Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశ్వశాస్త్రము


గలవి ఆగ్నేయీచ్ఛాయలు. విడివిడిగా పరుషమయిన కాంతి గలవి వాయవీచ్ఛాయలు. ఆకాశకాంతి గలవి నాభసీచ్ఛాలు.

గమనము  : సింహము, వ్యాఘ్రము, ఏనుగు, హంస, నెమలి, శరభము, వృషభము, ముంగిస, కోతి, లేడి, ఒంటె యనువాని గమనములవంటి గమనములుగల గుఱ్ఱములు శుభదములు. వంకరనడకలుగలవి, విషమగతుల నొప్పునవియు, తొట్రుపాటు గలవియు, నిబ్బరములేని నడకలు గలవియు నగు గుఱ్ఱములు హీనజాతులు.

గంధము : కన్నులు, చెవులు, మోము, ముక్కు రంధ్రము లనువానియందును, చెమ్మటయందును, మూత్ర పురీషములయందును సుగంధము గలవి ప్రశస్త హయములు. దుర్గంధముగలవి దుర్జాతివి. మద్దిచెట్టు, కడిమి చెట్టు, కొండమల్లెలవంటి పరిమళము గలవి యుత్తమాశ్వములు. నేతివాసన, పాలవాసన కలవియు శ్రేష్ఠములు.

స్వరము  : వీణ, పిల్లనగ్రోవి, మద్దెల, భేరులధ్వనుల వంటి సకిలింతకలవి శ్రేష్ఠాశ్వములు, గజము ఘీంకరించు నట్లును, వ్యాఘ్రము బొబ్బలిడినట్లును, సింహము గర్జిల్లి నట్లును వినవచ్చు హేషారవము ప్రశస్తము. త్రుటితమైనదిగను, గద్గద మైనదిగను, పరుషమైనదిగను వినబడు హయస్వరము చెడ్డది. రాబందులు, ఒంటెలు, అర చునట్లరచునవి హీనాశ్వములు. ఇట్టి దుష్టాశ్వములు యజమానుని సంపదలను హరింపజేయును.

సత్త్వము  : బ్రహ్మ, ఈశ్వరుడు, మహేంద్రుడు, కుబేరుడు, యమధర్మరాజు, గంధర్వుడు మున్నగువారి సత్త్వమువంటి సత్త్వము గలవి యుత్త మాశ్వములు. రాక్షసులు, పిశాచములు, పితృదేవతలు, మహాసర్పముల సత్త్వముగలవి మధ్యమాశ్వములు, వీనిలో దేవసత్త్వములును, రాక్షసాది సత్వములును గల తురంగములు గ్రాహ్యములు. భీరువులు, కలహపరములు, శుచిరహితములు నగు హీనసత్త్వములు త్యాజ్యములు.

ఆవర్తములు  : అశ్వలక్షణములలో ఆవర్తము అత్యంతము ముఖ్యములయినవి. శిశువు గర్భమునం దుండగా గర్భవాయువు మిక్కిలి వేగముగ తిరుగుచు, శిశు శరీరము నందలి రోమములను సుడులుగా త్రిప్పుటవలన సుళ్ళు ఏర్పడుచున్నవి. ఆవర్తము, శతపాది, శుక్తి, అవలీఢకము, పాదుక, అర్ధపాదుక, సమూహము, ముకుళము - అని యావ ర్తములస్వరూప మెనిమిది విధములు . నీటి సుడిగుండమువలె నుండు నుడి ఆవర్త మనబడును. జెట్టికి శతపాది యని పేరు. అట్టి జెట్టివలెనుండు సుడి శతపాది. ముత్యపుచిప్ప యాకారముగలది శుక్తి యను సుడి. దూడ నాలుకతో నాకినట్లున్న సుడి అవలీఢకము. పాదుకవంటిది పాదుక సుడి. సగము పాదుకవలె నున్నది. అర్ధపాదుక . మంచుగుట్ట వంటిది సమూహావర్తము. మొగ్గ వంటి యాకృతిగల సుడి ముకుళము.

ఆవర్తముల ప్రమాణము : నీటిగుండమువంటి సుడి ముప్పావంగుళము ప్రమాణము గలదియై యుండవలెను. శతపాది సుడి నాలు గంగుళములు. శుక్తి రెండంగుళములు, అవలీఢకము మూడు అంగుళములు. పాదుక నాలు గంగుళములు. అర్ధపాదుక ముప్పా వంగుళము, సమూహమను సుడి అష్టాంగుళము. ముకుళావర్తము ముప్పావంగుళ ప్రమాణము గలదియై యుండవలెను. ఈ ప్రమాణముగల సుళ్ళు వానివాని ఫలముల నొసగును. ఉక్తప్రమాణములకంటె యెక్కువయై యున్నను తక్కువయైన వైనను వాని ఫలముల నొసగవు.

ముఖ్యములయిన కొన్నిసుళ్ళు : గుఱ్ఱములకు ముఖ్యముగా పదిచోట్ల సుళ్ళుండవలెను. ఉరమునందును, రంధ్రోపరంధ్రములయందును, శిరమునందును రెండేసియు, నుదుటిమీదను, మూతిమీదను, ఒక్కొక్కటిగాను మొత్తము పది సుళ్ళుండవలెను. పదిసుళ్ళకు తక్కువయున్న గుఱ్ఱ మల్పాయు వగును.

జూలునందు శుభావర్తములు : సెలవులయందును, నుదుటియందును, ముంగాళ్ళ యందును, నొసటను, కంఠమునను, జూలు నందును, చెవిగూబలయందునుగల సుళ్ళు శుభప్రదములు. ము త్తెపుచిప్పవంటి సుళ్ళున్న హయము మిక్కిలి ప్రశస్తము. చెవిగూబలయందలి నుడికి వృషభా వర్తమని పేరు. అట్టి వృషభార్తవమను సుడిగల తురంగ మును ఎంత వెలయిచ్చియైనను కొనవలె నని యందురు.నాలుగుమూలల నాలుగు సుళ్ళున్న తురంగము చాతు రంతిక మనబడును. ఏ యశ్వము నెన్నోసట చాతురంతి కావర్తము చూపట్టునో ఆ హయము యజమానునకు రాజ్యలాభమును చేకూర్చును. ఒక దానిపై నొకటి నిచ్చెన