Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అహోబలుడు

భావార్థక 'ట' వర్ణ విధాయకసూత్ర వివరణ సందర్భమున అహోబలుడు మహాకవుల ప్రయోగములను పరామర్శించి తప్పు పట్టుటకు సాహసించెను. "భావే టవర్ణకోంతే సర్వేషాం క్రియాపదానాం స్యాత్" అని ఆంధ్రశబ్దచింతామణి సూత్రించినది. అన్ని క్రియా పదములకును భావార్థమున 'ట' వర్ణమగును. అతడు ఘటించుట, వచ్చుట మొదలగునవి ఉదాహరణములు. అథర్వణుడు దీనిపై కొన్ని విశేషములను సూచించెను. “పూర్వస్య నవి కారో నో స్తస్మిన్ లోపశ్చకస్యచిత్ "భావార్థక 'ట' వర్ణమునకు పూర్వమునందున్న 'ను' వర్ణము నకు లోపము రాదని దీని భావము. అనుట, వినుట వంటి రూపములే భావార్థమున సాధువులనియు, అంట, వింట, కంట, వంటి రూపము అసాధువు లనియు అహోబలుని నిర్ణయము. ఈ ప్రకారము శ్రీనాథుని ప్రయోగము ప్రామాదికమని యీతడు ఖండించెను. "ఏ తేన మధుకైట భారాతి మఱఁది రమ్మని పిల్చి పనిఁ గొంట నీకుఁ బ్రాభవము కాదె"— ఇత్యాది వచన స్య ప్రామాది కత్వమే వేత్యవధేయం. ఆంధ్రభాషాభూషణే “వినుటకు వింటయగు" నిత్యాది వచనేన వింటే త్యాదీనాం సాధుత్వ ముక్తం. తదనేన పరాస్తం - "ఘటించుట కొరకున్, వచ్చుట కొరకున్" ఇత్యాద్యాకారేణ సర్వత్ర 'ట' వర్ణకాదేవ విభ క్తయః. ఏవం స్థితే “సుతులఁ గనియెడు కొరకు నీవు ఘటించుకంటే ఇత్యాదీనాం భాస్కర తిక్కయ జ్వాదీనాం వచనానాం కిం మూలమితి వయం నవిద్మః" ఘటించుట కొరకు ఇత్యాదిగా 'ట' వర్ణకము మీదనే విభక్తి రావలసియుండగా, భాస్కర తిక్కయ జ్వలు 'కనియెడుకొరకు, ఘటించుకంటే' మొదలగు రీతిని ప్రయోగించుటకు మూల మేమియు మే మెరుగ లేకున్నారము. ఇట్లహోబలపతి తిక్కనాదులకుగూడ తప్పులు వట్టెను. శాస్త్రమునకును మహాకవి ప్రయోగములకు వైరుద్ధ్యము కలిగినపుడు శాస్త్రమే బలీయమని అహోబలుడు విశ్వసించెను. ఈ సందర్భమున అథర్వణ కారిక యొకటి ఇట్లున్నది. "శాస్త్ర ప్రయోగ వచసో శ్శాస్త్రం బలవదుచ్యతే | అనిష్పన్నే పదే తేన ప్రయోగా శ్రయణం బలం"—దీని నాధారముగా గొని అహొబలుడు మహాకవి ప్రయోగములకూడ సరిదిద్దుటకు వెనుదీయలేదు. వసుచరిత్రయందలి "అప్పుపాలయిన శుభ్రాబ్జంబు రుచి యెంత; కనకూర్మి ఱేని అప్పుననే ముంచె" అను ప్రయోగములను అహోబలుడు విమర్శించెను. నిత్య బహువచనమయిన అ ప్ఛబ్ధమును అప్పు అని ఏకవచనముగ ప్రయోగించుట దోషమని పై పద్య పాఠమును అతడు ఇట్లు సవరించెను. “అప్పుల పాలయిన య బ్జంము రుచియెంత; అలకూర్మి ఱేని అప్పులనే ముంచె." తుదకు అహోబలుడు నన్నయ మహాకవి ప్రయోగములనుకూడ సవరింపబూనెను. ఎట్లన “తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు" ఇత్యత్ర బు వర్ణ కానంతరం నకార శ్శ్రూ యతే తత్ర కాగ తిరితిచేత్ - "తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు"—— ఇత్యేవ పాఠ స్సాధుః. అహోబలుడు దిద్దిన పాఠము ఏ భారతియందును కాన్పించదు. “ప్రయోగ మూలం వ్యాకరణం"; "ప్రయోగ శరణా వైయాకరణాః" అను నుత్తమ పద్ధతిని ఇతడు పాలించిన వాడు కాడు. శాస్త్రమునకు ప్రాధాన్యమును ప్రయోగమునకు గౌణత్వమును ఇచ్చుటచే అహోబలుడు విమర్శనమునకు గురియగుచున్నాడు.

మొత్తమునకు అహోబల పండితుని కవిశిరోభూషణ వ్యాఖ్య ఆంధ్రశబ్దచింతామణి — అథర్వణ కారికావళులకు సమగ్రమును, విమర్శాత్మకమునగు వ్యాఖ్యానమై మహాభాష్యమువంటి యుద్గ్రంథమునై, తరువాతి యాంధ్రలాక్షణికులకు సర్వతోముఖముగా మార్గదర్శి యయ్యెననుట సత్యము.

కె. లిం. శా.

అహోబలుడు  :- క్రీ. శ. 1500 సంవత్సరము ప్రాంతమువాడు. ఆంధ్రుడు. అహోబల క్షేత్ర ప్రాంతీయుడు. ఇతడు వెలనాటి వైదిక బ్రాహ్మణో త్తముడు. శ్రీకృష్ణ పండితుని కుమారుడు. వేద, వేదాంత, తర్క, వ్యాకరణ శాస్త్రనిష్ణాతుడు, సంగీతశాస్త్ర పండితుడు. గొప్ప వైణికుడు. తనకు చేకూరిన సమగ్రమైన అనుభవమును పురస్కరించుకొని 'సంగీత పారిజాతము' అను చక్కని సంగీతలక్షణ గ్రంథమును రెండు కాండములలో రచించెను. అందు మొదటి కాండమున రాగగీతములను రెండవ కాండమున వాద్యతాళములను చెప్పెను.