Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆహోబలపండితుడు


సమగ్రమగు వ్యాకరణము లేని కొరతను చాలవరకు తీర్చెను, వేయేల! వికృతి వివేకము (అథర్వణ కారికా వళి) లోని విషయబాహుళ్యము నేటి బాల వ్యాకరణ త్రిలింగ లక్షణ శేషాదులలో గూడ లేదనుటకు సందేహము లేదు.

అహోబలుడు తన వ్యాఖ్యానమున అథర్వణ కారికలను పేర పెక్కు శ్లోకముల నుదాహరించి యున్నాడు. పతంజలి మహాభాష్యమున వ్యాకరణ సంబంధమయిన కొన్ని శ్లోకములు ఉదాహరింపబడినవి. వాటికి సమానముగా నిందు అథర్వణ కారికలు చేర్చబడినవి.

యస్సారో 2థర్వణగ్రంధే సోప్యతైన విధీయతే |
తేన తత్ఫక్కి కాలోకలోలతా త్యజ్యతాం బుధై ః ॥

'అధర్వణాచార్యుని గ్రంథమునందలి సారమంతయు నిందు జేర్చితిని. కావున పండితులు దానిని చూడవలయునను కోరిక వీడవలయును' అని అతడు వ్రాసెను (కవి శిరో.పీ.). అథర్వణకారి కావళిముద్రిత ప్రతి ద్వితింత్రిణీ (రెండుచింతల) సీతారామకవి వ్యాఖ్యగలదై ప్రస్తుతము లభించుచున్నది. ఈ కారికలను అథర్వణుడు రచింపనే లేదనియు స్వపక్షమండనార్థమై అహోబలుడే వ్రాసి తన వ్వాఖ్యానమున జొప్పించెననియు విమర్శకులు తలచు చున్నారు. ఆంధ్రవ్యాకరణ విషయమున నన్నయ ప్రథమాచార్యుడనియు, అథర్వణుడు ద్వితీయాచార్యుడనియు పండితవ్యవహారము కలదు .

శైలి :- అహోబలపండితుని కవిశిరోభూషణపు శైలి మృదుమధురమై సరళమై ప్రసాదగుణ భూయిష్ఠమై సంస్కృత కావ్య వ్యాఖ్యాతలును, లక్షణగ్రంథ వాఖ్యాతలు నగు మల్లి నాథ, సోమపీథ్యాదుల శైలికన్న రసవత్తరముగా నుండును. ఇది అహోబలుని సంస్కృతాంధ్ర పాండిత్యమును దెలుపు వ్యాకరణ సంబంధమైన యుధ్రంథము. లక్షణములు సంస్కృతమునందును, లక్ష్యములు తెలుగునందును చెప్పబడుటచే నిధి చదువుటకొక వింత గ్రంథముగా నుండును. ప్రాకృత వ్యాకరణ లక్ష్యలక్షణము లిట్లెయుండుటచే అవి చూచినవారికి నిది విపరీతముగా గన్పట్టదు.

"విశ్వశ్రేయః కావ్యం, తదదోషౌ పరికృతౌచ వాగర్ధౌ, సాహగ్యారస వృత్తిః సాధ్యోహిరసో యథా యథం కవిభిః" - ఇత్యాది సూత్ర వ్యాఖ్యా సందర్భమున తనకుగల సర్వశాస్త్ర దర్శనములందలి కూలంకషములైన పాండిత్య ప్రతిభా విశేషాదులు ద్యోతక మగునట్లుగా అహోబలుడు వ్రాసియున్నాడు. ఈ సందర్భముననే "వ్యాకరణస్యాపి బ్రహ్మపరత్వమేవ తథాహి పస్పశాహ్ని కే భగవత్పతంజలినా చత్వారి శృంగేతి మంత్రస్యార్దొ వివృతః." పస్పశాహ్నికమందు(వ్యాకరణ భాష్యభాగము.) 'చత్వారి శృంగేత్యాది' మంత్రమునకు వ్యాకణ పరముగా నర్థమును వివరించెను. పతంజలి మహర్షి సంస్కృత వ్యాకరణావశ్యకతను మహా భాష్యమునందు చర్చించినట్లే అహోబలుడును ఆంధ్రవ్యాకరణా వశ్యకతను గూర్చి ఇందు చర్చించెను. సంస్కృత భాషయందు మాత్రమే కావ్యములను రచింపవలెను. తదితర భాషలన్నియు అపభ్రంశములు. వాటి నుచ్చరించుట పాపము. దేశ భాషలలోని పురాణాదులను విన్నందున పాపక్షయము లేదు. అను నీ మున్నగు పూర్వపక్షములఖండించి యేదేశమువారి కాభాష సంస్కృతమువలెనే పవిత్రమనియు, స్త్రీ శూద్రులకు జ్ఞానాధికారము గలదనియు 'నా నృషిః కురుతే కావ్యం' ఋషి కానివాడు కావ్యమును రచింపలేడనియు, నన్నయభట్టును ఋషిగా నెంచవలెననియు, ఆతని వ్యాకరణము ప్రమాణమే యనియు, వివరించి యున్నాడు.

వ్యాఖ్యాన విశేషములు :- అప్పకవి “నిత్యమను త్తమ పురుష క్రియాస్వితః" అను సూత్రమును వివరించుచు ఇట్లు చెప్పెను. భూత కాలక్రియలగు ప్రథమపురుష బహువచనము, మధ్యమపురుష ఏక వచన బహువచనములు, ఉత్తమ పురుష బహువచనము, ఇకార మంతమందు గల వాటికి అచ్చు పరమగునపుడు సంధి నిత్యమని ఈ యుదాహరణముల నిచ్చెను - దీవించిరట; దివిజు నేలితివట; మీరు కట్టితిరట; వింటి మీవార్త. ప్రథమోత్తమ పురుషైక వచనములు, భూతకాలమునందలివి, ద్రుతాంతములగునని ఈ యుదాహరణముల నిచ్చెను భరియించె నుపేంద్రుడు; ఏను బ్రతికితి ననగన్. విరచించెను శ్రీనాథుఁడు ధరణిని శృంగార నైషధంబునఁ గూర్చుం