ఆహోబలపండితుడు
మణి ప్రతిని తన వ్యాఖ్యానమునకు మాతృకగా నంగీకరించెను. అప్పకవి చేపట్టిన మాతృకయందలి పాఠ బేధములను గూడ అథర్వణోక్తి ప్రకారము సంగ్రహించెను.
1.
పాఠభేదాస్తు బహవో దృశ్యంతే పుస్తకద్వయే,
మయాప్రాయ స్సరస్వత్యాః పుస్తకం పరిగృహ్యతే.
2.
అప్పార్య పుస్తకారూఢ పాఠ భేదా ద్యదుస్థితం,
మయా సంగృహ్య తేరూపం తదప్యాథర్వణో క్తితః
. ——కవి శిరోభూషణ గ్రంథాది పీఠిక
ఆంధ్రశబ్ద చింతామణి బాలసరస్వతీ పండితునకు లభించిన విధమును గూర్చి యొక అద్భుతకథ చెప్పబడు చున్నది. నన్నయభట్టు దీనిని రచించెననియు రాజరాజ నరేంద్రుని కుమారుడయిన సారంగధరుడు బాల్యమున దాని నభ్యసించి, కాలుచేతులు నరకబడి సిద్ధులలో కలిసి కాలాంతరమున బాలసరస్వతికి ప్రత్యక్షమై చింతామణి గ్రంథమును వ్యాఖ్యానింపుమని అతని కొసగినట్లు కథ కల్పింపబడినది. అప్పకవియు, అహోబలపండితుడును ఈ కథనే తమ గ్రంథ పీఠికలయందు అనూదించిరి. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయభట్ట కృతము కాదను వాదము విమర్శక లోకమున కలదు. దీనిని మొదట లేవనెత్తినవారు కం. వీరేశలింగము పంతులుగారు. శ్రీ వద్దుల చిన సీతారామస్వామి శాస్త్రిగారు తమ బాలసరాస్వతీయ - అథర్వణకారి కావళీ పీఠికల యందును చింతామణి' విషయపరిశోధక గ్రంథమునందును పెక్కు హేతువులచే చింతామణి నన్నయ కర్తృకమే యని స్థాపించియున్నారు. అథర్వణకారికావళి అథర్వణ కర్తృకమే అనియు, అది ఆంధ్రశబ్ద చింతామణికి శేష గ్రంథమే అనియు చింతామణియందలి సూత్రములు సామాన్య సూత్రము లనియు, కారికావళి సూత్రములు విశేష సూత్రము లనియు వారిమతము.
అహోబలపండితుడు బాలసరస్వతీయ, అప్పకవీయములనేగాక అథర్వణ కారికావళిని గూడ ఆధారముగాగొని యాంధ్రశబ్ద చింతామణికి అహోబల పండితీయమను సంస్కృత భాషామయమును, విపులమును,క్షొదక్షమమునగు వ్యాఖ్యానమును రచించి యాంధ్రభాషకు మహోపకార మొనర్చెను.
తత్ర పంచ పరిచ్ఛేదా
శృబ్దశా స్త్రే నియంత్రితాః॥
ఆర్యాఖ్య పద్యైస్త త్సంఖ్యా
సమ్మితా స్యాద్గ జైర్గ జై ః ॥
బాలసరస్వతి పరిగ్రహించిన ఆంధ్రశబ్ద చింతామణి యందు ఆర్యావృత్తములుగల అయిదు పరిచ్ఛేదములు కలవు. అవి సంజ్ఞా, సంధి. అజంత, హలంత, క్రియా పరిచ్ఛేదములు. ఈ అయిదు పరిచ్ఛేదములందును 88 ఆర్యా వృత్తములు కలవని అహోబలపండితుడు నుడివెను. కాని "ఆద్యం ప్రకృతిః ప్రకృతి శ్చాద్యే" అను శ్లోక వివరణ సందర్భమున మరియొక శ్లోకమును ఇతడు ఉదాహరించి యున్నాడు. "శాస్త్రమ పౌరుష మాద్యం" అను శ్లోకము బాల సరస్వతి స్వహస్త లిఖితమయిన ప్రతియందు తనకు లభించెనని అహోబలుడు సూచించెను. ఇట్లు ఆంధ్రశబ్దచింతామణియందలి శ్లోకములు 89 అగుచున్నవి. ఈ విశేష శ్లోకమును బాలసరస్వతి కాని అప్పకవిగాని వివరించి యుండలేదు. అప్పకవి గ్రహించిన ప్రతియందు 82 ఆర్యావృత్తములే కనిపించుచున్నవి. ఈ యంశము క్రింది శ్లోకమువలన తెలియనగుచున్నది.
మతంగ శైల విప్రేంద్రా దన్యం వ్యాకృతి పుస్తకం |
కాకునూ ర్యప్పకవినా గృహీతం తత్ర షడ్గతాః॥
మతంగపర్వతమందున్న బ్రాహ్మణునివలన చింతామణియొక్క మరియొకప్రతిని అప్పకవి సంగ్రహించెను. దానియం దారు శ్లోకములు పోయినవి, (అహోబలపండితీయ పీఠిక)
ఇల నెనుబడి రెం డార్యలు
గలుగు పరిచ్ఛేద పంచకంబునఁ దగు....
(అప్పకవీయము 1 వ అ. 54. వ. వ.) కవిశిరోభూషణము అను వ్యాఖ్యానము మూలముననే యథర్వణ కారికావళి అను వ్యాకృతియు లోకమునకు తెలియవచ్చెను. దీనికి 'వికృతి వివేకము' నామాంతరము. ఆంధ్రశబ్దచింతామణి సాధారణముగా తత్సమశబ్ద నిరూపణ వరమయినది. అట్టి తత్సమ శబ్దరూప సాధన విషయముననుగూడ కొంత పూరింపవలసి యుండుటచే,తచ్ఛేషభూతమగు ఆంధ్ర వ్యాకరణ విషయ జాలమును విపులముగా అథర్వణాచార్వుడు వివరించి ఆంధ్రభాషకు