Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసాని పెద్దన


పెద్దన విరచితములేయని పూర్వలాక్షణికులును,వ్యాఖ్యాతలును వ్రాసిరి. ఈ వ్రాతలు నిజము కావనియు శ్రీకృష్ణదేవరాయలే పై గ్రంథముల రచించెననియు నాధునిక పండిత విమర్శకులు నిర్ధారించిరి. అనేకులు దీని నామోదించిరి.

పదునారవ శతాబ్దమునకు పూర్వపు టాంధ్రకవులందరును నన్నయ మార్గము ననుసరించి సంస్కృత పురాణములనో, కావ్య నాటకాదులనో తెనిగించుచు నాంధ్ర సారస్వతము నభివృద్ధి కావించిరి. కాని వీరు స్వతంత్ర రచనలకు పూనరయిరి. ఇట్టియెడ పదునారవ శతాబ్ది ఆరంభమున అల్లసాని పెద్దన మనుచరిత్రమును రచించి ప్రబంధ కవులకు మార్గదర్శి యయ్యెను. మనుచరిత్రమున కే స్వారోచిష మనుసంభవ మనునది నామాంతరము. ఇందలి కథ మార్కండేయ పురాణాంతర్గతము.ఈ పురాణమును పెద్దనకు పూర్వుడుగు మారనకవి తెనిగించెను. ఇయ్యుభయ పురాణముల ననుసరించి పెద్దన మనుచరిత్రమను మహా ప్రబంధమును రచించెను. మూలములోని కథను చాలవర కీకవి యథాతథముగ గైకొనెను. ఔచితీ పోషణమునకై కొన్ని చిరుమార్పులు కావించెను. స్వారోచిషుడను ద్వితీయ మనువు యొక్క జన్మ వృత్తాంత మిందలి యితివృత్తము. ఈ కథ మూలము నందు స్వారోచిషుని పితరుడగు స్వరోచి యొక్క సంభవమునకు హేతుభూతమగు వరూధినీ ప్రవరుల వృత్తాంతముతో ప్రారంభమయి, స్వారోచిషునకు మనుత్వము సిద్దించుటతో ముగియుచున్నది. పెద్దనయు నీకథ నిట్లే చిత్రించెను. ఈ కారణముననే కొందరిందు వస్వైక్యము లేదనుటకు వీలయ్యెను. కాని నాటకములందిది పాటింప బడినంతగా కావ్యములందు పాటింపబడక పోవుటచేత దీనియొక లోపము కాజాలదు. పురాణ కథనే చేపట్టినను పెద్దన యిందు లాక్షణిక నిర్దిష్టములగు నష్టాదశ వర్ణనలను సందర్భోచితముగా కల్పించి మిక్కిలి రసవంతముగా వర్ణించి మూలకథను నాల్గు రెట్లు పెంచి మనుచరిత్రము నొక స్వతంత్ర ప్రబంధముగా నిబంధించెను. ఇందలి వర్ణనములలో పెక్కులు స్వకపోల కల్పితము లగుటచే నిది యనువాద గ్రంథము కాదు. కథ పురాణ ప్రసిద్ధమగుటవలన కల్పితమును కాదు. ఇందలి ప్రధాన రసము శృంగారము. ఇతర రసములును యధోచితముగ పోషింపబడేమ. మొదటిదగు ప్రవర వరూధినీ వృత్తాంతమును పెద్దన మిక్కిలి మనోహరముగను రసవంతముగను రచించి కృతకృత్యుడయ్యెను. రససమంచిత కథలతో కూడిన స్వారోచిషమను సంభవ కథను చతుర రచనతో ప్రబంధముగ రచించుటయే కృతిభర్త యొక్కయు కృతికర్త యొక్కయు ఉద్దేశమని మనుచరిత్ర పీఠిక వలన తెలియుచున్నది.

కవి యిందు నాటకఫక్కి ననుసరించి కూర్చిన వరూధినీ ప్రవరుల సంభాషణము హృద్యాతిహృద్యము, ఇట్టి సంభాషణములు, సంవాదములును కల సందర్భము లీప్రబంధమున మరికొన్ని గలవు. ఐనను ప్రవరవరూధినుల సంభాషణ రూపపద్యములు పెద్దన రచనా చాతుర్యమునకును ఔచితీ నిర్వహణనైపుణికిని చక్కని నిదర్శనములు. అందును వారి తొలిసంభాషణములోని "ఎవ్వతె వీవు' 'ఇంతలు కన్నులుండ' అను రెండు పద్యములును రెండు రత్నములు, ఉత్కృష్టమైన వ్యంగ్యవైభవశోభితములు. 'అల్లసానివాని యల్లిక జిగిబిగి' వీనియందు పరాకాష్ఠనంది వ్యక్తావ్య క్తముగా కాననగును. ప్రవరునిపాత్ర యాంధ్రసాహిత్యమునందు విశిష్టమైనది. అతని మనోజ్ఞమూర్తి, ధర్మకర్మదీక్ష, ఏకపత్నీ వ్రతము, పరస్త్రీ వై ముఖ్యము, శాంతరసమొల్కు బ్రహ్మతేజస్సు, వైరాగ్య వహ్ని తప్తమై పుటములుదేరిన యతని మనోనైశ్చల్యము మున్నగు ధీరశాంతగుణములు మనుచరిత్ర ప్రథమ ద్వితీయాశ్వాసములలో కన్నులగట్టినట్లు చిత్రింపబడినవి, ననవిల్తు శాస్త్రంపు మినుకులను వెన్నతో నభ్యసించిన ప్రోడయగు వరూధినీ వచోవైదగ్ధ్యమును కామశాస్త్రొ పాధ్యాయిత్వము క్రింద కట్టివేసిన అకాముకు డితడు. మె మేని జవ్వాది పనగదంబించు నొడలు గడిగికొని వార్చి శుచియైన వాసనారహితుడు. పెద్దనవంటి సిద్ధహస్తుని చేతిలో పడుటచేత ప్రవరుడు కేవల ప్రబంధ మాత్రోవ జీవికాక, యాంధ్రుల హృదయప్రపంచమున శాశ్వత సజీవవ్యక్తిత్వమును సంపాదించుకొన గలిగెను. దేవవేశ్యయగు వరూధినియందు, తాము వలచిన వారినివలలో వైచుకొనుటకై వారవనిత లుపచరించు వగలు, వలపులు చూపి, యవి నిష్ఫలము లైనపుడు వానిని