Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అహోబల పండితుడు


డిరి యొండొరునని కానక పరపురుష క్రియలఁ బ్రకృతిభావము గలదే? (అప్ప. 5వ. ఆ. 64 వ ప.)

"బలభిద్వహ్ని పరేత రాజవరుణుల్
     బర్యుత్సుకత్వంబు సం
ధిలఁ గూర్చుండిరి యొండొరుంగదిసి.”

(శృంగార నైషధము.)

ఈ సూత్ర సందర్భమును పురస్కరించుకొని శ్రీనాథుడు అపప్రయోగము చేసెనని అప్పకవి విమర్శించెను. భూతకాలిక ప్రథమ పురుష బహువచనమునకు సంధి నిత్యము కాదగియుండగా ప్రకృతిభావము చేసెనని యాతడాక్షేపించెను.

అహోబలపండితుడు తన వ్యాఖ్యానమునందు అప్పకవి శ్రీనాథునిపై చేసిన యాక్షేపణను పరామర్శించి, శ్రీనాథుని ప్రయోగము లాక్షణిక సమ్మతమేయని సమర్థించెను. ఎట్లన “ప్రధమే చోత్తమేచైవ క్రియేతొవా భవేత్ చ్యుతిః | నిత్య మన్యస్య వికృతౌ క్త్వార్థేతో నభ వేత్సదా," అను నాథర్వణకారికను అహోబలు దీసందర్భమున పేర్కొనెను. ప్రథమ పురుష యందును, ఉత్తమ పురుషయందును క్రియా సంబంధియగు ఇకారము వికల్పముగా జారిపోవును. మధ్యమపురుష 'ఇ' కారమునకు సంధి నిత్యముగా నగును. క్త్వార్థేకారమున కెల్లపుడు సంధిలేదు. దీనిప్రకారము శ్రీనాథుని ప్రయోగము ప్రామాణికమే యనెను. ద్రుతాంతమైన భూత కాలిక ఉత్తమ పురుషైక వచనక్రియకు సంధి వైకల్పికమని అహోబల పండితుడు వివరించెను, దీనిని "ప్రాయస్తు స్యాత్కి మాది కస్యేతః" అను సూత్రమునకు విషయముగా చేసెను. నేవించితి నచ్యుతు; సేవించి తచ్యుతు; అని యుదాహరణములు. అథర్వణుడును, కవి మండనకారుడును దీనిని అనుమతించిరి. కొందరమతమున దృతాంతమైన 'తి' ప్రత్యయమునకు సంధి చెల్లదు. కొలిచితిని+అబ్ధిజను, కొలిచితినబ్ధిజను, కొలిచితిని నబ్ధిజను అని రూపము లేర్పడవలెను. “నస్యాత్ త ద్ధ ర్మోత :" అను సూత్రవివరణ సందర్భమున అహోబలుడును, అప్పకవియు భిన్నమార్గముల త్రొక్కినారు. అహోబలుని వివరణము "సంధిరితి సర్వత్రానువర్తతే. తధ్ధర్మోకార స్స్యాచి సంధిర్నస్యాత్. తధర్మపదేన తద్ధర్మక్రియా, తజ్జన్య విశేషణంచ గృహ్యేతే. వెలయునతని కీర్తి సకల దిగ్వలయమునను, రక్షణమొనర్చు నంబుజా తాక్షు గొలుతు నిత్యా ద్యుదాహరణం" (సంధియను శబ్దము అంతట ననువర్తించుచున్నది. తద్ధర్మో కారమున కచ్చు పరమగుచుండగా సంధిలేదు. తధర్మ పదముచేత తద్ధర్మ క్రియయును, తజ్జన్య విశేషమును గ్రహింపబడుచున్నవి. వీటి రెంటికి నుదాహరణములు వెలయు నిత్యాదులు.) అహోబలపతి ఇట్లు వ్యాఖ్యానించుటకు మూలము అథర్వణుడు. వికృతి వివేకమునం దిట్లున్నది. "ప్రథమశ్చొత్త మశ్చైవ తాను తద్ధర్మ సౌంజ్ఞికే । భూతాద్య విషయౌ తత్రచైక త్వార్థాభి ఛాయకౌ ఉదంతేచ సదానాం తౌన సంధి స్తత్ర కల్ప్యతే". అనగా పూర్వోక్త క్రియలయందు భూతాద్య విషయకములై నాంతములు, ఉదంతములు నైన ప్రధమోత్తమ పురుషైక వచనములు తద్ధర్మ సంక్షితము లగును. వాటికి సంధి రాదు. ద్రుతాంతము లైన వీటికి సంధి రాకుండగా, కళలగు నితర తద్దర్మ క్రియారూపములకు సంధి కలుగవచ్చును. ఉదా : వారు ఘటింతురనుచు; ఘటింతు మెంత పనియైన, ఘటింతు వనిళము. అప్పకవి ఈ సూత్రమును మరియొక విధమున నన్వయించెను. ఆతడు "నః స్యాత్" అను పాఠమును కల్పించుకొని

క్షితిని బై పదములకు విశేషణంబు
లగు క్రియాపదంబుల తుదినమరు శృంగ
మునకు వచ్చు నాగమమయి పొల్ల ద్రుతము
ప్రాణపరమైన కర్మధారయమునందు.

ఉత్తర పదమునకు విశేషమైన తద్ధర్మరూపము తుది 'ఉ' కారమున కచ్చుపరమగునప్పుడు కర్మధారయమున పొల్ల 'న' కారము ఆగమముగా వచ్చును.

ఈతడీ విధముగా వ్యాఖ్యానించుటచేతనే తరువాతి లాక్షణికులందరు తద్ధర్మార్థక విశేషణో కారమునకు అచ్చుపరమగు నప్పుడు నకారాగమము వచ్చునని సూత్రించుచు వచ్చిరి. ఈ సూత్రమునకు పూర్వాపర సూత్రములీ సూత్రము సంధినిషేధ వరముగా చాటుచుండ, నకారాగమ విధాన పరముగా అప్పకవి వ్యాఖ్యానించెను.'