Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశ్వశాస్త్రము


మెట్లవలెనున్న సుళ్ళకు నిశ్రేణిక యని పేరు. అట్టి నిశ్రేణిక నొసటగల అశ్వము తనస్వామికి విభవైశ్వర్యముల నొసగజేయును. వక్షస్థలమున నాలుగు సుళ్ళున్న గుఱ్ఱమును శ్రీవక్షకి అందురు. ఇది ఉత్తమోత్తమ హయము. ఉరమున మూడు శుక్తులుగల గుఱ్ఱము నెక్కు వానికి జయము సిద్ధించును. పద్మము, కులిశము, కలశము, తోమరము, చక్రము, ముసలము, ముకురము, శంఖము, చంద్రుడు, మణి, ఖడ్గము, అంకుశము మొదలయిన రూపములలోనుండు తెల్లని బొల్లియుండు గుఱ్ఱములు శ్రేష్ఠము లయినవి.

అశుభావర్తములు  : హృదయమున నొకటే సుడిగల గుఱ్ఱము యజమానుని యుద్ధమున మడియజేయును. కక్షావ ర్తముకూడ అశుభమైనదే. మూపురస్థానముననున్న సుడి చెడ్డది. మోకాళ్ళమీదనుండు సుళ్ళు శుభ ప్రదములు కావు. వెన్నున సుడిగల యశ్వము నెక్కరాదు. గండ స్థలముల రెండిటను సుళ్ళుండకూడదు. శంఖమువంటి సుడిచెడ్డది. దండావ ర్తము, క్రోడావర్తము అనునవి దూష్యములు. ముక్కు రంధ్రముల సమీపమునగల సుళ్ళు అమం గళకరములు. ముక్కుదూలమునకు నడుమ సుడియున్న తురంగము మృత్యుదేవతవంటి దని హయలక్షణవేత్త లందురు. పై పెదవులమీదనున్న సుళ్ళు చెడ్డవి, మెడ మీదనుండు గ్రీవావర్త మనునది కీడుకలిగించును. పట్టెడ పెట్టుచోటగల సుడి హాని కలిగించును. గుదము, నాభి, కటిస్థలము, ఉదరము, తొడలు, బీజములు, చెవులు, వృష్ఠభాగమం దున్న సుళ్ళు దుష్టములు.

అశ్వదంతోద్భేదము - వయోజ్ఞానము  :- దంతములను బట్టి అశ్వముల వయస్సును గుర్తింపవచ్చును. పుట్టిన మాసమున హయమునకు రెండు దంతములు తోచి, రెండవ మాసమున నవి పూర్ణములగును. మూడవ నెలలో నడిమి దంతములు రెండు పొడమి నాల్గవ నెలలో నవి నిండుగా గన్పడును. అయిదవ నెలలో ప్రక్కదంత యుగ్మము వచ్చి ఆరవనెలలో గట్టిపడును. ఇట్లే పుట్టినది మొదలుగా పండ్రెండవ మాసము పూర్తియగువరకు హయములకు దంతము లన్నియు వచ్చును. ఒక యేడు వయస్సుగల గుఱ్ఱమునకు దంతములు తెల్లగానుండును. రెండవ యేట ఆ దంతములు కషాయ వర్ణములుగా మారును. హయమునకు అయిదవయేటనుండి మూడేసి యేండ్ల కొక వ్యంజనముగా తొమ్మిది వ్యంజనములు తోచును:— కాలికము, హారిణి, శుక్లము, కాచము, మాక్షికము, శంఖము, ఉలూఖము, చలనము, పతనము. మొదటి యైదువర్షములకు బిమ్మట, మూడేండ్ల కొకసారి హయముల దంతముల వర్ణములు మారుచుండుటయు, కడపటి దశలో కదలుటయు, రాలుటయు సంభవించును. హయమునకు సంపూర్ణా యుర్దాయము ముప్పది రెండేండ్లు. చెవికొనలు నలువగా రక్తచ్చాయ, సిందూర వర్ణముగాగన్పడు గుర్రములు దీర్ఘ కాలము జీవించును.

అశ్వసాముద్రికము  :- హస్తరేఖలను జూచి మానవుల యాయుః ప్రమాణాది ఫలములను జెప్పినట్లే గుఱ్ఱపు ముక్కు మీది (పోథముమీది) రేఖలనుబట్టి దాని యాయుః ప్రమాణాదులను జెప్పుదురు. ముక్కు నడుమ బుట్టి పైకి వ్యాపించిన రేఖవలన ఆ గుఱ్ఱము ముఖరోగము వలన సంవత్సరార్ధమున మృతిచెందు నని చెప్పనగును. అట్టి యూర్ధ్వ రేఖలు రెండంగుళముల ప్రమాణము గలవి రెండున్నచో ఆ హయము రెండేండ్లు మాత్రమే జీవించునని చెప్పవచ్చును. ఆ రేఖలే అడ్డముగా నున్న యెడల మూడు సంవత్సరములకు దౌడలు పట్టుకొనిపోవు రోగము వలన ఆ గుఱ్ఱము చచ్చును. ఆ రేఖలే వంగినట్లున్న నాలుగేండ్లకు మృతి సంభవించును. ఊర్ధ్వరేఖ ముక్కు మీద ఎడమవైపుననుండి కొన వాలియున్న దైనచో ఆ తురంగము పంచమాబ్దమున పంచత్వము నొందును. రెండంగుళముల ఊర్ధ్వ రేఖ గల దానికి ఆరేండ్లయాయువు. అర్ధాంగుళము పొడవుగల్గి. నడుమ ఎత్తుగానున్న రేఖగల యశ్వము ఏడేండ్లకు చచ్చును. మూడంగుళముల పొడవుగల ముక్కు గీతవలన ఆ గుఱ్ఱము ఎనిమిదవ ఏట జ్వరముతో, మరణించునని తెలియ దగును. మధ్య స్థూలమైనగీతగలది తొమ్మిదవ యేటను, వంకరరేఖ గలది పదియవ యేటను, రెండంగుళముల వెడల్పున ఊర్ధ్వ రేఖగలది ద్వాదశవర్షమునను, లావు పొడవు నుండు రేఖ గలది త్రయోదశాబ్దమునను, కాకి కాలిగుర్తు రేఖగలది పదునా ల్గవ యేటను రెండంగుళములకు మించిగాని, తగ్గిగాని యున్న రెండు రేఖలు గలది పంచదశవర్షమునను, ఆ రేఖయే యొకటి తెల్లగుఱ్ఱమునకైన అది పదునారవ