అస్సామీ భాషా సాహిత్యములు
నుల కే సాధ్యపడగలదు.ఆ విధముగా గానము చేయబడినపుడే వాటికి ప్రయోజనము కలదు.
వి. వ. న.
అస్సామీ భాషా సాహిత్యములు :- అస్సాము నందు అనేక అనాగరకజాతులకు చెందిన భాషలు వ్యవహారమున గలవు. ఈ ముఖ్యకారణమునుబట్టి దానికి 'భాషా శాస్త్రజ్ఞుల స్వర్గము' అను పేరు వచ్చెను. 'అసామియా' (అస్సామీ భాష) అనునది అస్సామునందలి ముఖ్యభాష. దేశమునందలి ఈభాగమునకుగల 'అస్సాము' అను ప్రాచీన నామమునుబట్టి ఆభాష కీ పేరు కలిగినది. అస్సామునకు, కామరూపము, ప్రాగ్జ్యోతిషము అనునవి ప్రాచీనతరము లయిన పేళ్ళు. అస్సామియా అనునది సంపూర్ణవికాసము నొందిన అర్వాచీనమైన ఇండో-ఆర్యను భాష. అది మాగధి అను అపభ్రంశము (భాషా విశేషము) నుండి పుట్టియుండవచ్చును. అందలి వ్యాకరణమునందును, పదములందును టిబెట్టు భాష యొక్కయు, బర్మాభాషయొక్కయు ప్రభావము విశేషముగా గోచరించును. అందలి పదజాలమున స్వల్పముగా ఆస్ట్రికు భాషాసంబంధము కూడ కలదు. క్రీ. శ. 7వ శతాబ్ది యొక్క పూర్వార్థమునాటికే కామరూప రాజగు భాస్కరవర్మ యొక్క ముఖ్యపట్టణమును యువాన్ ఛాంగు దర్శించెను. అక్కాలమున అచ్చటి భాష మధ్య భారతమునందలి భాషకంటే కొంచెము భిన్నముగా, అనగా, అప్పటి ఆర్య - టిబెట్టు - బర్మాభాషల యొక్క మిశ్రముగా - అతనికి గోచరించెను.
క్రీ. శ. 8.10 శతాబ్దులలో ఇరువది ముగ్గురు సిద్ధపురుషులు 'చర్యా' లేక 'చర్యాపదములు' అను గూఢతత్త్వ బోధకము అయిన గేయములను వ్రాసిరి. ఆ గేయము లందు సహజయానమునకు సంబంధించిన గూఢతత్వములును, శృంగార సంప్రదాయములును ముఖ్యవిషయముగా ప్రతిపాదింపబడినవి. అవి మొత్తముమీద ప్రాగ్భారతమునకు చెందినవై యున్నవి. ఈ చర్యాపదములకు గాని, చర్యాపదములను వ్రాసిన కవులకుగాని బౌద్ధమతము యొక్క గూఢతత్వమునకు కేంద్రమై పర్తిల్లిన కామరూపముతో సంబంధము ఊహింపబడు చున్నది.
అస్సామీ సాహిత్యయుగము ప్రశస్తమైన పద్య వాఙ్మ యోత్పత్తితో ప్రస్ఫుటముగా బయలు వెడలెను. దాని కాధారములు భారతీయములై సుప్రసిద్ధములైన రెండు వీర కావ్యములును, పురాణములునై యున్నవి. 'మాధవ కందళి' (క్రీ. శ. 1400) అను నాతడు ఆయుగమునందలి కవులలో మిక్కిలి యెన్నదగిన వాడు. అతడు శ్రీమద్రామాయణాంతర్గతము లయిన మధ్యకాండము లైదింటిని సజీవమును, సహజమునైన అస్సామీ భాషలో పద్యరూపముగా అనువదించెను. హరివరవిప్రుడు, హేమసరస్వతి అను నిరువురు కవులును రాజగు దుర్లభనారాయణుని (క్రీ.శ.1300) కి సమకాలికులు. దుర్లభనారాయణుని కొడుకగు ఇంద్రనారాయణుడు పరిపాలించు కాలమున “కవి రత్న సరస్వతి” కావ్యరచన యొనర్చెను. 'రుద్రకందళి' అను మరియొకకవి 'ఈ యుగమునకు చెందిన తామ్రధ్వజుడను నింకొకరాజును పేర్కొనెను. 'హరివరుడు' ఈ యుగమునందలి ఉత్తమకవులలో రెండవస్థానము నాక్రమించినవాడు. జై మినీయ- అశ్వమేధ పర్వమున వర్ణింపబడిన శ్రీరామునకు కుశలవులతోను, అర్జునునకు తన కుమారుడయిన బభ్రువాహనునితోను, ప్రవర్తిల్లిన యుద్ధముల వృత్తాంతమును అతడు పునఃకథన మొనర్చెను. 'హేమసరస్వతి' వామనపురాణమునందలి ప్రహ్లాద హిర ణ్యకశిపులు కథను నూరు పద్యములుగా అనువదించెను. అనేక పురాణములు ఆధారముగా రచితమైన 'హర గౌరీ సంవాదము' అను రెండవ గ్రంథముకూడ అతని రచనగానే ఊహింపబడు చున్నది. కవిరత్న సరస్వతీ రుద్రకందళులు మహాభారత - ద్రోణపర్వమునగల జయ ద్రధవధ అనెడి పర్వమునకు సంబంధించిన స్వల్ప భాగములను ఆస్సామీ పద్య కావ్యముగా కూర్చిరి.
క్రీ. శ. పదునేనవ శతాబ్ది యొక్క అంతమందు శంకర దేవుని అభినవ వైష్ణవోద్యమ (1449-1568) రూపమున దేశమున నొక మహాశక్తితోగూడిన (మత) పునరుద్ధరణము ఆరంభమయ్యెను. ఇ య్యుద్యమముతో సంబంధము లేని మంకరుడు, దుర్గావరకాయస్థుడు, పీతాంబరుడు' అను ముగ్గురు కవులు పదునారవ శతాబ్ది ప్రథమ భాగమున తమ రచనలు కావించిరి. వారిలో మంకరకవి దుర్గావరకవి- ఇరువురును 'మనసా' అను పేరుగల సర్ప