అస్సామీ భాషా సాహిత్యములు
దేవత యొక్క ఆరాధనమునకు సంబంధించిన యొక నూతన మతసిద్ధాంతమును ప్రతిపాదించు నిమిత్తమై అస్సామీ భాషలో నొక గేయకావ్య పరంపరను వ్రాసి, తన్మూలమున నొక నూతన పురాణమును సృజియింప యత్నించిరి. దుర్గావరకవి రామాయణమునందలి కరుణ రసాత్మకములయిన ఘట్టములను ఎడ నెడ సాధారణ పద్యములతో మేళవించుచు, నొక చిన్న కీర్తనావళిగా రచించెను. పీతాంబరకవియు ఈ రచనా విధానము ననుసరించి, ఉషా పరిణయము, భాగవత దశమస్కంధము చండీ-ఆఖ్యానము అను గ్రంథములను వ్రాసెను. ముగ్గురు కవుల గ్రంథములకును, వారి సమకాలికులగు ఇతర వైష్ణవకవుల గ్రంథములకును రూపమునందును,విషయమునందును భేదముకలదు. పొచాలి లేక పొంచాలి అనబడేడి ఈ (రచనా) రూపము అనాడు వంగదేశము నందు సర్వసాధారణ మయిన రీతియై యుండెను. ఆనాటి (కావ్య) విషయము బుద్ధికికంటె ఇంద్రియములకే ఎక్కుడు ప్రీతికరమయినదై ఉండెను.
శంకరదేవకవి ప్రతిపాదించిన నూతన వైష్ణవ సంప్రదాయమునందలి ముఖ్యసిద్ధాంతము అద్వైతతత్త్వము. ఈ సంప్రదాయమునకు చెందిన భక్తులు విష్ణు - కృష్ణుని నామమును లో నావృత్తిచేయుట (జపించుట), ఆతని నామములను ఉచ్చరించుట, లేక అతని దివ్యలీలలను గాన మొనర్చుట, ఆ భగవంతుని చేరుటకు ముఖ్యమార్గములని విశ్వసించిరి. దీనికి 'ఏకశరణ నామధర్మము' అని పేరు. ఈ మతము ఏకేశ్వరోపాసనమునే విధించి, తదనుయాయులు ఇతర దేవతారాధనమును చేయగూడదని నిషేధించును. ఈ వైష్ణవ సంప్రదాయము రాధాకృష్ణమత సంప్రదాయముతో నేకీభవింపదు. ఈ యుద్యమము దానితోబా టొక సారస్వత విప్లవమునుగూడ కల్గించెను. శంకరదేవ కవియు, అతని ప్రియశిష్యుడును, మాధవదేవ కవియు అనేకములయిన కీర్తనములను, రూపకములను, పద్యకథలను తదితర సారస్వత ప్రక్రియలను రచించిరి. ఈ సాహిత్యయుగము ఏకమతగ్రంథ యుగము అనగా భాగవతయుగము; ఏక దేవయుగము అనగా విష్ణు-కృష్ణ యుగము అని పేర్లు. శంకరదేవకవి భాగవత పురాణము నందలి పండ్రెండుస్కంధములలో ఎనిమిది స్కంధములను అనువదించినట్లు తెలియుచున్నది. ఆ పురాణము నందలి శేషించిన స్కంధములను అనువదించుట కయి ఇతనిచే నితర విద్వాంసులు ప్రోత్సహింపబడిరి. శంకరదేవకవి కృతులలో అత్యుత్తమ రచనయైన 'కీర్తనఘోష' అను గ్రంథము భాగవతసారరూప మనవచ్చును. శంకరదేవకవి భాష చాలవరకు సరళమైనది. అందలి స్వరమాధురిలో సౌందర్య గాంభీర్యములు రెండును ప్రవ్యక్తము లగు చుండును.
వరగీతములు (Bargitas) అను అనేక కీర్తనములను, పత్నీప్రసాదము. కాళీదమనము, కేళీ గోపాలము, రుక్మిణీ హరణము, పారిజాతహరణము, రామవిజయము, అను నాటకములను రచించుపట్ల ఇతడు సృజనాత్మక ప్రతిభతోను, ధైర్యముతోను భాష యొక్క పరిధిని విస్తృత మొనర్చి 'ప్రజబులి' భాషయందు నూతనమైన జాతీయ (idiom) ప్రయోగ సంప్రదాయమును కల్పించెను.
మాధవదేవకవి వరగీతములను 'చోరధరా' 'పింప రాగుఛువా' మున్నగు నాటకములను వ్రాసెను. వాటి యందు అతని గురువు యొక్క కృతులందుకంటే ఎక్కుడు కోమలమైన శిల్ప కౌశలము కనిపించును. శంకరదేవకవి కృతులందు దాస్య భావము ప్రవ్య క్తమగుచుండ, మాధవ దేవకవి రచనలందు వాత్సల్యము అతిశయించును, మాధవదేవకవి శ్రీకృష్ణుని బాల్య క్రీడలను అమితోత్సాహముతో వర్ణించెను. బాలకృష్ణదేవుడు తన తల్లియగు యశోదకును, బృందావనమునందలి గోపికలకును ప్రదర్శించిన లీలలును, అతడు వారి ఆజ్ఞకు బద్ధుడగుటయు ఆ కవికి అనిర్వాచ్యమైన ఆశ్చర్యమును కలిగించెను. 'నామఘోషా' అనునది ఆతడు రచించిన మహోత్కృష్టమైన కావ్యము. అందాతని ఉత్తమ భక్తియు, తత్వజ్ఞతయు తేటపడుచున్నవి.
శంకరదేవ కవికి సమకాలికులయిన మరి యిరువురు ప్రముఖ కవులు కలరు. వారు అనంత కందళి, రామ సరస్వతి అనువారలు. వారిలో మొదటికవి వైష్ణవ గుర్వా దేశమును పురస్కరించుకొని భాగవతము యొక్క ఉత్తరార్థమునందలి దశమస్కంధమును అనువదించెను. రెండవకవి వినమ్రతతో ఆ సాధువునకు అనుయాయియై అతని నుపాసించెను. కందళికవి రచించిన 'కుమార