Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అహోబిలము


మధ్య భవనాశి, అను నెలయేరు ప్రవహించుచు. కుందు నదిలో పడును. పర్వత దక్షిణ ప్రాంతమందుగల ఉగ్ర నరసింహస్వామి దేవాలయపు మొదటిగుహ చెంత ఒక ఇనుప స్తంభ ముండుటచేత నరసింహస్వామి ఇచ్చటనే పుట్టెనని చెప్పుచుందురు.

పెద్ద అహోబిలము (దిగువ) రాతిలో ఏర్పడినది. దానికి చెంత పెండ్లికూతురుగనున్న చెంచేత కలదు. ఆమె కారణముగ అడవిలోనుండు చెంచులందరు నరసింహస్వామికి ముఖ్య భక్తులు. వారికి నేటికిని ఫాల్గున మాసములో జరుగు తిరునాళ్ళయందు కొన్ని ప్రత్యేక సౌకర్యములు కలవు. ఆ చెంచెతను చూచి లక్ష్మి తన భర్త యొక్క విశ్వాస ఘాతుకత్వమునకు చింతించి పర్వత మెక్కి 'మొనకొండ' అనుచోట నివాస మేర్పరచు కొనెను. అక్కడ ఒక వైపు భయంకరమయిన పెద్దలోయ కలదు. దానిచెంత గల ఇనుప స్తంభము చుట్టు సంతానము లేని ఆడువారు ప్రదక్షిణ మొనర్చిన సంతాన భాగ్యము నొందుదురని ప్రతీతి.

ఈ దేవాలయము 14 వ శతాబ్దియందు ప్రతాపరుద్రుని చేత నిర్మింపబడినదని చెప్పుచున్నారు. ఇంతవరకు అందుకు కావలసిన సాక్ష్యము లభింపలేదు. అది శఠకోప జియ్యంగారు మొదటి ఆచార్యుడుగా నున్నందున అతని వారసులే ఇప్పటికిని అహోబిల మఠాధిపతులుగ నున్నారు. ఇప్పుడు వారు పూజాది కార్యక్రమములను దేవస్థానమునందు నడిపించుచున్నను, మద్రాసు రాష్ట్రమందలి తిరువళ్ళూరు లోనే వారి నివాసము. విజయనగరరాజులు దేవాలయమునకు కొన్ని గ్రామములు, భూములు ఇనాములుగా ఇచ్చిరి. అందులో శిరువెళ్ళ, కోవెలకుంట్ల, బద్వేలు (కడపజిల్లాకు చెందినది) తాలూకాలలో 40 ఎకరముల భూమియు, అనంతపురంజిల్లా తాటి పత్రి తాలూకాలోని గుండాల హోబుల అగ్రహారము అను ఇనాము గ్రామములును మాత్రమే ఇచ్చట కలవు. ఒకప్పుడు దేవాలయము చాల వైభవ మనుభవించు చుండెను. ఇందు కాకతీయ, విజయనగరపు రాజుల కాలమునాటి శిల్ప సంపద దృగ్గోచరమగును. 16వ శతాబ్దమందు గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్ షా చేతులలో ఈ దేవాలయము పడినప్పుడు విలువగల ఆభరణాదులు అపహరింపబడెను. 18వ శతాబ్దములో కర్నూలు నవాబ్ అగు మున్వార్ ఖాన్ యొక్క స్వాధీనములోనికి వచ్చినప్పుడు యాత్రికుల పై పన్ను కూడ విధింపబడి యుండెనట!

కంచిలో శ్రీనివాసాచార్యుడను నాతడు చదువుకొను చున్నపుడు నరసింహస్వామి కలలో కనబడి అహోబిలమునకు వెళ్ళి సన్యాసాశ్రమము స్వీకరింపుమ నెనట ! ఆ దేవాలయపు ధర్మకర్తయైన ముకుంద రాయలకు కూడ అదేసమయమున కలలో కనబడి కంచినుండి ఒక భక్తుడు రానున్నాడు. స్వీకరింపుమనెనట. శ్రీనివాసాచార్యులు, ముకుందరావు మాట్లాడుకొనుచుండగ నరసింహస్వామి సన్యాసిరూపమున వచ్చి, శ్రీనివాసాచార్యునికి సన్యాసాశ్రమమిచ్చి “శఠకోపయతి" అని నామకరణము చేయుటవలననే వారి పరంపరకు ఆ పేరు కల్గెనని అందురు.

మొదటి శఠకోపయతి జీవిత కాలము క్రీ. శ. 1378 నుండి 1458 వరకు అని నిర్ణయము చేయబడినది. ఆతర్వాత అహోబిలములో గల శాసనములలో నొకదాని వలన క్రీ. శ. 1555 లో సదాశివరాయలు షష్ఠపరాంకుశ శఠకోపయతికి భాష్యాపురమను గ్రామమును దానముగా ఇచ్చినట్లు తెలియవచ్చుచున్నది. తరువాత క్రీ.శ. 1578-79 సంవత్సరముల మధ్య గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా విజయనగరముపై దండెత్తివచ్చి పెనుగొండవరకును దాడిసల్పెను. అప్పుడు అహోబిలము అతని స్వాధీనమగుటచేత అయిదారు సంవత్సరములు మహమ్మదీయుల వశములో నుండిపోయెను, విజయనగర చక్రవర్తి రెండవ వేంకటపతిరాయలు క్రీ. శ. 1584- 85 సంవత్సరములో మరల అహోబిలమును స్వాధీనము చేసికొన్నట్లు అచటగల శాసనము ధ్రువపరచుచున్నది. చంద్రగిరిలో సాళువ వంశీయుల కాలమునుండి శ్రీకృష్ణ దేవరాయలవరకు ఈ క్షేత్ర మన్ని విధముల ప్రాశస్త్యమును గలిగి ఉండెనని చెప్పవచ్చును.

ఇనుప స్తంభము విడెము కొమ్మరాజు అను వానిచేత 14 వ శతాబ్దియందే నిర్మింపబడినదని చెప్పుదురు. దేవాలయ మందు 15, 16 శతాబ్దులకు చెందిన అనేక దాన శాసనములు కొండవీటి రెడ్డిరాజుల నాటివి విజయనగర రాజులనాటివి కలవు. వానివలన కొంతవరకు చరిత్రను