నా.

అహోబిలము  :- శ్రీశైలము, అహోబిలము, సంగమేశ్వరము, మహానంది కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రములు. అహోబిలము తప్ప మిగిలినవన్నియు శివపరమైనవి. అహోబిలము వైష్ణవ క్షేత్రము. విశిష్టాద్వైత మతస్థుల కియ్యది పవిత్ర యాత్రాస్థలము మాత్రమేకాక, తదితర మతముల వారికిని ఆరాధ్య మయ్యెను.

అహోబిలము కర్నూలు మండలములోని శిరువెళ్ళ తాలూకాలో రుద్రవరమను గ్రామమునకు అయిదు మైళ్ల దూరమందు కలదు. నల్లమల కొండలలో మనోజ్ఞమైన ప్రకృతి దృశ్యముల మధ్య ఈ క్షేత్ర మొప్పుచుండును.

హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునిపై దురాగత మొనర్చు ఘట్టమునందు విష్ణువు నరసింహావతారమెత్తి తన భక్తుని కాపాడిన పవిత్రస్థలమిదియే అని పారంపర్యముగా వచ్చిన కథ గలదు. నరసింహస్వామి కంకితముగా నిర్మితమైనట్టి ముప్పది రెండు పుణ్యతీర్థములో ఇదియే ప్రముఖమయినది. ఇచ్చట నరసింహస్వామికి అంకితమయిన తొమ్మిది దేవాలయములు గలవు, ఆ దేవాలయము లన్నియు పదిమైళ్ళ చుట్టుపట్లనే కలవు. అందుచే ఈ ప్రదేశమునకు పంచ కోశ తీర్థమనియు పేరుగలదు.

ఈ క్షేత్ర ప్రాంతములోనున్న నవ నరసింహులకు ప్రహ్లాదవరద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి కరంగి నరసింహస్వామి (యోగానంద నరసింహస్వామి). ఉగ్రనరసింహస్వామి, గుహానరసింహస్వామి, క్రోధనర సింహస్వామి, మలోల నరసింహస్వామి, జ్వాలా నర సింహస్వామి, పవన నరసింహస్వామి అను పేర్లు ఉన్నవి. వీరిలో "మలోల నరసింహస్వామి శాంత స్వరూపుడు. లక్ష్మీ దేవితో సదా సరస సల్లాపములాడుచు నుండును. కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు బంగారు ఉత్సవ విగ్రహమును సమర్పించినాడు. అహోబిలం మఠము జియ్యరు తన మఠములో ఇష్ట దైవముగా పూజించుటకు దానిని తీసికొని వెళ్ళిపోయెను. ఇక్కడ ఒక విశేషమేమనగా స్వామివారు కూర్చుండియుండును. కుడికాలు క్రిందికి వేళ్ళాడుచుండును. దానికి పాదుక తొడిగియున్నది. అందుచేత మఠాధిపతి విగ్రహమును ఎక్కడికి తీసికొని వెడల దలచితే అక్కడికి వెళ్ళుటకు స్వామి సంసిద్ధులై యున్నారను ప్రతీతి వచ్చినది.

దట్టమైన వృక్షముల మధ్య నల్లమల కొండల నానుకొని ఉన్న దానిని దిగువ అహోబిలమనియు, 2800 అడుగుల యెత్తుగల పర్వతముపై నున్న దానిని ఎగువ అహోబిలమనియు అందురు. వేదాద్రి. గరుడాద్రి అను పేర్లతో ఆ రెండు పర్వతములు పిలువబడుచున్నవి. వాటి