అహో బలపండితుడు
పేరు గాలి వారనియు కొందరు తలంచుచున్నారు. గాలి నరసయ్య అను పేరు పేలవముగా నుండుననియు ప్రౌఢతకై అట్లు వానిని సంస్కృతీకరించి యుపయోగించెననియు తలచుచున్నారు. పరిచ్ఛేదాంత గద్యమున "శ్రీమత్పొలూరి మాధవయజ్వ చంద్రసముజ్జ్వల త్కృపోక్షిత కటాక్షాసాదిత సాధు పాండిత్యాభరణ" అని చెప్పుకొనుటచే పోలూరి మాధవ సోమయాజి ఈతని విద్యా గురువనియు, "శ్రీమ త్సీతారామచంద్ర చరణారవింద మిళిందాంతఃకరణ" అనుటచే ఇతడు శ్రీరామభక్తుడనియు తెలియుచున్నది.
నియోగులయిన గాలివారును, పోలూరివారును గుంటూరి మండలమున నున్న వారట. అహోబలపతి మొదట మైదవోలులో నుండగా గుండ్లకమ్మ వరద వచ్చి ఇండ్లు పొలములు పాడుకాగా నాతడు నర్సారావు పేట జమీందారులయిన మల్రాజు వారి నాశ్రయించి అగ్రహారమును పొందినట్లు తెలియుచున్నది.
అహోబలుడు ఆత్మస్తుతిపరాయణుడుగా కనిపించును. అతడు తన్నిట్లు భూషించుకొనెను.
"యన్మూర్త్యా కవితామూల కంద వాగను శాసనౌ
జాగృతో౽హోబలపతీ రాజతే సవిలక్షణః"
కవితకు మూలకందమగు వాల్మీకియు, నన్నయభట్టును ఎవనిరూపముచే నొప్పుచున్నారో యట్టి విలక్షణుడగు నహోబలపతి ప్రకాశించుచున్నాడు.
కాలము : ఆంధ్రశబ్ద చింతామణి బాలసరస్వతి పండితునకు కీలక సంవత్సరమున దొరకెనని అప్పకవియు, అహో బల పండితుడును ఈవిధముగా వ్రాసియున్నారు.
"ఆలోకనుతుఁడు మొన్నటి కీలక సమయమున మతంగగిరికడ నొసగెన్".అప్పకవి
“జగ్రాహవ్యాకృతిం తస్మాత్కలి ర్బాల సరస్వతీ
ఎలకూచి కులాంభోధి శరద్రాకానిశాకరః.
సమస్తకవితా ధక్షొ వత్సరే కీలకాహ్వయే.”
అహోబలుడు. అప్పకవి మొన్నటి కీలక సంవత్సరమున బాల సరస్వతికి ఆంధ్రశబ్ద చింతామణి దొరికెనని చెప్పి యున్నాడు. అందుచే బాలసరస్వతికి గ్రంథము దొరికిన కీలక సంవత్సరము తరువాత మరల కీలక సంవత్సరము వచ్చులోపల 'అప్పకవీయము 'అహోబలపండితీయము '
రచింపబడెననుట స్పష్టము. మరియొక కీలక సంవత్సర మేని మొన్నటియని చెప్పుట అసంగతమగును. బాల సరస్వతికి గ్రంథము దొరకిన కీలక సంవత్సరము క్రీ. శ. 1608 అని మనము అప్పకవీయము యొక్క కాలమును బట్టి నిర్ణయింపవచ్చును. మరల కీలక సంవత్సరము క్రీ. శ. 1668 లో వచ్చును. కావున అహోబల పండితీయ మునకు చివరమితి క్రీ. శ. 1668 యై యున్నది. అహోబలపతి తన గ్రంథమునందు అప్పకవిని పేర్కొనుటయు, అప్పకవీయమునందలి పద్యముల సుదాహరించుటయు జూడ నప్పకవీయము వ్రాయబడిన తరువాత కవిశిరోభూషణము వ్రాయబడినదనుట స్పష్టము. అప్పకవీయము క్రీ. శ. 1656 సం॥లో వ్రాయుటకు నారంభింప బడినది. ఆ గ్రంథము పూర్తియగుటకును, దేశము నందు వ్యాప్తి నొందుటకును రెండు సంవత్సరములు పట్టిన వనుకొన్న యెడల క్రీ. శ. 1658-1668 మధ్యకాలమున 'అహో బలపండితీయము' వ్రాయబడెనని మనము నిశ్చయింపవచ్చును. 'అప్పకవియు, అహోబలపండితుడును సమకాలికులనియు, సమీప గ్రామములందుండు వారనియు పరస్పరేర్ష్యా ప్రేరితులనియు పూర్వము నుండి వదంతికలదు. అదియు నీ కాల నిర్ణయమునకు సహకారియే. అందుచే అహోబలపండితుడు క్రీ. శ. 17 వ శతాబ్దివాడని పెద్దలు నిశ్చయించిరి.
గ్రంథ కర్తృత్వము : ఎలకూచి బాల సరస్వతీ మహోపాధ్యాయుడు నన్నయభట్ట విరచితమును, 'శబ్దాను శాసనము' అను నవరనామముగలట్టి ఆంధ్రశబ్ద చింతామణికి ‘బాలసరస్వతీయ' మను నొక టీక వ్రాసి యుండెను. ఈ మహోపాధ్యాయుడు అప్పకవిని, అహోబలపండితునకును పూర్వుడు. ఆంధ్ర శబ్దచింతామణి నన్నయభట్ట విరచిత మేయని పలువురు ప్రామాణిక వైయాకరుణుల యాశయము. బాలసరస్వతి నన్నయభట్టారకున సకలకవితాప్రవర్తకుడు గాను, శబ్దశాసనముగాను, ఆంధ్రశబ్ద చింతామణిని శబ్దశాసనముగాను జెప్పియున్నాడు.
బాలసరస్వతికి దరువాతివాడగు అప్పకవి ఆంధ్ర శబ్ద చింతామణిలోని సంజ్ఞాసంధి పరిచ్ఛేదములకు మాత్రమే తెలుగు గద్య పద్యములలో వివరణమును వ్రాసెను. అహోబలుడు బాలసరస్వతి స్వీకరించిన ఆంధ్రశబ్ద చింతా