అశ్వశాస్త్రము
గుండ్రనిదియైన పొట్ట తగినట్టిది. ఎక్కువ దీర్ఘమైనదిగాక, బల్ల పరుపుగానుండి, కొంచెముగా వంగియున్న వీపు శుభ
మైనది. పిరుదులు పెద్దవియైయుండవలెను. మెత్తనివియు నిగనిగలాడునట్టివియు, పొడవై నట్టివియు నగు వాలము
లతో గుండ్రని కుచ్చుగా నున్న తోక ప్రశంసనీయమైనది.
అవయవముల పరిమాణము : ముప్పది రెండంగుళముల ముఖముగలది యుత్తమాశ్వము. అంతకన్న రెండంగుళములు తక్కువ ప్రమాణము గల ముఖము గలది మధ్యమాశ్వము. తక్కినది కనిష్ఠము. ఉత్తమాశ్వమునకు మెడ ఏబదియారంగుళముల పొడవు గలదై యుండును. నలుబదియారు, ముప్పదియారు అంగుళముల మెడలుగలవి మధ్యమ, కనిష్ఠములు. వక్షస్థలము, వృష్ఠము, కటి యనునవి ముఖముతో సమాన ప్రమాణముగలవి. చెవులు ఏడంగుళములు, తాలువులు ఆరంగుళములు, గిట్టలు ఏడంగుళములు ఉండవలెను. ఎనిమిది యడుగుల యెత్తు గలది యుత్తమాశ్వము. ఏడడుగుల యెత్తు గలది మధ్య మాశ్వము. ఆరడుగుల ఎత్తు గలది కనిష్ఠము. పది యడుగుల యడ్డపుకొలత గలది శ్రేష్ఠమైనది. ఎనిమిది యడుగులది మధ్యమము. ఏడడుగులది హీనాశ్వము.
వర్ణము : తెల్లనివి, నల్లనివి, ఎఱ్ఱనివి, పసుపుపచ్చనివి శుద్ధవర్ణములు. మిశ్రవర్ణము లనేక విధములు. జూలు, తోక వెండ్రుకలు, రోమములు, చర్మము, గిట్టలు, తెల్లనైన గుఱ్ఱము శంఖాభ మనబడును. ఇది విప్రజాతి గుఱ్ఱము. జూలు మున్నైనవి తెల్లనై, చర్మము నల్లనైనది కర్తల మను హయము. సర్వావయవములు నల్లనైనది కాల మను గుఱ్ఱము. ఇది శూద్రజాతిది. సమస్తావయవములు ఎఱ్ఱనైనది కుంజాభ మను తురంగము. ఇది క్షత్రియజాతిది. జూలు, రోమములు, వాలము సర్వము బంగారువన్నె గలది శేరభము. ఇది వైశ్యజాతిది. రోమములు పసుపుపచ్చ, ఎరుపు కలిసియుండి, ముఖము, కాళ్ళు, తోక, జూలు ఎఱ్ఱనై నది చోర మనబడును. వాలము కాళ్ళు, ముఖము నల్లనైనది రురువు. తెలుపు, నలుపు కలిసియున్న రోమములు గలది వీలము కలిగొట్టు పువ్వు వన్నె గలిగి పిక్కలు నల్లనైనది మేఘ మనబడును. పక్వమైన నేరేడుపండు వన్నెగలది జాంబవము. ఇట్లీ చిత్రజాతులలో, రుచిరము, సుమనము, శ్యామకర్ణము,
కల్యాణ పంచకము, అష్టమంగళము, మల్లికాక్షము, ధౌతపాదము, హాలాభము, కరంజము, బింబకము మున్నగునవి కలవు. వీనిలో శ్యామకర్ణ మనునది మిక్కిలి ప్రశస్తమైనది. ఇది శరీర మంతయు తెలుపు, చెవులు మాత్రము నలుపువన్నె గలిగిన గుఱ్ఱము. ఈ శ్యామ కర్ణమే యశ్వమేధ యాగమున ప్రధాన పశువుగా నుపకరించునట్టి యశ్వరాజము. నాలుగు పాదములు, ముఖ మధ్యము తెల్లనైనది కల్యాణ పంచకము. ఇది కల్యాణ ప్రదమైన తురంగము. జూలు, తోక, రొమ్ము, ముఖము, నాలుగు కాళ్ళు అను నెనిమిది యవయవములు తెల్లనైనది అష్టమంగళము. ఇదియు మిక్కిలి ప్రశస్తమైన గుఱ్ఱము.
వర్జనీయములగు అశ్వములు :- శరీరమంతయు తెల్లగా నుండి, నాలుగు పాదములు నల్లగానున్న యశ్వము యమదూత వంటిది. సర్వనాశనకారి. ఇట్టిది వర్ణనీయము. తోకగాని శిరస్సుగాని హీనవర్ణమైనది త్యాజ్యము. శరీర మంతయు నోకవర్ణమై శిరముగాని, తోకగాని వేరొక వర్ణమైనది యశుభము. తక్కువ దంతములు గలదియు, ఎక్కువ దంతములు గలదియు విడువదగినవియే, నల్లనైన తాలువులు గలది కీడు. నమలునపుడు క్రింది దంతములతో పై దంతములుగాని, పై దంతములతో క్రింది దంతములుగాని రాపిడి పడిన గుఱ్ఱము నిలుపదగనిది. మూడుకాళ్ళు నల్లనై, ఒకకాలు తెల్లనైన దానిని ముసలి యందురు. ఇది యశుభంకరము. చెవుల చెంత కొమ్మువంటి సుడిగలది శృంగిక మనబడును. పెద్ద పులివంటి వర్ణముగలది వ్యాఘ్రాభము. స్తనమువంటి చర్మము వ్రేలాడునట్టిది స్తని. అవుగిట్టవలె చీలిన గిట్టగలది ద్విఖురము. మూపున సుడిగలది కకుది. ఒక అండమే కలది ఏకాండకము. బూడిదవన్నె ముఖము, తోకగలది భస్మాభము, ఇవియన్నియు దూష్యములు. సర్వము నల్లనైనది నింద్యము. సర్వము తెల్లనైనది శుభదము.
ఛాయలు :- నునుపుగా నిగనిగలాడుచున్నవి, చూడ ముచ్చటైన ముదురు రంగులవి పార్థివచ్ఛాయలు. క్రొత్త మేఘములు, తామరపూలు, నీరువంటి కాంతి గలవి వారుణములు. బంగారము, చిగురుటాకులవంటి వన్నెలు